న్యూయార్క్, సాక్షి: ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ, మరోపక్క స్పేస్‌ఎక్స్‌తో ప్రయోగాలు.. వెరసి ఏడాది కాలంగా ఈ ఇంజినీర్ సరికొత్త రికార్డులను సాధిస్తూనే ఉన్నాడు. అతడే టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్. బుధవారం టెస్లా ఇంక్ షేరు 3 శాతం బలపడటంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 716 బిలియన్ డాలర్లను అధిగమించింది. దీంతో కంపెనీ ప్రమోటర్‌గా 20 శాతం వాటా కలిగిన మస్క్ వ్యక్తిగత సంపద 181.1 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చేరువయ్యాడు. జెఫ్ బెజోస్ సంపద 183.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం అమెజాన్ మార్కెట్ విలువ 1.57 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అమెజాన్‌లో బెజోస్ 11 శాతం వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2017 అక్టోబర్ నుంచీ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలుస్తుండటం విశేషం! (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?)
ఏడాది కాలంలో
ఏడాది కాలంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయంతో టెస్లా ఇంక్ చీఫ్ ఎలన్ మస్క్ పలు రికార్డులను సాధిస్తూ వస్తున్నారు. మరోపక్క అమెజాన్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ కంపెనీకి ప్రయివేట్ అంతరిక్ష సేవల్లో స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్ప్ ద్వారా సైతం మస్క్ పోటీనిస్తుండటం గమనార్హం! కాగా.. గత ఏడాది కాలంలోనే మస్క్ సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్లమేర జంప్‌చేసింది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతంగా సంపదను పెంచుకున్న నలుగురిలోనూ మస్క్ చోటు సాధించారు. ఈ కాలంలో టెస్లా షేరు ఏకంగా 743 శాతం దూసుకెళ్లింది. కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ లాభాలు ఆర్జించడం ద్వారా అమెరికా స్టాక్ ఇండెక్స్ ఎస్‌అండ్‌పీ-500లో చోటు సాధించడం ఇందుకు ప్రధానంగా దోహదపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎస్‌అండ్‌పీ-500కు ప్రాతినిధ్యం వహించే కంపెనీలలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. (అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్)
ఆటో దిగ్గజంగా
బుధవారం(6న) టెస్లా షేరు పుంజుకోవడంతో మార్కెట్ విలువ రీత్యా టెస్లా ఇంక్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటో దిగ్గజంగా మరింత బలపడింది. నిజానికి పూర్తిస్థాయి ఆటో కంపెనీ కాకున్నప్పటికీ కంపెనీ మోడల్-3 ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయిస్తోంది. అయితే ఆటో దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్స్ విక్రయిస్తున్న కార్ల సంఖ్యతో పోలిస్తే ఇవెంతో తక్కువ అయినప్పటికీ మార్కెట్ విలువలో వీటిని గతేడాదిలోనే అధిగమించేసింది. టెస్లాలో మస్క్‌కు అదనంగా స్టాక్ అప్షన్లు సైతం ఉన్నాయి. వీటి విలువ 40 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012, 2018లలో కంపెనీ నుంచి వీటిని మస్క్ పొందారు. (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్)
టాప్-5 ఇలా
గతేడాది ప్రపంచంలోని టాప్-500 కుబేరుల సంపదకు 1.8 ట్రిలియన్ డాలర్లు జమయ్యింది. అయితే టాప్-5 కుబేరుల వాటానే దీనిలో 100 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. తదుపరి 20 మంది మొత్తం సంపద 50 బిలియన్ డాలర్లు ఎగసింది. వెరసి సంపద సృష్టిలోనూ టాప్‌లో ఉన్న కంపెనీలే రికార్డులు సాధించినట్లు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కాగా.. ఇటీవల చైనాకు చెందిన బాటిల్డ్ వాటర్ కంపెనీ అధినేత జాంగ్ షంషాన్ తొలిసారి ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరో ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. 15.2 బిలియన్ డాలర్ల సంపదతో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment