Organic carbon
-
మృత్తికా సారం తగ్గుతోంది!
నాగ్‌పూర్: భారతీయ నేలల్లో సేంద్రియ కర్బన (ఎస్ఓసీ) స్థాయి గత 70 సంవత్సరాల్లో 1 నుంచి 0.3 శాతానికి పడిపోయిందని నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథార్టీ (ఎన్ఆర్ఏఏ) తెలిపింది. మృత్తిక స్వరూపం, సారం, నీటిని ఒడిసిపట్టుకోవడంలో ఎస్ఓసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈఓ అశోక్ చెప్పారు. ఎస్ఓసీ స్థాయిలు భారీగా పడిపోవడం భూమిలోని అవసర సూక్ష్మక్రిములపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, దీనివల్ల మొక్కలకు పోషకాలు అందడం తగ్గుతుందని హెచ్చరించారు. సాగు అతిగా చేయడం, ఎక్కువగా ఎరువుల వాడకం, పంటమార్పిడి లేకపోవడం వంటివి ఎస్ఓసీ క్షీణతకు కారణాలన్నారు. జైవిక ఎరువులను వాడడం వల్ల ఎస్ఓసీ స్థాయిని పెంచవచ్చన్నారు. -
సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!
తెలుగు రాష్ట్రాల్లో పంట భూముల గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్ వి. రామమూర్తి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఏర్పాటైన ‘జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్.బి.ఎస్.ఎస్–ఎల్.యు.పి.)’ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆయన సేవలందిస్తున్నారు. స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలను సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇవ్వటంలో ఆయన నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన. ఇటీవల హైదరాబాద్‌లో డా. రామమూర్తితో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూసారం స్థితిగతులను గత కొన్ని దశాబ్దాలుగా మీరు అధ్యయనం చేస్తున్నారు కదా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భూసారం స్థాయిని తెలిపే సూచిక సేంద్రియ కర్బన శాతమే. మట్టి పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. అధికం (0.7%–అంతకన్నా ఎక్కువ), మధ్యస్థం (0.4–06%), అత్యల్పం (0.3– అంతకన్నా తక్కువ) స్థాయిల్లో సేంద్రియ కర్బనాన్ని లెక్కగడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంట భూముల స్థితిగతులపై 30 ఏళ్ల క్రితం పరీక్షలు చేసినప్పుడు సేంద్రియ కర్బనం సగటున మధ్యస్థంగా (అంటే.. 0.5%కు మించి) ఉండేది. నాలుగేళ్ల క్రితం పరీక్షించినప్పుడు 0.2–0.3%కి తగ్గిపోయింది. పంటలు బాగా పండాలంటే కనీసం 1% అయినా సేంద్రియ కర్బనం ఉండాలి. మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి 1% కష్టం అనుకున్నా.. 0.7 నుంచి 0.9 వరకైనా పెంచుకోగలగాలి. సేంద్రియ కర్బనమే నేలకు, పంటకు ప్రాణం. పౌష్టికాహార భద్రతకు ఇది చాలా ముఖ్యం. సేంద్రియ కర్బనం అంతగా ఎలా తగ్గింది? రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వాడుతున్నారు. పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. ఒకే పంట వేస్తున్నారు. ప్రతి ఏటా అదే సాగు చేస్తున్నారు. ఏయే పంటల్లో ఎక్కువ వాడుతున్నారు? వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీలు కూడా