పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన ప్రపంచబ్యాంకు
- 673 కోట్ల రుణం ఇవ్వడానికి నిరాకరణ
ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ సహజవాయువు (నాచురల్ గ్యాస్) ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన రూ. 630 కోట్ల (100 మిలియన్ డాలర్ల) రుణాన్ని నిరాకరించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు గ్యాస్ పంపిణీ కంపెనీ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కరాచీ, సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో సహజ వాయువు సరఫరాను మెరుగుపరిచేందుకు, గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థలో వాణిజ్య,ఇతర లొసుగులను అధిగమించేందుకు సుయ్ సాదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్జీసీ) ఈ ప్రాజెక్టు తలపెట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు చేపట్టడంలో విఫలం కావడం, అక్రమ గ్యాస్ లీకేజీలు అధికంగా కొనసాగుతూ విలువైన సహజ వనరు దుర్వినియోగమవుతుండటంతో ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టు ఇవ్వాలని ఉద్దేశించిన రుణాన్ని నిరాకరించాలని నిర్ణయించిందని డాన్ పత్రిక తెలిపింది.