
అన్నదాతలను ఆదుకోండి!
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు
ఏపీ, తెలంగాణ సీఎంలకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల పాలిట పిడుగుపాటులా మారిన అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వర్షాలతో నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, కొండా రాఘవరెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
13 జిల్లాల రైతులూ నష్టపోయారు: వాసిరెడ్డి
అకాల వర్షాలతో ఏపీలోని 13 జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాయలసీమలో వరి, మామిడి, సపోటా, తమలపాకు, పత్తి పంటలు ధ్వంసమయ్యాయన్నారు. రుణమాఫీ అమలుకాక ఇప్పటికే లబోదిబోమంటున్న రైతులకు ఈ వర్షాలు అశనిపాతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కర్నూలులోనే వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను మినహాయిస్తే ఏపీ అంతటా గత ఖరీఫ్‌లో 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఫలితంగా 50 శాతం పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. పంటలు పోయి ఆర్థికంగా చితికి పోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలబడాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్‌గారూ.. స్పందించండి: రాఘవరెడ్డి
తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ అకాలవర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం అండగా నిలబడాలని మరో అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, పంట నష్టాలను జీర్ణించుకోలేక ఐదుగురు రైతులు హఠాన్మరణం చెందారన్నారు. వీరిలో కొందరు పిడుగుపడి చనిపోతే.. మరికొందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో క్యారెట్, నల్లగొండ లో వరి పంటలు పూర్తిగా నీటమునిగాయని తెలిపారు. ‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని కేసీఆరే చెప్పారు కనుక వారి కంట నీరు తుడవాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దివంగత వైఎస్ జీవో 421 ఇచ్చారని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచి ఇవ్వాలని అన్నారు. పిడుగుపాటుకు, కరెంటు తీగలు తగిలి మృతి చెందిన వారికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.