అంతే. అందుకే సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. రసాయనిక కలుపు మందులూ కారణమేనా? ఖచ్చితంగా. రసాయనిక ఎరువులతో భూమిలో వానపాములు నశించాయి. పురుగుమందులు, కలుపు మందులతో భూమిలో సూక్ష్మజీవరాశి వంద శాతం నశిస్తోంది. రైజోబియం బాక్టీరిఆయ, ఆక్టినోమైసిట్స్, మైకోరైజా వంటి మేలు చేసే సూక్ష్మజీవరాశి పూర్తిగా అంతరించిపోతోంది. పరిష్కారం ఏమిటి? పంటల సాగు పదికాలాల పాటు బాగుండాలంటే మనం చేసే పనుల వల్ల భూసారానికి ఏమవుతుందో కూడా గమనించుకోవాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవటం అత్యవసరం. పంట బాగా పండాలంటే 16 స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండాలి. మట్టిలో సేంద్రియ కర్బనం ఎంత ఎక్కువ ఉంటే పంటలకు వీటి లభ్యత అంత ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం 0.2% ఉన్న భూముల్లో పోషకాలు మరీ అడుగంటిపోయాయి. సాగు పద్ధతిలో మార్పులు చేసుకొని సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. అంతర పంటలతో సమస్య తీరుతుందా? పత్తి వంటి ప్రధాన పంట మధ్యలో 3 సాళ్లకు ఒక సాలు పప్పుధాన్యాలు వేసుకుంటే మంచిది. అంతర పంటల వల్ల ఆర్థికంగా రైతుకు రిస్క్ తగ్గుతుంది. ఒక పంట పోయినా మరో పంట ఆదుకుంటుంది. సేంద్రియ కర్బనం పెంచుకోవడానికైతే అంతర పంటలతో 30–40% ప్రయోజనం ఉంటే పంట మార్పిడి వల్ల వంద శాతం ఉంటుంది. వరుసగా 3,4 ఏళ్లు పంట మార్పిడి చేస్తూ రసాయనిక ఎరువులతోపాటు పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు వేసుకుంటూ ఉంటే సేంద్రియ కర్బనంలో మార్పు కనిపిస్తుంది. పంట భూములు పూర్తిగా నిస్సారమైపోకుండా ఉండాలంటే పట్టుబట్టి సేంద్రియ కర్బనాన్ని 0.7%కి పెంచుకోవటం ముఖ్యం. సేంద్రియ సేద్యం వైపు మళ్లాల్సిందేనా? రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్తే సడన్‌గా దిగుబడులు తగ్గుతాయి. రసాయనిక, సేంద్రియ ఎరువులు సమతూకంగా వాడుతూ సమీకృత సేద్యం చేపట్టాలి. క్రమంగా కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోకి మారాలి. క్రమంగా సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి దిగుబడులు తగ్గకుండానే సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏయే జిల్లాల్లో భూములు ఏయే పంటలకు అనుకూలమో మీ సంస్థ చెప్తోంది కదా..? అవును. దేశవ్యాప్తంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ ప్రకటించాం. ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆ ప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి.. శాస్త్రీయంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పాం. