
రోడ్డుపై పెళ్లికొడుకును చితకబాదిన భార్య
లుధియానా: పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుక వద్దకు పెళ్లికుమారుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తున్నారు. ఇంతలో ఓ మహిళ కుటుంబసభ్యులతో కలసి వచ్చి.. ఆయన తన భర్త అని, తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నాడని రోడ్డుపై చితకబాదింది. వరుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పట్టుకుని బంధించారు. వధువుపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ కథ పోలీస్ స్టేషన్‌కు చేరింది. శనివారం పంజాబ్‌లోని లుధియానాలో ఓ పెళ్లి వేడుకలో ఈ హైడ్రామా చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు వివాహ వేడుక వద్దకు వెళ్లి పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు బంధువులను, ఆరోపణలు చేసిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 14 ఏళ్ల క్రితం తమకు పెళ్లయిందని, 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా, ఆయనకంటే 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. బావ తరచూ వేధిస్తుండటంతో పుట్టింటికి వచ్చిందని ఆమె సోదరుడు చెప్పాడు. రెండు రోజుల క్రితం అతను రెండో పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలియడంతో వెళ్లి నిలదీశామని తెలిపాడు. మొదట్లో ఆమె ఎవరో తెలియదని బుకాయించిన వరుడు.. తర్వాత తాను ఆమెకు విడాకులు ఇచ్చానని, తన దగ్గర ఆధారం ఉందని చెప్పాడు. విడాకులు ఇచ్చినట్టు తమకు చెప్పడంతో పెళ్లికి అంగీకరించామని వధువు కుటుంబ సభ్యులు చెప్పారు. రెండో పెళ్లి విషయంలో వివాదం ఏర్పడిందని, నివేదిక తయారు చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు పంపిస్తామని పోలీసులు చెప్పారు.