
శశికి వ్యతిరేకంగా జయ సమాధి వద్ద..!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ నటరాజన్ శనివారం పగ్గాలు చేపడుతున్న తరుణంలో ఓ మహిళ జయలలిత సమాధి వద్ద ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుమతి అనే మహిళ బలవన్మరణానికి ప్రయత్నించింది. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్ద ఆమె విషం తాగింది. దీంతో స్థానికులు ఆమెను గుర్తించి సుమతిని ఆస్పత్రికి తరలించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆఖరికీ మద్రాస్ హైకోర్టు కూడా జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత భౌతికకాయాన్ని వెలికితీసి.. ఎందుకు మరోసారి అనుమానాల నివృత్తికి ప్రయత్నించకూడదంటూ హైకోర్టు పేర్కొంది. మరోవైపు జయలలిత మృతి నేపథ్యంలో శశికళ తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ సమాధి వద్దే ఆత్మహత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది.