అలాంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రా?
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్, నిరుద్యోగ యువత కోసం జగనన్న తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. జగన్ చూపిన బాటలో ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడాలని కోరారు. పార్టీలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అంశమిదని, అవహేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోని వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం సిగ్గుచేటని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.