Hameed Ansari
-
ఉగ్రవాదంపై నిర్దిష్ట పోరు
- ఇందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి - నామ్ సదస్సులో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పొర్లమర్ (వెనిజులా): ఉగ్రవాదంపై నిర్దిష్ట పోరు సాగించాలని, ఇందుకోసం నామ్ (అలీనోద్యమం) సభ్యత్వం గల 120 దేశాలు కలసి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భారత్ పిలుపునిచ్చింది. ఆదివారం ఈమేరకు వెనిజులాలో జరుగుతున్న 17వ నామ్ శిఖరాగ్ర సమావేశాల్లో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘలనకు పాల్పడుతున్న వాటిలో అతి భయంకరమైనది ఉగ్రవాదం. అది దేశాల భద్రతకు, సార్వభౌమత్వానికి, అభివృద్ధికి ప్రధాన ముప్పు. ఉగ్రవాదంపై పోరుకు సమయం ఆసన్నమైంది. ఇందుకు నామ్ నేతృత్వంలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. సమన్వయంతో ఉగ్రవాదంపై పోరు సాగించేందుకు అది ఉపయోగపడుతుంది’ అని అన్నారు.నామ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదంపై ఓ క్రియాశీల బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే తమ పొరుగు దేశం అడ్డుకుందని పాక్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై స్పందిస్తూ.. 21వ శతాబ్దానికి అనుగుణంగా భద్రతా మండలికి వెంటనే సంస్కరణలు చేపట్టాలని 2005లో జరిగిన యూఎన్ శిఖరాగ్ర సమావేశాల్లో పలు దేశాల నేతలు అభిప్రాయపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎంజే అక్బర్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి, సుస్థిరత, సమృద్ధి కోసం ఉగ్రవాదంపై పోరుకు ఓ క్రియా శీల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ‘కొన్ని ప్రభుత్వాలు నామ్ సమ్మిట్‌లో చిత్తశుద్ధి గురించి తెగ మాట్లాడుతాయి. కాని ఉగ్రవాదానికి చేయూత, ఆశ్రయం కల్పించడం మాత్రం కొనసాగిస్తాయి’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హమీద్ అన్సారీ రాయని డైరీ
మనుషులు మనుషుల్లో ఉండాలి. అదే ఆరోగ్యం. దేశాలు దేశాలతో ఉండాలి. అదే అభివృద్ధి. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మనుషులు, దేశాలు ఎంత దూరమైనా ప్రయాణించాలి. పది రోజుల క్రితంనాటి కేరళ గాలులు హత్తుకొమ్మని నన్నింకా హాంట్ చేస్తూనే ఉన్నాయి.. ఢిల్లీ వరకూ నా వెంటే వచ్చి! ఈసారి ఇంకాస్త పెద్ద ప్రయాణం. ముందు బ్రూనై. తర్వాత థాయ్. వచ్చేవారమే ప్రయాణం. ‘వెళ్లగలరా హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. ప్రయాణాలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు? మదిలో కదలిక లేకున్నా, మొదలయ్యాక ఏ ప్రయాణమైనా ఆహ్లాదకరంగానే ఉంటుంది. పూర్తయ్యాక ఏ ప్రయాణమైనా జీవితానికి ఒక మంచి జ్ఞాపకాన్ని ముద్దులా ఇచ్చి వెళుతుంది. ‘భారత ఉప రాష్ట్రపతి ఒకరు బ్రూనై వెళ్లడం ఇదే మొదటిసారి హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. థాయ్‌లాండ్‌కైతే గత యాభై ఏళ్లలో మనదేశం నుంచి ఒక్క ఉప రాష్ట్రపతి కూడా వెళ్లలేదట. ‘‘తూర్పు దేశాలకు వెళ్లిరావడం ఒక పాలసీగా పెట్టుకున్నాం హమీద్‌జీ. పాలసీ అంటే చుట్టపుచూపుగా వెళ్లిరావడం కాదు, ‘మీరెంత దూరంలో ఉన్నా మా ఇరుగూపొరుగువారే’ అని చెప్పి రావడం. మీరు కూడా ఈస్ట్‌కొకసారి వెళ్లొస్తే బాగుంటుంది’’ అని ఫ్లయిట్ టికెట్లు తెప్పించారు సుష్మాజీ. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ సుష్మదే. మునుపు ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ఉండేది. అది పీవీ పాలసీ. తర్వాత వాజపేయి, మన్మోహన్ దానిని కంటిన్యూ చేశారు. కానీ లుక్ ఈస్ట్‌కీ, యాక్ట్ ఈస్ట్‌కీ తేడా ఉంది. గాంభీర్యపు గుబురు మీసాల కరచాలనాలకీ, ఆత్మీయపు ఆలింగనాల చిరునవ్వులకు ఉన్నంత తేడా. బ్రూనైకి ఇక్కడి నుంచి రెండువేల ఆరొందల మైళ్లు. థాయ్‌కి పదిహేనొందల మైళ్లు. ఇంతింత దూరాలు ప్రయాణిస్తున్నప్పుడు నాకు జెరోనిమో గుర్తొస్తాడు. అతడు అన్నమాట గుర్తొస్తుంది. ‘దగ్గరవడం కోసం ఈ నాగరికులు ఎంత దూరమైనా వస్తారు’ అంటాడు జెరోనిమో! పందొమ్మిదో శతాబ్దపు అమెరికా ఆదివాసీ యోధుడు అతడు. ‘మా ఆదివాసీ అపాచీల గుండెకాయలు మా దేహాలలో కాకుండా మా భూముల లోపల కొట్టుకుంటుంటాయి. నాగరిక దురాక్రమణదారులు కాలు పెడితే అవి మందుపాతరలై పేలుతాయి’ అంటూ జీవితాంతం పోరుబాటలో ప్రయాణించినవాడు జెరోనిమో. నాగరికుల మీద అపనమ్మకం జెరోనిమోకు. కుట్రేదో మనసులో పెట్టుకుని కాలినడకనైనా వచ్చేస్తారని. దేశాలకూ అలాంటి అపనమ్మకాలు ఉంటాయి. వాటిని పోగొట్టడమే ఇవాళ్టి నాగరికత. నమ్మకం కలిగించడానికి గానీ, నమ్మకం ఏర్పరచుకోడానికి గానీ.. మనిషైనా, దేశమైనా నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రయాణాలు మనుషుల్ని మనుషుల్లో ఉంచుతాయి. దేశాలను దేశాల్లో కలిపేస్తాయి. - మాధవ్ శింగరాజు -
రాజ్యసభలో 'అరాచక' గందరగోళం
రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాజ్యసభను 'అరాచకాల మయం'గా చేయాలనుకుంటే తానిక చేయగలిగింది ఏమీ లేదంటూ అన్సారీ రాజ్యసభను వాయిదా వేశారు. ఆ తర్వాత బీజేపీ సభ్యులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభం కాగానే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం వ్యవహారం సభను కుదిపేసింది. బీజేపీ సభ్యులు ఒక్కసారిగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ఆరోపణలపై చర్చకు ఆమోదించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. దీనికిముందు సభను సజావుగా నడిపేందుకు అన్సారీ ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ''ప్రతి ఒక్క నిబంధనను, ప్రతి ఒక్క సంప్రదాయాన్నీ సభ్యులు ఉల్లంఘిస్తున్నారు. గౌరవ సభ్యులు సభను అరాచకాల మయంగా చేయాలనుకుంటే ఏమీ చేయలేను'' అంటూ ఈ సందర్భంగా ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేశారు. అయితే, 'అరాచకం' అనే పదం సరైనది కాదని, సభాధ్యక్ష స్థానంలో ఉన్న అన్సారీ లాంటి వాళ్లు ఇలాంటి పదాలు ఉపయోగించడం సమర్థనీయం కానందున దాన్ని వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు సభ సమావేశం కాగానే ఈ ప్రస్తావన చేశారు. అయితే, సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాపతి పీజే కురియన్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ అలా కాకూడదనే అన్సారీ భావించారు తప్ప అరాచకం అయిపోయిందని మాత్రం చెప్పలేదన్నారు. ఆ పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని బీజేపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టగా, తాను ఈ విషయాన్ని పరిశీలించి, తిరిగి సభకు వస్తానంటూ సభను వాయిదా వేసి లేచి వెళ్లిపోయారు.