మహిళా బాస్ లైంగిక వేధింపులు!
యాహూ సంస్థలో ఉన్నతస్థాయిలో ఉన్న ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తోందంటూ ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుచేయడం సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో యాహూ మొబైల్ విభాగంలో సీనియర్ డైరెక్టర్గా పనిచేసే మారియా ఝాంగ్ తనను విపరీతంగా వేధించిందని నాన్ షి అనే ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో గల శాంటా క్లారా సుపీరియర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. సన్నీవేల్, కాలిఫోర్నియాలలో పలు సందర్భాలలో ఆమె తనను ఓరల్, డిజిటల్ సెక్స్ కోసం వేధించిందని నాన్ షి ఆరోపించారు. తనతో శృంగారంలో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారన్నారు. ఈ వేధింపులకు గాను తనకు భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును కోరారు.
అయితే, మారియా ఝాంగ్ మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం గానీ, వాటికి ఆధరాం గానీ ఏమీ లేదని, మారియా తమ కంపెనీలో చాలా మంచి ఎగ్జిక్యూటివ్ అని, ఈ కేసును తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని యాహూ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎలైక్ అనే సొంత మొబైల్ కంపెనీని ఝాంగ్ స్థాపించగా, దాన్ని యాహూ 2013లో టేకోవర్ చేసింది. అంతకుముందు ఆమె మైక్రోసాఫ్ట్, జిల్లో కంపెనీలలో కూడా పనిచేశారు.
అయితే కంపెనీ హెచ్ఆర్ సిబ్బంది తాను చేసిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించలేదని, తన ఉన్నతాధికారి అఘాయిత్యాలను పట్టించుకోలేదని నాన్ షి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, తనను బలవంతంగా వేతనం లేని సెలవుపై పంపారని, తర్వాత ఉద్యోగం నుంచి కూడా తొలగించారని ఆరోపించారు.