గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ వినతిపత్రం
రాష్ట్ర పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి. విభజన ప్రక్రియపై ముందుకు వెళ్లకుండా చూడండి’ అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రతినిధి బృందం శనివారం రాజ్‌భవన్‌లో ఆయనను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఆంధ్ర, రాయలసీమల్లో అన్ని వర్గాల ప్రజలూ 50 రోజులుగా ఆం దోళన చేస్తున్నారని వివరించింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లోనూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని నేతలన్నారు. ఇంతగా ఆందోళనలు జరుగుతున్నా తెలంగాణ ఏర్పాటు కోసం కేబినేట్ నోట్ సిద్ధం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘‘రాష్ట్రంలో మెజారిటీ ప్రజలే కాకుండా వైఎస్సార్‌సీపీతో పాటు ఎంఐఎం, సీపీఎం కూడా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది కోస్తాంధ్ర, సీమ ప్రజల జీవన్మరణ సమస్య’’ అని వివరించారు. అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీడబ్ల్యూసీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను, ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కేంద్రానికి విన్నవించాలని గవర్నర్‌కు తెలియజేశామన్నారు. ‘సీమాంధ్రకు హైదరాబాద్ కాకుండా పోతుం దని, ఇంకా సాగునీటి విషయంలో రైతులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీమాం ధ్రులు కూడా ఎనలేని కృషి చేశారు. రాజధాని తమదేనన్న ఆలోచనతో ఆరు దశాబ్దాలుగా పెట్టుబడులన్నీ ఇక్కడే పెట్టారు. పరిశ్రమలు, ఆసుపత్రులు, సినీరంగం, హోటళ్లు తదితర రంగాలన్నీ ఇక్కడే కేంద్రీకృతమయ్యా యి. 18 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న హైదరాబాద్ వంటి నగరాన్ని ఎన్ని లక్షల కోట్లు ఖర్చుచేసినా నిర్మించలేం’ అన్నారు. పరిస్థితులన్నింటినీ గవర్నర్‌కు వివరించి, కేంద్రానికి సరైన నివేదిక అందజేయాల్సిందిగా కోరామన్నారు. ఈ బృందంలో ధర్మాన కృష్ణదాస్, శోభానాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, బాబురావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, బాలరాజు, బి.గుర్నాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, జూపూడి, నారాయణరెడ్డి, శేషుబాబు, దేశాయ్ తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, సుజయకృష్ణ రంగారావు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జోగి రమేశ్, ప్రసాదరాజు తదితరులున్నారు.
బాబు ఆస్తులపై సీబీఐ విచారణ
గవర్నర్ నరసింహన్‌కు వైఎస్సార్‌సీపీ వినతిపత్రం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా ఎమ్మార్, ఐఎంజీ భూ బాగోతాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. ఈ మేరకు ఆయనకు ప్రత్యేకంగా మరో వినతిపత్రం అందజేసినట్టు మేకపాటి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లోనే ఉంచాలంటూ రాష్ట్రపతికి టీడీపీ లేఖ రాయడం, ఆయన అపాయింట్‌మెంట్ కోరడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘‘బాబు హయాంలో తొమ్మిదేళ్లలో రోజుకో కుంభకోణం వెలుగు చూసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, జీవీకే స్పెక్ట్రమ్ కంపెనీలకు రెట్టింపు ఖర్చుతో ప్రాజెక్టులు కేటాయించడంపై సాక్షాత్తూ కాగ్ బాబును తీవ్రంగా అభిశంసించింది.
ప్రైవేట్ పోర్టుల నిర్మాణంలోనూ బాబు భారీగా అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. హైటెక్ సిటీ నిర్మాణాన్ని గ్లోబల్ టెండర్లు లేకుండా తనకిష్టమైన ఎల్ అండ్‌టీకి దక్కేలా చేశారు. 2003లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఊరు, పేరు లేని ఐఎంజీ భారత అనే నకిలీ కంపెనీకి హైదరాబాద్ నడిబొడ్డులో ఏకంగా 850 ఎకరాల భూమిని బాబు కట్టబెట్టారు. తన సొంత జిల్లాకు చెందిన అహోబిలరావుకు చంద్రబాబు కారుచౌకగా భూమి కట్టబెట్టారు. ఇది పూర్తిగా టీడీపీ ముఖ్యుల బినామీ వ్యవహారమే అయినా సీబీఐ మాత్రం సిబ్బంది కొరత సాకుతో దీనిపై విచారణ చేయకుండా చేతులెత్తేసింది. జగన్ విషయంలో మాత్రం అదే సీబీఐ ఎక్కడాలేని అత్యుత్సాహం చూపింది. టీడీపీ హయాంలో ఎమ్మార్‌కు 535 ఎకరాల కేటాయింపు వెనక పెద్ద కుంభకోణం దాగుంది.
అయినా ఎమ్మార్‌పై విసృ్తత విచారణ చేపట్టామంటున్న సీబీఐ, బాబును నామమాత్రంగానైనా ప్రశ్నించలేదు. ఆయన హయాంలోని ఏలేరు, నకిలీ నోట్లు, స్టాంపుల కుంభకోణాల వెనుక ఉన్నది టీడీపీ ప్రముఖులేనన్నది జగమెరిగిన సత్యం’’ అని ఆ వినతిపత్రంలో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. బాబు అవినీతిని తామిప్పటికే ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా, అరాచక పాలనతో ప్రజలపై మోయలేని భారం మోపుతున్న ఆ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు సహకరిస్తూండటంతో ఆయనపై చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సమైక్యంగా ఉంచండి : వైఎస్సార్‌సీపీ
Published Sun, Sep 22 2013 2:24 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM
Advertisement
Advertisement