రుచికి చేవ... ఆవ! | D. strength to taste ...! | Sakshi
Sakshi News home page

రుచికి చేవ... ఆవ!

Published Fri, Apr 25 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

రుచికి చేవ... ఆవ!

రుచికి చేవ... ఆవ!

ఆవ ఓ పెద్ద హైజాకరు... ఓ మహా దోపిడీదారు.
 ఏం... పచ్చట్లో నూనె పోయడం లేదా? కారం వేయడం లేదా?
 ఆ మాటకొస్తే అల్లం, వెల్లుల్లీ లాంటివి వాడటం లేదా?
 మిగతా వాటన్నింటినీ హైజాక్ చేసేస్తుంది ఆవ.
 అలా చేసేసి ‘మామిడికాయ’ పచ్చడికి ‘ఆవకాయ’ అంటూ తన పేరే పెట్టించేలా చేస్తుంది.  
 ఆవకాయనాడే నామకరణోత్సవం చేయిస్తుంది.
 ఏమిటీ దౌర్జన్యం? ఎందుకీ పేరు దోపిడీ?
 ఎందుకంటే... ‘ఆవ’ రుచికి చేవనిస్తుంది.
 మా‘మిడిమిడి’ రుచి సంపూర్ణమయ్యేలా సేవ చేస్తుంది.
 పచ్చడిని రుచుల తోవ నడిపిస్తుంది.
 అందుకే కొత్త ఆవకాయను చూడగానే జనమంతా ఆకలిని అర్జెంటుగా అద్దెకు తెచ్చుకుంటారు.  
 కమ్మటి వాసన రాగానే కంచం ముందేసుకుంటారు.
 ఆవకాయ కనిపించగానే ‘ఆవ’క్కటే వేయమంటారు.
 అల్లం, మసాలా, నువ్వు, కొబ్బరి ఆవకాయల్ని ఇక్కడ మీ ముందుంచుతున్నాం.
 కొత్త ఆవకాయ పెట్టుకున్నాం కదా... అందుకే ఇవ్వాళ్టికి...
 ‘ఆవ’క్కటే వేసుకు తిందాం. ‘ఆవ’క్కటే చాలునందాం.

 
 మసాలా ఆవకాయ
 
 కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కేజీ
 నువ్వుల నూనె - పావు కేజీ, కారం - పావు కేజీ
 అల్లం + వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, పసుపు - టీ స్పూను, ఉప్పు - పావు కేజీ
 జీలకర్ర పొడి - 50 గ్రా., ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - టేబుల్ స్పూను, మెంతి పొడి - టీ స్పూను, పసుపు - టేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులు - టీ స్పూను
 ఇంగువ - టీ స్పూను, ఎండుమిర్చి - 10
 
 తయారీ:  
 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి  
 
 ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి  
 
 మామిడికాయ ముక్కలు జత చేయాలి  మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి  
 
 జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగినతర్వాత దింపేయాలి  
 
 కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి  
 
 చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి  
 
 శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి  
 
 ఈ ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది.
 
 చట్నీ ఆవకాయ
 
 కావలసినవి: 
మామిడికాయ గుజ్జు - కేజీ, ఉప్పు - పావు కేజీ
 పసుపు - టేబుల్ స్పూను, కారం - 125 గ్రా.
 అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కేజీ,
 నువ్వుల నూనె - పావు కేజీ
 జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
 మెంతి పొడి - టేబుల్ స్పూను, ఇంగువ - టీ స్పూను
 ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటి న్నర టీ స్పూన్లు
 
 తయారీ:
 బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్‌లో ఉడికించాలి  
 
 చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి  
 
 ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి  
 
 ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి  
 
 మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి  
 
 ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి  
 
 నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి  
 
 పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడిగుజ్జు వేసి బాగా కలియబెట్టాలి
 
 శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి
 
 మూడు రోజుల తర్వాత మళ్లీ కలపాలి
 
 ఈ ఆవకాయను అన్నంలోకే కాకుండా, చట్నీలా ఇడ్లీ, దోసె, ఉప్మాలకు కూడా వాడుకోవచ్చు.
 
 స్వీట్ పచ్చడి
 
 కావలసినవి:  
 మామిడి తురుము - 3 కప్పులు (తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది); పంచదార - కప్పు; ఏలకుల పొడి - టీ స్పూను; జీడిపప్పు - 10 బాదంపప్పు - 10; నెయ్యి - టీ స్పూను; కిస్మిస్ - 20
 
 తయారీ:  
 జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి  
 
 బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి  
 
 ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి  
 
 పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి  
 
 దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి  
 
 దీన్ని  జామ్‌లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు.
 
 అల్లం ఆవకాయ
 
 కావలసినవి:  

 మామిడికాయ ముక్కలు - కిలో
 ఉప్పు - 125 గ్రా., కారం - 125 గ్రా.
 నువ్వుల నూనె - పావు కిలో; అల్లం ముద్ద - 125 గ్రా.
 వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; పసుపు - టీ స్పూను
 జీలకర్ర పొడి - 50 గ్రా.; మెంతిపొడి - టీ స్పూను
 ఇంగువ - టీ స్పూను; ఆవాలు, జీలకర్ర, మెంతులు - టీ స్పూను
 
 తయారీ:     
 మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి  
      
 ఒక గిన్నెలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి  
 
 వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి  
 
 ఆవాలు, జీలకర్ర, మెంతులు జత చేసి బాగా వేయించి దింపేయాలి
 
 నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి
 
 పూర్తిగా చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి
     
 మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి
     
 మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.
 
 కొబ్బరి ఆవకాయ
 
 కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కిలో; ఉప్పు - పావు కిలో, పసుపు - టేబుల్ స్పూను; కారం - 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో నువ్వుల నూనె - పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ - టీ స్పూను, జీలకర్ర , మెంతులు - టీ స్పూను
 
 తయారీ:  
 మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి  
 
 ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి  
 
 వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి  
 
 జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి  
 
 నూనె చల్లారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి
 
 పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి  
 
 మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.
 
 నువ్వు ఆవకాయ
 
 కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కిలో; నువ్వులు - పావు కిలో, ఉప్పు - పావు కిలో; నువ్వుల పొడి - అర కిలో; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా.,
 పసుపు - టీ స్పూను; జీలకర్ర పొడి - 25 గ్రా., మెంతి పొడి - టేబుల్ స్పూను;
 ఇంగువ - చిటికెడు; ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్లు
 
 తయారీ:  
 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి   
 
 నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి   
 
 ఒక  గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి  
 
 వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి  
 
 ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయాలి   
 
 నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది)   
 
 పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి   
 
 అన్నిముక్కలకూ మసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి  
 
 మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు   
 
 ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.
 
 కర్టెసీ:జ్యోతి వలబోజు
 హిమాయత్ నగర్
 హైదరాబాద్
 www.shadruchulu.com

 
 సేకరణ:డా. వైజయంతి
 ఫొటోలు: అనిల్‌కుమార్ మోర్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement