అమిత్‌షాపై ఐటీ దాడులు జరగవెందుకు?
కోల్‌కతా: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని, అధర్మమని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఐటీ దాడులు చేయడం సాంకేతికంగా కూడా సరికాదని పేర్కొన్నారు. దేశంలోని సమాఖ్య విధానాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ఇలా చేస్తున్నదా? అని ఆమె ప్రశ్నించారు.
డబ్బులు సేకరిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతరులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ఆమె ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అవినీతిని అందరూ ఖండించాల్సిందేనని, కానీ తమిళనాడు సీఎస్ స్థాయి అధికారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ దాడులు చేయడం సివిల్ సర్వీసు వ్యవస్థను నైతికంగా దెబ్బతీయడమేనని అన్నారు.