కొత్తకోట, న్యూస్‌లైన్: ఒంటరిగా ఉన్న ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అడ్డాకుల మండలానికి చెందిన ఓ మహిళ (40) కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి కొత్తకోటలో బస్సు దిగింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సులు లేకపోవడంతో.. బస్టాండ్‌లోనే నిద్రకు ఉపక్రమించింది. ఇది గమనించిన బీట్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆ మహిళను బెదిరించి బస్టాండ్‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తర్వాత అక్కడే బైక్ పార్కింగ్ వర్కర్లు రాకేష్, రమేష్ కూడా ఆమెను లాక్కెళ్లి బలాత్కరించారు. అక్కడే డ్యూటీలో ఉన్న హోంగార్డు నాగేంద్రం ఇది చూస్తూ కూడా వారిని నిలువరించలేక పోగా.. సహకరించాడు. కాగా, బస్టాండ్‌లో తనపై జరిగిన దారుణంపై బాధిత మహిళ స్థానికుల సహాయంతో గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్
అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, అతనికి సహకరించిన హోంగార్డు నాగేంద్రంలను సస్పెండ్ చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.నాగేంద్రకుమార్ తెలిపారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... మరో ఇద్దరు నిందితులైన రాకేష్, రమేష్‌లను కూడా అరెస్టు చేశామని, ఈ నలుగురిపై నిర్భయ చట్టం 376 ‘డి’ కింద కేసు నమోదు చేశామన్నారు.
మహిళపై సామూహిక అత్యాచారం
Published Fri, Sep 20 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement