యాపిల్ 5సీ... పండలేదు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఫోన్లో ఏ మోడలొచ్చినా హాట్‌కేకే. ఐఫోన్..ఐప్యాడ్‌లతో యాపిల్ చరిత్రే మారిపోయింది. అలాంటి యాపిల్‌కు... ఐఫోన్ 5సీ మాత్రం కలిసి రాలేనట్లే కనిపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 5సీకి దేశవ్యాప్తంగా స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 వేల పీసులే విక్రయించినట్టు సమాచారం. ఎలాగైనా 5సీ అమ్మకాలను పెంచాలని భావిస్తున్న ఆపిల్... ఆ దిశగా ఎత్తులు వేస్తోంది. త్వరలో బై బ్యాక్ పథకాన్ని ప్రకటించనుంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్(ఎంపిక చేసిన మోడళ్లు) తెచ్చిన వారికి 5సీపై డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక యాపిల్ కంపెనీ మొబైల్ ఫోన్ల విక్రయదారులపై(రిటైలర్లు) ఒత్తిడి కూడా పెంచుతోంది. ఐఫోన్ 5ఎస్ కావాలంటే ఒక 2 జీబీ ఐపోడ్, ఒక ఐఫోన్ 5సీ కొనాల్సిందేనని షరతు పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.3,400 ఖరీదైన ఈ ఐపోడ్‌కు కూడా పెద్దగా డిమాండ్ లేదని తెలుస్తోంది.
5సీ ఖరీదెక్కువా?
భారత్‌లో ఐఫోన్ 5సీ 16 జీబీ మోడల్ ధర రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500 ఉంది. ధర ఎక్కువగా ఉందని కస్టమర్లు తమతో అంటున్నారని ఒక రిటైలర్ చెప్పారు. వాస్తవానికి 5సీ ఫీచర్లు బాగున్నాయని, దాని గురించి వివరిస్తే కస్టమర్లు కొంటున్నారని ఆయన తెలియజేశారు. 5సీ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు 5ఎస్ గోల్డ్ కలర్ మోడల్‌ను రూ.1.2 లక్షలు వెచ్చించి సైతం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. కాగా, ఎయిర్‌టెల్‌తో బండిల్ ఆఫర్‌ను ప్రకటించేందుకు ఆపిల్ సిద్ధమవుతోంది. ఎయిర్‌టెల్‌తో జత కలవడం వల్ల కొత్త మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌తో బండిల్ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్ నవంబరు 1న భారత్‌లో ఐఫోన్ 5ఎస్, 5సీ విడుదల చేసింది.
5ఎస్‌కు కొరత..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐఫోన్ 5ఎస్ 30 వేల పీసులు అమ్ముడయ్యాయి. 5ఎస్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. సరఫరా ఆ స్థాయిలో లేదు. యాపిల్ తొలిసారిగా బంగారు వర్ణంలో 5ఎస్‌ను రూపొందించింది. విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మోడల్ కోసం కస్టమర్లు అందరూ పట్టుబడుతున్నారు. గోల్డ్ కలర్‌కు ప్రపంచవ్యాప్తంగా స్పందన ఈ స్థాయిలో ఉంటుందని కంపెనీ సైతం ఊహించలేదు. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్‌ను యాపిల్ రూపొందించింది. ఐఫోన్ 5ఎస్ 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500గా ఉంది. కాగా, బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలినవన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసిన రంగులే. కొన్ని రంగుల 5సీ మోడళ్లు గోడౌన్లలో పేరుకుపోతున్నాయట. పరిస్థితి ఇలాగే ఉంటే యాపిల్‌కు కొత్త కష్టాలొచ్చే అవకాశం లేకపోలేదు.