సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం! | Organic Carbon Is Life Of Crop Says Dr Ram Murthy | Sakshi
Sakshi News home page

సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!

Published Tue, Dec 7 2021 5:55 PM | Last Updated on Tue, Dec 7 2021 5:55 PM

Organic Carbon Is Life Of Crop Says Dr Ram Murthy - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో పంట భూముల గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్‌ వి. రామమూర్తి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఏర్పాటైన ‘జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్‌.బి.ఎస్‌.ఎస్‌–ఎల్‌.యు.పి.)’ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆయన సేవలందిస్తున్నారు. స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలను సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇవ్వటంలో ఆయన నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన. 
ఇటీవల హైదరాబాద్‌లో డా. రామమూర్తితో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూసారం స్థితిగతులను గత కొన్ని దశాబ్దాలుగా మీరు అధ్యయనం చేస్తున్నారు కదా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 
భూసారం స్థాయిని తెలిపే సూచిక సేంద్రియ కర్బన శాతమే. మట్టి పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. అధికం (0.7%–అంతకన్నా ఎక్కువ), మధ్యస్థం (0.4–06%), అత్యల్పం (0.3– అంతకన్నా తక్కువ) స్థాయిల్లో సేంద్రియ కర్బనాన్ని లెక్కగడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంట భూముల స్థితిగతులపై 30 ఏళ్ల క్రితం పరీక్షలు చేసినప్పుడు సేంద్రియ కర్బనం సగటున మధ్యస్థంగా (అంటే.. 0.5%కు మించి) ఉండేది. నాలుగేళ్ల క్రితం పరీక్షించినప్పుడు 0.2–0.3%కి తగ్గిపోయింది. పంటలు బాగా పండాలంటే కనీసం 1% అయినా సేంద్రియ కర్బనం ఉండాలి. మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి 1% కష్టం అనుకున్నా.. 0.7 నుంచి 0.9 వరకైనా పెంచుకోగలగాలి. సేంద్రియ కర్బనమే నేలకు, పంటకు ప్రాణం. పౌష్టికాహార భద్రతకు ఇది చాలా ముఖ్యం. 

సేంద్రియ కర్బనం అంతగా ఎలా తగ్గింది?
రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వాడుతున్నారు. పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. ఒకే పంట వేస్తున్నారు. ప్రతి ఏటా అదే సాగు చేస్తున్నారు. ఏయే పంటల్లో ఎక్కువ వాడుతున్నారు? వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీలు కూడా అంతే. అందుకే సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది.

రసాయనిక కలుపు మందులూ కారణమేనా?
ఖచ్చితంగా. రసాయనిక ఎరువులతో భూమిలో వానపాములు నశించాయి. పురుగుమందులు, కలుపు మందులతో భూమిలో సూక్ష్మజీవరాశి వంద శాతం నశిస్తోంది. రైజోబియం బాక్టీరిఆయ, ఆక్టినోమైసిట్స్, మైకోరైజా వంటి మేలు చేసే సూక్ష్మజీవరాశి పూర్తిగా అంతరించిపోతోంది. 

పరిష్కారం ఏమిటి?
పంటల సాగు పదికాలాల పాటు బాగుండాలంటే మనం చేసే పనుల వల్ల భూసారానికి ఏమవుతుందో కూడా గమనించుకోవాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవటం అత్యవసరం. పంట బాగా పండాలంటే 16 స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండాలి. మట్టిలో సేంద్రియ కర్బనం ఎంత ఎక్కువ ఉంటే పంటలకు వీటి లభ్యత అంత ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం 0.2% ఉన్న భూముల్లో పోషకాలు మరీ అడుగంటిపోయాయి. సాగు పద్ధతిలో మార్పులు చేసుకొని సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. 

అంతర పంటలతో సమస్య తీరుతుందా?
పత్తి వంటి ప్రధాన పంట మధ్యలో 3 సాళ్లకు ఒక సాలు పప్పుధాన్యాలు వేసుకుంటే మంచిది. అంతర పంటల వల్ల ఆర్థికంగా రైతుకు రిస్క్‌ తగ్గుతుంది. ఒక పంట పోయినా మరో పంట ఆదుకుంటుంది. సేంద్రియ కర్బనం పెంచుకోవడానికైతే అంతర పంటలతో 30–40% ప్రయోజనం ఉంటే పంట మార్పిడి వల్ల వంద శాతం ఉంటుంది. వరుసగా 3,4 ఏళ్లు పంట మార్పిడి చేస్తూ రసాయనిక ఎరువులతోపాటు పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు వేసుకుంటూ ఉంటే సేంద్రియ కర్బనంలో మార్పు కనిపిస్తుంది. పంట భూములు పూర్తిగా నిస్సారమైపోకుండా ఉండాలంటే పట్టుబట్టి సేంద్రియ కర్బనాన్ని 0.7%కి పెంచుకోవటం ముఖ్యం. 

సేంద్రియ సేద్యం వైపు మళ్లాల్సిందేనా?
రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్తే సడన్‌గా దిగుబడులు తగ్గుతాయి. రసాయనిక, సేంద్రియ ఎరువులు సమతూకంగా వాడుతూ సమీకృత సేద్యం చేపట్టాలి. క్రమంగా కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోకి మారాలి. క్రమంగా సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి దిగుబడులు తగ్గకుండానే సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవచ్చు. 

ఏయే జిల్లాల్లో భూములు ఏయే పంటలకు అనుకూలమో మీ సంస్థ చెప్తోంది కదా..?
అవును. దేశవ్యాప్తంగా పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్స్‌ ప్రకటించాం. ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆ ప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్‌ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి.. శాస్త్రీయంగా పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్స్‌ నివేదికలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పాం. 

తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్స్‌పై మండల స్థాయి వివరాలను విశ్లేషించి 71 పంటలను పరిశీలించాం. ఏయే జిల్లాల్లో సాగుకు ఏయే పంటలు అనుకూలమో సూచించాం. ప్రతి జిల్లాకు 3 నుంచి 20 అనుకూల పంటలు సూచించాం. ఈ పనికి రెండేళ్లు పట్టింది. ఈ సమాచారాన్ని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారంతో జోడించి విశ్లేషించుకొని మేం సూచించిన అనుకూల పంటల జాబితాలో నుంచి ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వం, రైతులు నిర్ణయించుకోవాలి.  

ఈ అవగాహన రసాయనిక సేద్యంతోపాటు ప్రకృతి సేద్యం చేసే రైతులకూ ఉపయోగమేనా?
సాగు పద్ధతిని బట్టి, నమూనాలు సేకరించే ఎండ, వానా కాలాలను బట్టి మారిపోయే అంశాల ఆధారంగా మేం ఈ అంచనాలకు రావటం లేదు. ఏ రైతుకైనా పొటెన్షియల్‌ క్రాప్‌ జోన్ల సమాచారం ఉపయోగకరమే.
(డా. రామమూర్తి ఈ–మెయిల్‌: (ramamurthy20464@gmail.com )  – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement