‘నీరాంచల్’కు కేబినెట్ ఓకే
ప్రపంచబ్యాంక్ సహకారంతో జాతీయ వాటర్ షెడ్ పథకం
♦ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
♦ యుద్ధ స్మారక నిర్మాణాలకు రూ. 500 కోట్లు
న్యూఢిల్లీ: రైతులకు నీటిపారుదల సౌకర్యాలను పెంచే ఉద్దేశంతో రూ. 2,142.30 కోట్లతో జాతీయ వాటర్‌షెడ్ నిర్వహణ పథకం ‘నీరాంచల్’కు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఏఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 50% (రూ.1,071.15 కోట్లు) ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 50 శాతాన్ని ప్రపంచబ్యాంక్ రుణంగా అందించనుంది. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలోను, అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత రవాణా మంత్రి నితిన్ గడ్కారీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కృషి సంచయి యోజనలోని వాటర్‌షెడ్ లక్ష్యాలను సాధించడం, ప్రతీ పంటపొలానికీ సాగునీరు, సమర్థ జల నిర్వహణ ఈ ‘నీరాంచల్’ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ‘వర్షాధార వ్యవసాయ నిర్వహణ పద్ధతులు, వాటర్ షెడ్ నిర్వహణలో వ్యవస్థీకృత మార్పులు, ఆయా పద్ధతులను మరింత సమర్థంగా అమలు చేయడం ఈ పథకం లక్ష్యమన్నారు.
కేబినెట్ భేటీ ఇతర నిర్ణయాలు..
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని దసరా పండుగ సందర్భంగా 2014-15 ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్‌బీ)గా ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో12.58 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు(ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్‌లను మినహాయించి).. ఒక్కొక్కరు సుమారు రూ. 8,975 మేరకు ప్రయోజనం పొందనున్నారు.ఖజానాపై రూ. 1,030.02 కోట్ల మేర భారం పడనుంది. గత మూడేళ్లు కూడా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పీఎల్‌బీనే ఇచ్చారు.
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టిన సర్కారు ఈ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రూప్ ఏ ఉద్యోగాల్లో భాగంగా కొత్తగా ‘ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్’ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ‘మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్’ మంత్రిత్వ శాఖలో టెక్నికల్ కేడర్‌గా ఈ సర్వీస్ ఉంటుంది.
జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ వార్ మ్యూజియం నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 500 కోట్లను కేటాయించారు. స్వాతంత్య్రానంతరం విధి నిర్వహణలో మరణించిన 22,500 మంది సైనికుల స్మారకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో వాటిని నిర్మించాలన్న సైనిక దళాల డిమాండ్ చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఐదేళ్లలో ఈ నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది.
ఇజ్రాయెల్, వియత్నాంలతో పన్ను ఒప్పందాలను సవరించడానికి సంబంధించిన విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రొటోకాల్స్ డబుల్ టాక్సేషన్ నిరోధంతో పాటు పన్ను సమాచారాన్ని, బ్యాంక్ అకౌంట్ల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించినవి.