రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాజ్యసభను 'అరాచకాల మయం'గా చేయాలనుకుంటే తానిక చేయగలిగింది ఏమీ లేదంటూ అన్సారీ రాజ్యసభను వాయిదా వేశారు. ఆ తర్వాత బీజేపీ సభ్యులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభం కాగానే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం వ్యవహారం సభను కుదిపేసింది. బీజేపీ సభ్యులు ఒక్కసారిగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ఆరోపణలపై చర్చకు ఆమోదించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
దీనికిముందు సభను సజావుగా నడిపేందుకు అన్సారీ ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ''ప్రతి ఒక్క నిబంధనను, ప్రతి ఒక్క సంప్రదాయాన్నీ సభ్యులు ఉల్లంఘిస్తున్నారు. గౌరవ సభ్యులు సభను అరాచకాల మయంగా చేయాలనుకుంటే ఏమీ చేయలేను'' అంటూ ఈ సందర్భంగా ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేశారు. అయితే, 'అరాచకం' అనే పదం సరైనది కాదని, సభాధ్యక్ష స్థానంలో ఉన్న అన్సారీ లాంటి వాళ్లు ఇలాంటి పదాలు ఉపయోగించడం సమర్థనీయం కానందున దాన్ని వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు.
ఆయన మధ్యాహ్నం 12 గంటలకు సభ సమావేశం కాగానే ఈ ప్రస్తావన చేశారు. అయితే, సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాపతి పీజే కురియన్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ అలా కాకూడదనే అన్సారీ భావించారు తప్ప అరాచకం అయిపోయిందని మాత్రం చెప్పలేదన్నారు. ఆ పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని బీజేపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టగా, తాను ఈ విషయాన్ని పరిశీలించి, తిరిగి సభకు వస్తానంటూ సభను వాయిదా వేసి లేచి వెళ్లిపోయారు.
రాజ్యసభలో 'అరాచక' గందరగోళం
Published Tue, Aug 13 2013 1:20 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement