85=350 కోట్లు! | World's 85 richest people own nearly half of global wealth: Oxfam report | Sakshi
Sakshi News home page

85=350 కోట్లు!

Published Tue, Jan 21 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

85=350 కోట్లు!

85=350 కోట్లు!

దావోస్: ఓ 85 మంది. వాళ్లు చాలా..చాలా...చాలా విలువైన వాళ్లు. ఎంత విలువైన వాళ్లంటే... ప్రపంచ జనాభా 700 కోట్లనుకుంటే... అందులో సగం... అంటే 350 కోట్ల మందితో సమానమన్న మాట!!!. ఎందుకంటే ప్రపంచంలో దిగువ స్థాయిలో ఉన్న సగం మంది జనాభా మొత్తం సంపద ఎంతో... ఈ 85 మందిదీ కలిపితే అంత. ఈ విలువైన కుబేరుల్లో భారతీయ కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఉన్నారు లెండి!
 
 పేదలు మరింత నిరుపేదలుగా మారుతుండగా.. సంపన్నులు తమ సంపద సౌధాలను ఆకాశానికి నిచ్చెనేసినట్లు పెంచుకుంటూ పోతున్నారంటూ ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) నేపథ్యంలో విడుదల చేసిన ఈ నివేదికలో... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలోనూ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎలా పెరిగిపోతున్నాయనేదాన్ని తేటతెల్లం చేసేలా పలు అంశాలున్నాయి. ‘‘సంపన్నవర్గాలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థలు తమకు అనుకూలంగా నడిచేలా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు’’ అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ 21వ శతాబ్దంలో కూడా కేవలం 85 మంది కుబేరుల చేతిలో దాదాపు 350 కోట్ల జనాభాతో సమానమైన సంపద ఉండటం చూస్తే ఆర్థికంగా ఎంత ఘోరమైన అసమానత ఉందో తేటతెల్లమవుతుంది. ఈ సంపన్నులందరినీ కలిపితే ఒక రైలు పెట్టెలో సరిపోతారు. వీళ్ల సంపద మాత్రం సగం జనాభాకు సమానం’ అని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ విన్నీ బ్యాన్‌యిమా వ్యాఖ్యానించారు.
 
 నివేదికలో ముఖ్యాంశాలివీ...

  • 1970 దశకం చివరినుంచీ గణాంకాలు అందుబాటులో ఉన్న 30 దేశాలను పరిశీలిస్తే.. 29 దేశాల్లో ధనికులకు పన్నుల రేట్లు భారీగా తగ్గాయి. అంటే చాలా దేశాల్లో ధనికులు మరింత సంపన్నులు అవుతుండటంతో పాటు దానిపై తక్కువ పన్నులు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
  • గత 25 ఏళ్లలో సంపద అనేది కేవలం అతికొద్ది మంది చేతుల్లోనే బందీ అయింది. మొత్తం ప్రపంచ సంపదలో దాదాపు సగం(46 శాతం) ఒక శాతం మంది సంపన్న కుటుంబాల వద్దే ఉంది.
  • ఈ ధనిక, పేద అసమానతలను తొలగించేందుకు ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు తీసుకోవాలి. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరవుతున్న పలు దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సమస్యపై దృష్టిపెట్టాలి.
  • పన్నులు తప్పించుకునేందుకు స్వర్గధామంగా ఉన్న దేశాల్లో ఈ  కుబేరులు, కంపెనీలు తమ లక్షల కోట్ల డాలర్లను దాచి పెట్టుకొని ప్రభుత్వాలకు ఎగనామం పెడుతున్నాయి.
  • దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల సంపద(ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) నల్లధనంగా విదేశాల్లో మూలుగుతున్నట్లు అంచనా.
  • గడిచిన 30 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఏడుగురి మధ్య ఆర్థిక సమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి.
  • ప్రపంచ జనాభాలో 1%గా ఉన్న సంపన్నులు మాత్రం తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగారు.

 
 భారత బిలియనీర్లు పదేళ్లలో పదింతలు...
 భారత్‌లోని ఐశ్వర్యవంతుల(బిలియ నీర్ల) సంఖ్య గత దశాబ్దం కాలంలోనే పదింతలు అయిందని కూడా నివేదిక పేర్కొంది. ‘పన్నుల తగ్గింపు విధానం, తమ పలుకుబడితో ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో కంపెనీలు సొమ్మును లాగేయడం వంటివన్నీ దీనికి ప్రధాన కారణాలే. అయితే, ఈ కుబేరులు పేదలకు చేసిన సాయం నామమాత్రం’ అని తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement