ఏకపక్ష విభజనలో జోక్యం చేసుకోండి: రాష్ట్రపతికి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని.. అడ్డగోలు విభజనను ఆపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విభజనతో ముడిపడ్డ కొన్ని సమస్యలపై.. ముఖ్యంగా రాజ్యాంగంలోని వివిధ అధికరణల విషయంలో తలెత్తుతున్న కీలక ప్రశ్నలపై సుప్రీంకోర్టు సలహా కోరాలని.. ఇందుకోసం రాజ్యాంగంలోని 143 అధికరణ కింద రాష్ట్రపతి తనకున్న అధికారాలను ఉపయోగించాలని జగన్ విన్నవించారు. రాజ్యాంగంలో 32వ సవరణ ద్వారా చేర్చిన 371డీ, 371ఈ అధికరణలను సవరించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కేంద్రప్రభుత్వం చేయవచ్చా? రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫారసుల ఆధారంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా ఏకపక్షంగా విభజించవచ్చా? అనే పలు అంశాలను న్యాయసమీక్షకు నివేదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటంకోసం, కేంద్రం ఏకపక్షంగా రాష్ట్రాలను విభజించే అధికారం ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ కోసం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి.. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నల్లా సూర్యప్రకాశ్‌లు కూడా జగన్ వెంట ఉన్నారు. జగన్ బృందం మధ్యాహ్నం 12.20 నుంచి 20 నిమిషాలపాటు ప్రణబ్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా.. సమైక్యాంధ్రను కొనసాగించాల్సిన ఆవశ్యకత, ఆర్టికల్ 3కి సవరణ తీసుకురావాల్సిన అవసరం, 371డీ అధికరణపై ప్రశ్నలు తదితర అంశాల గురించి వివరించింది.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విభజిస్తున్నారు...
‘‘కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజనను ఏకపక్షంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగిస్తున్నాయి. ఈ విభజన రాష్ట్రంలోని కోట్లాది మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.. అత్యంత తీవ్ర విపరిణామాలకు దారితీస్తుంది. విభజన పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కొన్ని పరిణామాలు, వైపరీత్యాలను మేం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వీటిని పరిశీలించండి. వెంటనే జోక్యం చేసుకోండి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’’ అని కోరుతూ ఐదు పేజీల వినతిపత్రాన్ని కూడా రాష్ట్రపతికి అందజేసింది. తెలుగు ప్రజల ప్రయోజనాలను, భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు న్యాయ సమీక్షకు నివేదించాల్సిందిగా నాలుగు ప్రధాన అంశాలను జగన్ బృందం ఆయన ముందుంచింది.
రాజ్యాంగ సంస్థలు ప్రేక్షకులుగా మారరాదు...
‘‘రానున్న కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా విభజన ఎత్తుగడలకు పాల్పడటానికి ఆంధ్రప్రదేశ్‌ను ఓ నిదర్శనంగా మారనివ్వరాదు. ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయ పక్షాలు, రాజ్యాంగ సంస్థలు మౌన ప్రేక్షకులుగా మారితే.. ఇదే విభజన రేపు ఎవరికైనా, ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చన్నది మా వాదన’’ అని జగన్ బృందం రాష్ట్రపతికి వివరించింది. అంతేకాక.. ‘‘రానున్న రోజుల్లో రాజ్యాంగంలోని మూడో అధికరణకు తప్పనిసరిగా సవరణ జరగాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటుతో పాటు.. ఆ బిల్లును పెట్టే ప్రతి చోటా వ్యతిరేకించాల్సిన తక్షణావసరం ఉందనేది మా వినతి. ఈ డిమాండ్‌లోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు గుర్తిస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని నివేదించింది.
ఏకపక్ష విభజన అధికారం ఉండకూడదని చెప్పాం...
రాష్ట్రపతితో సమావేశం అనంతరం జగన్ పార్టీ నాయకులతో కలిసి రాష్ట్రపతి భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రపతిని కలిశాం. ఇంతకుముందు ఇచ్చినట్లుగానే మళ్లీ వినతిపత్రం అందించాం. సమైక్యాంధ్రప్రదేశ్ అవసరం, ఆర్టికల్ 3... ఈ రెండింటి విషయంలో సుదీర్ఘంగా వివరించాం. ఆర్టికల్ 3కి సవరణ తీసుకురావాల్సిన అవసరం గురించి చెప్పాం. ఈ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఓట్లకోసం, సీట్లకోసం విభజిస్తుండటం ఓ నిదర్శనంగా మారితే ఇది ఆంధ్ర రాష్ట్రంతోనే ఆగిపోదు.
కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కడైతే తాము అధికారంలోకి రాలేమని అనుకుంటారో అక్కడ అడ్డగోలుగా రాష్ట్రాలను విడగొడుతూ పోతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగాలి. దీన్ని ఆపాలి. ఒక పద్ధతి అనేది తీసుకురావాలి. మొదటి ఎస్‌ఆర్‌సీ తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలు 60 ఏళ్లు ఈ మాదిరిగా ఉన్న తర్వాత.. వాటి విభజనకు కేంద్రంలో ఉన్నవారికి ఇలా అధికారం ఇవ్వటం సరికాదని నివేదించాం. మరీ ముఖ్యంగా మా రాష్ట్రానికి వచ్చేసరికి తాగటానికి నీళ్లు కూడా ఉండని పరిస్థితిలోకి మేం పోతామని చాలా చాలా గట్టిగా చెప్పాం.. 371డీ గురించి కూడా సవివరంగా తెలిపాం’’ అని జగన్ చెప్పారు. ‘‘మేం చెప్పిన విషయాలను రాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. ఆయా అంశాలపై ఆలోచిస్తానని చెప్పారు. ఆయన మంచి ఆలోచనలతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
సవరించకుండా.. విభజించవచ్చా?
32వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 371డీ, ఈ అధికరణలను సవరించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం చేయవచ్చా?
ఆర్టికల్ 368 కింద.. ఆర్టికల్స్ 371డీ, ఈ లను సవరించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విభజించవచ్చా? భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు పరిరక్షిస్తున్న ఆర్టికల్ 371ఈ సవరణకు దేశంలోని యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరమన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరముంది.
ఆర్టికల్స్ 371డీ, ఈ లను సవరించకుండా, కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్స్ 2, 3, 4 కింద తనకున్న అధికారాలను ఉపయోగించవచ్చా? అలా వినియోగించుకున్న పక్షంలో ఆ చర్య రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తి ఉల్లంఘన అవ్వొచ్చు.
1955లో మొదటి ఎస్‌ఆర్‌సీ సిఫారసుల ఆధారంగా భాషా ప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించారు. 60 ఏళ్ల తర్వాత వీటిలో ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించవచ్చా? విభజనకు అనుకూలంగా అసలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా లేదా మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేయకుండా ఏ రాష్ట్రాన్నయినా ఈ తీరున విభజించడం సమంజసమేనా?
తెలుగు ప్రజల ప్రయోజనాలను, భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఈ అంశాలను న్యాయ సమీక్షకు నివేదించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాం. ఇందుకోసం రాజ్యాంగంలోని 143 అధికరణ కింద రాష్ట్రపతి తనకున్న అధికారాలను ఉపయోగించాలని కోరుతున్నాం.’’