నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ
-
విభజనను అడ్డుకోవాలని మరోసారి విన్నవించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు
-
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కోరుతున్న జగన్
-
నేటి సాయంత్రం జేడీ(యూ) నేత శరద్‌యాదవ్‌తో సమావేశం
-
రేపు (24న) భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ
-
ఎల్లుండి (25న) ముంబైలో ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి.. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే.. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు.
అనంతరం అక్కడి నుంచి ముంబై చేరుకుని 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ అవుతారు. రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేసి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజిస్తోందని వివరించి మద్దతు కోరటంతో పాటు.. రాష్ట్రాలను విభజించాలంటే సంబంధిత రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం ఉండాలన్న విధంగా రాజ్యాంగంలో సవరణలు చేయాలని.. అందుకు సంపూర్ణ సహకారం కావాలని ఆయా నేతలను జగన్‌మోహన్‌రెడ్డి కోరనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తమ పార్టీ చేస్తున్న పోరాటానికి సహకరించాలని, పార్లమెంటులో తమకు మద్దతుగా నిలవాలని జగన్ ఇప్పటికే సీపీఎం, సీపీఐ, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేతలను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే జేడీ(యూ), బీజేడీ, ఎన్‌సీపీ నేతలను కూడా జగన్‌మోహన్‌రెడ్డి కలవనున్నారు.
భువనేశ్వర్, ముంబై వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి.. భువనేశ్వర్, ముంబై నగరాలకు వెళ్లటానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి 24న భువనేశ్వర్‌లో నవీన్‌పట్నాయక్‌ను, 25న ముంబైలో శరద్‌పవార్‌లను కలిసేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారని, ఈ నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కోరాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఇందుకు అనుమతించిన మొదటి అదనపు ప్రత్యేక జడ్జి ఎం.వి.రమేష్ ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే.. ఈ నెల 26 నుంచి 29 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చెన్నైలో కలిసేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.