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు పొటెన్షియల్ క్రాప్ జోన్స్‌పై మండల స్థాయి వివరాలను విశ్లేషించి 71 పంటలను పరిశీలించాం. ఏయే జిల్లాల్లో సాగుకు ఏయే పంటలు అనుకూలమో సూచించాం. ప్రతి జిల్లాకు 3 నుంచి 20 అనుకూల పంటలు సూచించాం. ఈ పనికి రెండేళ్లు పట్టింది. ఈ సమాచారాన్ని మార్కెట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో జోడించి విశ్లేషించుకొని మేం సూచించిన అనుకూల పంటల జాబితాలో నుంచి ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వం, రైతులు నిర్ణయించుకోవాలి. ఈ అవగాహన రసాయనిక సేద్యంతోపాటు ప్రకృతి సేద్యం చేసే రైతులకూ ఉపయోగమేనా? సాగు పద్ధతిని బట్టి, నమూనాలు సేకరించే ఎండ, వానా కాలాలను బట్టి మారిపోయే అంశాల ఆధారంగా మేం ఈ అంచనాలకు రావటం లేదు. ఏ రైతుకైనా పొటెన్షియల్ క్రాప్ జోన్ల సమాచారం ఉపయోగకరమే. (డా. రామమూర్తి ఈ–మెయిల్: (ramamurthy20464@gmail.com ) – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
జిల్లాలోని భూముల్లో పోషకాలు తక్కువే
సాక్షి, కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా అటు నల్లరేగడి, ఎర్రనేలలు, ఇటు తువ్వనేలల భూముల్లో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ తక్కువగా ఉన్నట్లు భూసార పరీక్షల్లో వ్యవసాయాధికారులు తేల్చారు. ప్రధాన పోషక లోపాల వల్లనే దిగుబడులు తగ్గుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రధాన పో షకాలు తక్కువగా ఉండడంతో, వాటికి అదనపు శక్తినిచ్చే సూక్ష్మపోషకాల శాతం కూడా ఆయా భూముల్లో తక్కువగానే ఉంటున్నాయి. పంటలు సాగు చేసినప్పుడు ఈ పోషక లోపాల వల్ల పంట ఏపుగా పెరగకపోవడం, ఒక్కోసారి ఏపుగా పెరిగినా అందులో దిగుబడి రాకపోవడం, కేవలం పంట పశుగ్రాసంగానే ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వేయకపోవడం, ఇష్టారాజ్యంగా ఎరువులను బస్తాల కొద్దీ అవసరం లేకున్నా పంటలకు వేస్తుండడంతో పోషకాలు క్షీణించాయని అంటున్నారు. దీని వల్ల పోషకాల సమతుల్యత లోపించి పంటలు దెబ్బతినే అవకాశాలు అధికంగా ఉన్నాయని అందువల్ల పోషకాలను ఉత్తేజపరిచేలా సూక్ష్మపోషకాల ఎరువులను వేయడంతోపాటు సేంద్రీయ కర్బన శాతం పెరగడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలైన జీలుగలు, జనుములు, పిల్లి పెసర, అలసంద వంటివి పొలాల్లో చల్లుకుని అవి కనీసం ఒక మీటరు ఎత్తు పెరగ్గానే భూమిలో కలియదున్నితే మంచి సత్తువ వస్తుందని జిల్లా భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్ కొమ్మా సోమశేఖరరెడ్డి రైతులకు సూచిస్తున్నారు. ప్రధాన పోషకాల శాతం పెరగాలి... గత ఏడాది, ఈ ఏడాది నిర్వహించిన దాదాపు 75 వేల భూసార పరీక్షలు, వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే దాదాపు 67.06 శాతం మట్టి పరీక్షల ఫలితాల్లో నత్రజని తక్కువగా ఉన్నట్లు తేలింది. అటు నల్లరేగడి, ఇ టు ఎర్రనేలలు, తువ్వనేలలు ఇవే రకమైన ఫలితాలు వచ్చాయి. ఒక ఎకరంలోని మట్టిని పరీక్షించగా ఎకరాకు 102 కేజీల నత్రజని ఉన్నట్లు ఫలితాలు వచ్చా యి. 102 నుంచి 112 కేజీల వరకు వచ్చిన నత్రజని మాత్రం తక్కువగానే ఉన్నట్లు పరిగణిస్తారు. 112 కే జీలు వచ్చినా నత్రజని శాతం తక్కువనే ఉన్నట్లు చెబుతారు. 