
సోషల్ మీడియాలో రాధేమా ఫొటో హల్ చల్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కార్యకలాపాలు రోజుకో విధంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ పక్క అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే... మరో పక్క ఆమె వివాదాస్పద ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను పరిశీలిస్తే.. ఓ కిట్టీ పార్టీలో రాధే మా పొట్టి స్కర్ట్లో కనిపించారు.
వార్త ఏజెన్సీ పీటీఐ జర్నలిస్ట్ ఈ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఫొటోలో రాధేమాతో పాటు ఉన్న మహిళలంతా ఎర్రని వస్త్రధారణతో నుదుటిపై తిలకం, చేతులకు గాజులు కలిగి ఉండటంతో పాటు కొందరు త్రిశూలాన్ని కూడ ధరించి కనిపించారు. ఎప్పుడూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించే ఆమె ఇలా దర్శనమివ్వడం ప్రధాన వార్తగా నిలిచింది.
ఇటీవల రాధే మాపై పలు వివాదాలు రావడం, కేసులు నమోదు కావడం తెలిసిందే. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు ఆమెను విచారించారు. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అశ్లీలతను ప్రదర్శిస్తున్న దృశ్యాలతో కూడిన ఓ వీడయో సీడిని కూడ పోలీసులకు సమర్పించాడు. తాజాగా ఆమె ఓ ఫొటోలో మిని స్కర్ట్ తో దర్శనమివ్వడం మరోసారి చర్చనీయాంశమైంది.