
4జీ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమీ టాప్
భారత్‌లో రెండో స్థానానికి ఆపిల్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ భారత 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానానికి చేరింది. శామ్‌సంగ్, ఆపిల్ కంపెనీల 4జీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో షియోమీ 4జీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్‌మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలలో ఆపిల్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. సైబర్‌మీడియా రీసెర్చ్ సంస్థ ప్రకారం...
జనవరిలో భారత్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ వాటా 30.8 శాతంగా ఉంది. అదే సమయంలో ఆపిల్ మార్కెట్ వాటా 23.8 శాతంగా, శామ్‌సంగ్ మార్కెట్ వాటా 12.1 శాతంగా, హెచ్‌టీసీ మార్కెట్ వాటా 10 శాతంగా, మైక్రోమ్యాక్స్ మార్కెట్ వాటా 8.3 శాతంగా ఉంది.
ఈ ఏడాది జనవరిలో మొత్తం మొబైల్ మార్కెట్‌లో (స్మార్ట్‌ఫోన్లు, 4జీ, 3జీ, ఫీచర్ ఫోన్లు) శామ్‌సంగ్ 17.3 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాలలో లావా (11.9 శాతం), మైక్రోసాఫ్ట్ (10.3 శాతం), మైక్రోమాక్స్ (9.7 శాతం), ఇంటెక్స్ (8.5 శాతం) ఉన్నాయి.భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా శామ్‌సంగ్ 28.8 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాలలో మైక్రోమాక్స్ (12.1 శాతం), ఇంటెక్స్ (9.7 శాతం), లావా (9.4 శాతం), మైక్రోసాఫ్ట్ (4.5 శాతం) ఉన్నాయి.