ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కూడా చూడకుండా.. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా దారుణం ఏమిటంటే వాళ్లలో ఓ వైద్యుడు కూడా ఉన్నాడు!!
కామాతురాణాం న భయం.. న లజ్జ అంటారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కూడా చూడకుండా.. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా దారుణం ఏమిటంటే వాళ్లలో ఓ వైద్యుడు కూడా ఉన్నాడు!! జైపూర్ నగర శివార్లలోని చోము పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెప్టెంబర్ 24వ తేదీన ఈ దారుణం జరిగింది. డాక్టర్ చౌదరి, చెత్రమాల్ కుమావత్, సాగర్, అత్తా ఖాన్, ముఖేష్ బాగర్ అనే ఐదుగురు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపిందని చోము ఏసీపీ ప్రతాప్ రామ్ మీనా తెలిపారు.
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల కింద నిందితులపై ఫిర్యాదు దాఖలైందని ఆయన చెప్పారు. అయితే.. బాధితురాలి నుంచి పూర్తిస్థాయిలో వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలం కావడం ఈ కథలో మరో కోణం. ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఉత్తచేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. బాధితురాలు తన ఇంట్లో కూడా కనపడటంలేదు. ఇప్పుడు బాధితురాలు కనిపిస్తే తప్ప ఈ కేసులో ముందడుగు వేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.