సేంద్రియ కర్బనమే సేద్యానికి ప్రాణం! | The soil organic carbon to the life! | Sakshi
Sakshi News home page

సేంద్రియ కర్బనమే సేద్యానికి ప్రాణం!

Published Tue, Jan 17 2017 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

సేంద్రియ కర్బనమే సేద్యానికి ప్రాణం! - Sakshi

సేంద్రియ కర్బనమే సేద్యానికి ప్రాణం!

  • మన భూముల్లో సేంద్రియ కర్బనం 0.5 నుంచి 0.1%కి పడిపోయింది.
  • భూముల్లో సేంద్రియ కర్బనం పెంపుదలతోనే వ్యవసాయానికి రక్షణ.
  • ప్రకృతి / సేంద్రియ పద్ధతులతో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
  • తక్కువ ఖర్చుతో.. ఒక పంట కాలంలోనే పెంపొందించుకునే మార్గాలెన్నో.
  • మీరు వ్యవసాయాన్ని జీవితకాలం పాటు చేయాలనుకుంటున్నారా?
    తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఉత్పత్తులు సాధించాలనుకుంటున్నారా?
    వీలయినంత వరకు ఖర్చు లేకుండానే పంటల సాగు చేయాలనే ఆలోచన ఉందా?
    అలా అయితే భూమాతను నమ్ముకోండి!

    భూమాతను నమ్ముకోవటం అంటే.. పంట భూముల్లో ప్రకృతి / సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడమేనని అంటున్నారు డాక్టర్‌ ఎ. నాగేశ్వరరావు. తిరుపతి వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం తిరుపతిలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. మన భూముల్లో 0.5 % కన్నా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, రసాయనిక ఎరువులకు పూర్తిగా స్వస్తి పలికి ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, స్వల్పకాలంలోనే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునేఅనేక మార్గాలున్నాయని నాగేశ్వరరావు సూచిస్తున్నారు.. చదవండి ఆయన మాటల్లోనే..

    మన దేశ వ్యవసాయ చరిత్ర చాలా పురాతనమైనది. దాదాపు 9 వేల సంవత్సరాలకు ముందు నుంచే మనకు వ్యవసాయం తెలుసు. ఇన్ని వేల సంవత్సరాలు భూమాతను నమ్ముకొని పంటలు సాగు చేశారు మన పూర్వీకులు. భూసారం తగ్గకుండా చాలా పద్ధతులు అవలంభించారు. అయితే, మన రైతులు, శాస్త్రజ్ఞులు భూమాతను మరచిపోయి 50 సంవత్సరాలు దాటింది. 1966 నుంచి అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులపై, వీలుంటే నీటి పారుదల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ఈ 50 ఏళ్లలో భూసారం కాలక్రమేణా తగ్గింది. అది ప్రస్తుతం ఏ స్థాయికి చేరిందంటే అసలు భూమి పంటలు పండించే శక్తిని పూర్తిగా కోల్పోయే స్థితికి చేరింది.

    95% భూముల్లో అతి తక్కువ సేంద్రియ కర్బనం
    మన నేలలను పరీక్షించి ఏ యే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలియజేస్తారు. ప్రభుత్వపు భూసార పరీక్షా కేంద్రాలలో ముఖ్య పోషకాల మోతాదు ఎంత ఉన్నదీ తెలుస్తుంది. సేంద్రియ కర్బనం (ఆర్గానిక్‌ కార్బన్‌) 0.5% కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉందా అనే విషయం కూడా ఈ పరీక్షలో తెలుస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కొన్ని క్షేత్రాలలో పరీక్షల ద్వారా వచ్చిన సేంద్రియ కర్బనం ఫలితాలు చాలా దిగ్భ్రాంతిని కలుగజేస్తున్నాయి. నేల న మూనాలలో 95 శాతం పైగా సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువని తేలింది. అనంతపురం జిల్లాలోని వర్షాధారపు భూముల్లో 0.1 శాతం వరకు పడిపోయినట్లు నమోదయింది. వ్యవసాయ విశ్వ విద్యాలయ క్షేత్రాలలో కూడా 0.1 నుంచి 0.5 % వరకు ఉన్నట్లు నేలల పరీక్ష ఫలితాలు నిరూపించాయి. పశువుల ఎరువులు, ఇతర సేంద్రియ ఎరువులు వాడకపోవడం, కేవలం రసాయనిక ఎరువులకే పరిమితం కావడం ఈ దుస్థితికి కారణం.

