పాక్లో హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మైనార్టీలుగా ఉన్న హిందూ మతానికి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, ముస్లింలతో బలవంతంగా పెళ్లిజరిపించడం, వారి అభీష్టానికి భిన్నంగా ఇస్లాం మతంలోకి మార్చడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. వీటి వెనుక రాజకీయ నాయకుడు, ముస్లిం మతపెద్ద మియన్ అబ్దుల్ హక్ అలియాస్ మిత్తూ మియన్ ప్రమేయముందనే ఆరోపణలు వస్తున్నాయి.
హిందూమతానికి చెందిన అమ్మాయిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, హక్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల సంఘాలు, హిందూమత సంస్థల కార్యకర్తలు లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లతో పాటు పాక్లోని ఇతర నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హిందూ కుటుంబాలను భయకంపితులను చేస్తున్న హక్కు వ్యతిరేకంగా అమెరికాలో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
హక్ సింధు ప్రావిన్స్లోని ప్రముఖ కుటుంబానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తున్నారు. హక్ బలవంతంగా మతమార్పిడులు చేయిస్తున్నాడని, ఆయన్ను ప్రశ్నించే ధైర్యం అక్కడ ఎవరికీలేదని కపిల్ దేవ్ అనే కార్యకర్త ఆరోపించాడు. కిడ్నాపర్లు 18 ఏళ్లలోపు ఉన్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారిని బలవంతంగా ఎత్తుకెళ్లి మతమార్పిడి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. హిందువులు పాకిస్థాన్ వదలి వెళ్లిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని హిందూ మతసంస్ధ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మాయలపై ఆగడాలు పెరగడంతో పాటు కరాచీలో ఇటీవల హిందువులపై దాడులు ఎక్కువ కావడంతో హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కరాచీలో హిందు మతానికి చెందని ఓ బాలుడు హత్యకు గురికాగా, మరో డాక్టర్ను దుండగులు కాల్చిచంపారు.