ఎంపీలు తనను రేప్ చేశారంటూ...
ఏకంగా ఎంపీలకే బురిడీ కొట్టించి.. వాళ్లే తనను రేప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మహిళను ఎట్టకేలకు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి, ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగి.. 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరించింది ఈ మహిళేనని తేలింది. ఆమె కోసం ఇంటిమీద దాడులు చేసినా, ఆమె మాత్రం దొరకలేదు. గుజరాత్‌లోని వల్సాడ్ ఎంపీ కేసీ పటేల్ తనను మార్చి 3వ తేదీన ఆయన అధికారిక నివాసానికి డిన్నర్ కోసం పిలిచారని అప్పటినుంచి పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేశారని, ఆయన తనను బెదిరించకుండా ఉండేందుకు తాను వీడియో తీసి సీడీ తయారుచేయాల్సి వచ్చిందని ఆమె కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి ఇదంతా చెప్పినా, ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దాన్ని నమోదు చేయలేదు. నేరం జరిగిన ప్రాంతం తమ స్టేషన్ పరిధిలోకి రాదు కాబట్టి ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లమని తెలిపారు. అక్కడ కూడా ఆమె అదే కథ చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే తాను సీడీ ఇస్తానని తెలిపింది. ఆమె చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్తానని కూడా బెదిరించింది.
చదవండి: బీజేపీ ఎంపీపై వల.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్!
ఈలోపు ఎంపీ కేసీ పటేల్ అసలు విషయం బయటకు వెల్లడించడంతో మొత్తం వివరాలు తెలిశాయి. స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత.. గతంలో కూడా హరియాణాకు చెందిన ఒక ఎంపీని ఇలాగే ఆమె బుట్టలో వేసుకుని డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆయన పట్టించుకోకపోవడంతో అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిందని తేలింది. అప్పట్లో పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసి ఆమె తన ఫిర్యాదు వెనక్కి తీసుకుందని మీనా తెలిపారు. ఇది అచ్చంగా దోపిడీ కేసేనని, అందువల్ల అత్యాచారం కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని.. తాను నిర్దోషినని తేలే క్షణం కోసం వేచి చూస్తున్నానని ఆయన చెప్పారు.