    తక్కువైతే రైతుకు ఇబ్బందులే...
    సేంద్రియ కర్బనం 0.5 % కంటే తక్కువ ఉంటే పంటల ఎదుగుదల, దిగుబడులు ఆశించినంతగా ఉండవు. అలాంటి నేలల్లో పంట దిగుబడులు పెంచాలంటే రైతులకు రసాయనిక ఎరువుల సహాయం తప్పనిసరి. రైతులు చేసే మొదటి పని నత్రజని ఎరువుల వాడకం పెంచడం. దీనివల్ల పురుగులు మరియు తెగుళ్లు అధికమవుతాయి. రసాయనిక పురుగు మందుల వాడకం తప్పదు. వీటి కల్తీ పెరుగుతున్నది. రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణదారుల సలహాల మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. మోసాలు ఎక్కువై సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వాతావరణ వ్యత్యాసాల వల్ల పంట దిగుబడులు ఆశించినంతగా ఉండటం లేదు. ఉన్నా గిట్టుబాటు ధరలు లేక నష్టాలే మిగులుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుకుంటే గట్టెక్కవచ్చు.

    2.0% కంటే ఎక్కువ ఉంటే నిశ్చింత..
    రైతుల పంట దిగుబడులు ఆశించినంతగా లేకపోయినా బాగానే ఉంటాయి. పంట మొక్కల పటుత్వం, ధృఢత్వం పెరుగుతుంది. వర్షాలు, గాలులు ఎక్కువయినా కొన్ని పంటలు పడిపోకుండా తట్టుకోగలవు. ఈ పైర్లలో రసాయనిక ఎరువులతో పెరిగిన మొక్కల కున్న మృదుత్వం ఉండదు. కొన్ని రకాల కీటకాలు (పిండి పురుగు) తెగుళ్లు (ఆకుమచ్చ) ఆశించవు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా కొంత దిగుబడులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి నేలలోని పైరును కీటకాలు తెగుళ్ల బారి నుంచి రక్షించడం తేలిక. జీవామృతం పిచికారీతో కూడా వాటిని నివారించవచ్చు. అన్ని ప్రాంతాల్లో దొరికే ఆకులతో (కీటక నివారిణి) తయారు చేసిన ద్రావణంతో చీడపీడలను నివారించవచ్చు. అంటే పంటల దిగుబడికయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలరు. ఇలాంటి నేలల్లో వ్యవసాయం తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ఆస్కారమే ఉండదు. సేంద్రియ కర్బనం 2.0% గానీ లేదా అంతకు మించి గానీ పెంచగలిగిన నేలలో పంటలను సాగుచేస్తే.. ఆ ఆనందం ఏమిటో మీకే స్వయంగా అనుభవంలోకి వస్తుంది.

    మన నేలల్లో 0.5%కు మించి పెంచలేమా?
    ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఐరోపా దేశాల భూముల్లో సేంద్రియ కర్బనం 2.0 నుంచి 8.0% వరకు ఉంటుంది. మన దేశం వేడి ప్రాంతంలో ఉంది. అధికంగా ఉష్ణోగ్రతలుండే మన భూముల్లో సేంద్రియ పదార్థం త్వరగా అంతరించిపోతుంది. కాబట్టి సేంద్రియ కర్బనం పెరుగుదల చాలా కష్టమైన ప్రక్రియగా మారింది. మన నేలల్లో 0.5%కు మించి పెంచడం కష్టసాధ్యమని శాస్త్రజ్ఞులంటారు. అయితే, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులు కొందరు సేంద్రియ కర్బనాన్ని ఈ అంచనాలకు మించి పెంచుకోగలుగుతున్నారు.

    తక్కువ ఖర్చుతో.. తక్కువ కాలంలోనే..
    నేలల్లో సేంద్రియ కర్బనాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలోనే పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ కింది పద్ధతులలో ఒకటిని గానీ, కొన్నిటిని గానీ.. రైతులు తమకున్న వనరులు, ఖర్చును మనసులో ఉంచుకొని ఆచరించవచ్చు.
    1.    ఘనజీవామృతం, ద్రవ జీవామృతం వాడకం వల్ల ఒక పంట కాలంలో 0.5% వరకు సేంద్రియ కర్బనం పెంచవచ్చు.
    2.    పచ్చిరొట్ట పంటలు సాగు చేసి 40 రోజులు పంట ఎదిగిన తర్వాత భూమిలో దున్నాలి. దీనివల్ల కూడా కర్బనం 0.5% వరకు పెరుగుతుంది.
    3.    దబోల్కర్‌ పద్ధతిలో 25 రకాల ధాన్యాలను ఒక్కొక్కటి ఒక కిలో చొప్పున ఒక ఎకరంలో విత్తి 40 రోజుల తరువాత భూమిలో దున్నితే సేంద్రియ కర్బనం 0.5% కు పైగా పెరుగుతుంది.
    4.    పత్తిపాటి రామయ్య గారి ‘రామబాణం’ పద్ధతిలో కూడా ఒకే పంటకాలంలో 0.5% కు పైగానే పెంచవచ్చు.
    5.    పై పద్ధతులలో ఏవైనా రెంటిని ఒక దాని తరువాత మరొకటి అనుసరిస్తే.. సేంద్రియ కర్బనం 1.0%కు పైగా పెంపొందించుకునే అవకాశాలున్నాయి.
    6.    ఇలా చేస్తే రెండు సంవత్సరాలలో 2.0%కు ఆపైన కూడా పెంచవచ్చు.
    7. 2.0%కు చేరిన తరువాత ప్రతి సంవత్సరం మొదట చెప్పిన పద్ధతులలో ఏ ఒక్కదాన్ని కొనసాగించినా 2.0%కు తగ్గకుండా ఉంచుకోవచ్చు.

    ఇందుకు నిదర్శనంగా ఇక్కడ ఇద్దరు రైతుల గురించి ప్రస్తావించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరలో ఉండే గద్దె సతీష్‌ (99125 11244) గారి పొలంలో సేంద్రియ కర్బనం 2.0%కు తగ్గకుండా ఉంటుంది. పంటకు పంటకు మధ్య కాలంలో పశువులను పొలంలో మందకడుతున్నారు. వారు దశాబ్దాలకు పైగా ఇలాగే చేస్తున్నారు. కర్నూలు జిల్లా వాసి కృష్ణ (81848 46488) గారు ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట పంటలు వేసి నేలలో కలియదున్నుతుంటారు. జీవామృతం వాడుతూ తమ భూముల్లో సేంద్రియ కర్బనం 2.0కు దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో గత పది సంవత్సరాలకన్నా ముందే రసాయనిక ఎరువుల వాడకం మానేశారు. ప్రతి సంవత్సరం పశువుల ఎరువు వేస్తారు. పశువులను పొలంలో మందకడుతున్నారు. అక్కడి నేల నమూనాలు సేకరించి పరీక్షలు జరిపితే.. సేంద్రియ కర్బనం 1.2 నుంచి 2.6% వరకు ఉందని తేలింది. వ్యవసాయం కుటుంబ వ్యాపకంగా ఉన్న రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 1.5 నుంచి 2.0%కు తప్పకుండా పెంచడం చాలా అవసరం. పైన పేర్కొన్న పద్ధతులలో ఒక దానిని క్రమం తప్పకుండా ఆచరణలో పెడితే మీ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.
    (డా. ఎ. నాగేశ్వరరావును 0877–2249288, 70957 00479, 94412 54555 నంబర్లలో సంప్రదించవచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement