
మహిళ వాట్సాప్‌ను హ్యాక్ చేసి..
ముంబైకి చెందిన ఓ మహిళ వాట్సాప్‌ను హ్యాక్ చేసి.. ఆమె స్నేహితులను మోసగించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టు అయిన కోమల్ పంచమతియా (30) వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు, తదితర సమాచారమంతా హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా ఆమె పేరిట హ్యాకర్.. పేటీఎం ద్వారా డబ్బులు పంపాలని ఆమె స్నేహితులకు మెసేజ్ పెట్టాడు. దీంతో ఒక స్నేహితురాలు మోసపోయి హ్యాకర్‌కు రూ. 2,500 పంపింది కూడా. విషయం తెలియడంతో బాధితురాలు ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది.
సైబర్ క్రైమ్ అధికారుల కథనం ప్రకారం.. ఒక హ్యాకర్ ఆమెకు కొత్త సంవత్సరం సందర్భంగా రెండు మెసేజ్‌లు పంపించాడు. ఒకదాంట్లో న్యూఇయర్ విషెస్ పంపిన అతను మరొక మెసేజ్‌ను తనకు కాపీ చేసి పంపాల్సిందిగా కోరాడు. అందులో మాల్‌వేర్ ఉండటంతో ఇలా కాపీ చేసి పంపిన మెసేజ్‌లో వాట్సాప్ పంపే ఆరు అంకెల అకౌంట్ యాక్టివేషన్ కోడ్ కూడా వెళ్లింది. ఈ కోడ్ ద్వారా మరో డివైస్‌లో ఆమె వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన దుండగుడు.. ఆమె ఫొటోలు, వీడియోలతోపాటు సమాచారమంతా రాబట్టాడు.
అంతేకాకుండా పంచమతియా స్నేహితులకు పేటీఎం ద్వారా డబ్బులు పంపించాలని కోరాడు. దీంతో ఆమె స్నేహితురాలు ఒకరు హ్యాకర్‌కు డబ్బు పంపి.. ఆ విషయాన్ని పంచమతియాకు తెలిపింది. దీంతో కంగుతిన్న ఆమె తన వాట్సాప్ హ్యాకింగ్ గురయిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. పంచమతియా వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్ నుంచి రీకవరీ చేసిన పోలీసులు.. పేటీఎం అకౌంట్ ద్వారా అతని గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.