ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు..?
చెన్నై: తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు.. వెతికినకొద్దీ పట్టుబడుతున్న డబ్బు సంచులు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో హద్దులేని విధంగా సాగుతోన్న అధికార పార్టీ ఆగడాలకు ఎన్నికల సంఘం ముకుతాడు వేయనుందా? ఏకంగా ఉప ఎన్నికనే రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనరగ్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. అధికార పార్టీలోని శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలతోపాటు ప్రతిపక్ష డీఎంకే సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ఈ మూడు పక్షాలేకాక ఆర్కే నగర్ నుంచి ఈసారి ఏకంగా 62 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలు భారీ ప్రణాళికలు రచించాయి. అధికార పార్టీ ఏఐడీఎంకే ఏకంగా మంత్రులను, సినీ నటులను రంగంలోకిదింపి కోట్లాది రూపాయలను సరఫరాచేస్తోంది. గురు, శుక్రవారాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది.
(ఐటీ హడల్: మంత్రి, నటుడి నివాసాల్లో సోదాలు)
ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై పలు పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం, ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మరి కొద్ది గంటల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఆర్కే నగర్‌లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.
(ఆర్కేనగర్ రేసులో 62 మంది)