నెలపాటు ఆమె మంచుకొండల్లోనే..
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్లోని ఓ రిమోట్ పర్వత క్యాబిన్లో నెలపాటు ఒంటరిగా జీవించి విస్మయ పరిచింది ఓ మహిళ. తనతో పాటు పర్వత అధిరోహణకు వెళ్లిన భాగస్వామి మరణించినప్పటికీ ఆమె ఈ పర్వతంపైనే ఒంటరిగా జీవించడం విశేషంగా నిలిచింది. దక్షిణ ద్వీపంలోని ఫియర్డ్లాండ్ జాతీయ పార్క్ పర్వతాల్లో ఓ గుడిసెలో బుధవారం మహిళను గుర్తించినట్టు గార్డియన్ రిపోర్టు చేసింది.
పోలీసుల రిపోర్టు ప్రకారం జూలై 24న ఈ జంట పర్వతాధిరోహణ ప్రారంభించారు. ఆమె భాగస్వామి జూలై 28న పర్వతం ఎక్కే క్రమంలో నిటారుగా ఉన్న వాలు నుంచి పట్టుజారి పడిపోయి మరణించాడు. అప్పటినుంచి తను ఒక్కతే లేక్ మెకెంజీ హట్లో నివసించినట్టు ఆ మహిళ పేర్కొంది. అత్యంత క్లిష్టమైన శీతాకాల పరిస్థితుల్లో కూడా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు.
పర్వతారోహణకు వెళ్లిన వారినుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో మహిళను గుర్తించామని వెల్లడించారు. గురువారం వాతావరణ పరిస్థితులు మెరుగైతే ఆమె భాగస్వామి మృతదేహ సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.