112 నుంచి 124 కేజీలు వస్తే మధ్యస్తంగా ఉన్నట్లు గుర్తిస్తారు. భాస్వరం ఎరువులు ఎకరాకు 10 కేజీల లోపు ఉంటే తక్కువగాను, 10 నుంచి 24 కేజీలు ఉంటే మధ్యస్థంగాను, అంతకన్నా అధికంగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలోకి తీసుకుంటా రు. అలాగే పొటాష్ ఎరువులు ఎకరాలో 58 కేజీలు గా ఉండడంతో లోపం ఉన్నట్లు బయటపడింది. జిల్లాలోని పంట పొలాల్లో ఈ ప్రధాన పోషకాలు తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలాయి. సూక్ష్మపోషకాల పరిస్థితి అంతే... జిల్లాలోని అధిక శాతం భూముల్లో సూక్ష్మపోషకా లు కూడా తక్కువగానే ఉన్నాయి. రైతులు సరైన ఎరువు ల యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం వల్ల సూక్ష్మపోషకాలు భూముల్లో తగ్గిపోయాయి. జింక్‌సల్ఫేట్, బోరాన్, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఐ రన్ మొదలైన సూక్ష్మపోషకాలు లోపంగా ఉంటున్నా యి. ఈ లోపాలు లేకుండా రైతులు సరైన యజమా న్య పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా వాటిని సవరించుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచించాలి. సేంద్రీయ కర్భనం పెరగాలి. జిల్లాలో గత 10–15 సంవత్సరాల కిందట రైతులు పొలాలకు ఏటా పైపాటుగా చెరువు, వంక, వాగుల్లోని మట్టిని ఎద్దుల బండ్లతో సేకరించుకుని పొలాల సమీనంలో మట్టి ఒక వరుస, మరో వరుస జిల్లేడు, తంగేడు చెట్లు, వావిలాకు, దున్నింగాకు ఇలా ఏది అందుబాటులో ఉంటే అవి వేసి మదిరలు కడట్టేవారు. ఆ మదిరలు నెలానెలన్నర రోజులు మగ్గనిచ్చిన తరువాత పొలాల్లో కుప్పలుగా పోసి చల్లేవారు. దీంతో సేంద్రియ కర్భనం అమాంతంగా పెరిగి ఆశించిన దానికంటే అధికంగా పంట దిగుబడులు వచ్చేవి. కానీ నేడు ఆ విధంగా రైతులు చేయడంలేదు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, వాటికి తోడుగా పురుగు మందులు పిచికారి చేయడం వల్ల భూసారం తగ్గిపోవడం జరిగింది. ఈ కారణంగా దిగుబడులు తగ్గి పెట్టుబడులు భారమై అప్పులు పెరిగిపోయి అల్లాడుతున్నారు. పశువుల పేడ, గొర్రె, మేక పెంటికలు, కోళ్ల పెంటతోపాటు వర్మీకంపోస్టు ఎరువును వాడితే భూసారం పెరుగుతుంది. రైతులు తప్పని సరిగా పాత రోజుల్లో మాదిరిగా ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలి. భూసార పరీక్షల ప్రకారం రసాయనిక ఎరువులు, సేంద్రీయ ఎరువులను సమపాళ్లలో వాడతారో ఆ రైతులే వ్యవసాయంలో రానిస్తారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన విధంగా ఎరువుల వాడకంలో సమతుల్యతను పాటించాలి. భూసారం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే అనుకోని విధంగా దిగుబడులు పెరుగుతాయి, నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. సేంద్రియ, రసాయన ఎరువులతో సమతుల్యత పాటించవచ్చు... సేంద్రీయ ఎరువులైన వర్మీకంపోస్టు, పశువుల, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువులు, ఇతర కంపోస్టు, వేప, కానుగ, ఆముదం వంటి వృక్ష సంబంద సేంద్రియ ఎరువులు వాడాలి. జింక్‌సల్ఫేట్, జిప్సం లాంటి ఎరువులను వాడటం వల్ల సూక్ష్మపోషకాలను పెంచవచ్చు. నత్రజని శాతం ఎక్కువగా ఉండే ఎరువులు వాడాలి. రసాయనిక, సేంద్రీయ పోషకాల వాడకంలో సమతుల్యత పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఏ పంటకైనా స్థూల పోషకాలు, సేంద్రియ పోషకాలు చాలా అవసరం. -
సేంద్రియ కర్బనమే సేద్యానికి ప్రాణం!
మన భూముల్లో సేంద్రియ కర్బనం 0.5 నుంచి 0.1%కి పడిపోయింది. భూముల్లో సేంద్రియ కర్బనం పెంపుదలతోనే వ్యవసాయానికి రక్షణ. ప్రకృతి / సేంద్రియ పద్ధతులతో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో.. ఒక పంట కాలంలోనే పెంపొందించుకునే మార్గాలెన్నో. మీరు వ్యవసాయాన్ని జీవితకాలం పాటు చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఉత్పత్తులు సాధించాలనుకుంటున్నారా? వీలయినంత వరకు ఖర్చు లేకుండానే పంటల సాగు చేయాలనే ఆలోచన ఉందా? అలా అయితే భూమాతను నమ్ముకోండి! భూమాతను నమ్ముకోవటం అంటే.. పంట భూముల్లో ప్రకృతి / సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడమేనని అంటున్నారు డాక్టర్ ఎ. నాగేశ్వరరావు. తిరుపతి వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం తిరుపతిలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. మన భూముల్లో 0.5 % కన్నా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, రసాయనిక ఎరువులకు పూర్తిగా స్వస్తి పలికి ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, స్వల్పకాలంలోనే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునేఅనేక మార్గాలున్నాయని నాగేశ్వరరావు సూచిస్తున్నారు.. చదవండి ఆయన మాటల్లోనే.. మన దేశ వ్యవసాయ చరిత్ర చాలా పురాతనమైనది. దాదాపు 9 వేల సంవత్సరాలకు ముందు నుంచే మనకు వ్యవసాయం తెలుసు. ఇన్ని వేల సంవత్సరాలు భూమాతను నమ్ముకొని పంటలు సాగు చేశారు మన పూర్వీకులు. భూసారం తగ్గకుండా చాలా పద్ధతులు అవలంభించారు. అయితే, మన రైతులు, శాస్త్రజ్ఞులు భూమాతను మరచిపోయి 50 సంవత్సరాలు దాటింది. 1966 నుంచి అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులపై, వీలుంటే నీటి పారుదల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ఈ 50 ఏళ్లలో భూసారం కాలక్రమేణా తగ్గింది. అది ప్రస్తుతం ఏ స్థాయికి చేరిందంటే అసలు భూమి పంటలు పండించే శక్తిని పూర్తిగా కోల్పోయే స్థితికి చేరింది. 95% భూముల్లో అతి తక్కువ సేంద్రియ కర్బనం మన నేలలను పరీక్షించి ఏ యే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలియజేస్తారు. ప్రభుత్వపు భూసార పరీక్షా కేంద్రాలలో ముఖ్య పోషకాల మోతాదు ఎంత ఉన్నదీ తెలుస్తుంది. సేంద్రియ కర్బనం (ఆర్గానిక్ కార్బన్) 0.5% కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉందా అనే విషయం కూడా ఈ పరీక్షలో తెలుస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కొన్ని క్షేత్రాలలో పరీక్షల ద్వారా వచ్చిన సేంద్రియ కర్బనం ఫలితాలు చాలా దిగ్భ్రాంతిని కలుగజేస్తున్నాయి. నేల న మూనాలలో 95 శాతం పైగా సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువని తేలింది. అనంతపురం జిల్లాలోని వర్షాధారపు భూముల్లో 0.1 శాతం వరకు పడిపోయినట్లు నమోదయింది. వ్యవసాయ విశ్వ విద్యాలయ క్షేత్రాలలో కూడా 0.1 నుంచి 0.5 % వరకు ఉన్నట్లు నేలల పరీక్ష ఫలితాలు నిరూపించాయి. పశువుల ఎరువులు, ఇతర సేంద్రియ ఎరువులు వాడకపోవడం, కేవలం రసాయనిక ఎరువులకే పరిమితం కావడం ఈ దుస్థితికి కారణం. తక్కువైతే రైతుకు ఇబ్బందులే... సేంద్రియ కర్బనం 0.5 % కంటే తక్కువ ఉంటే పంటల ఎదుగుదల, దిగుబడులు ఆశించినంతగా ఉండవు. అలాంటి నేలల్లో పంట దిగుబడులు పెంచాలంటే రైతులకు రసాయనిక ఎరువుల సహాయం తప్పనిసరి. రైతులు చేసే మొదటి పని నత్రజని ఎరువుల వాడకం పెంచడం. దీనివల్ల పురుగులు మరియు తెగుళ్లు అధికమవుతాయి. రసాయనిక పురుగు మందుల వాడకం తప్పదు. వీటి కల్తీ పెరుగుతున్నది. రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణదారుల సలహాల మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. మోసాలు ఎక్కువై సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వాతావరణ వ్యత్యాసాల వల్ల పంట దిగుబడులు ఆశించినంతగా ఉండటం లేదు. ఉన్నా గిట్టుబాటు ధరలు లేక నష్టాలే మిగులుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుకుంటే గట్టెక్కవచ్చు. 2.0% కంటే ఎక్కువ ఉంటే నిశ్చింత.. రైతుల పంట దిగుబడులు ఆశించినంతగా లేకపోయినా బాగానే ఉంటాయి. పంట మొక్కల పటుత్వం, ధృఢత్వం పెరుగుతుంది. వర్షాలు, గాలులు ఎక్కువయినా కొన్ని పంటలు పడిపోకుండా తట్టుకోగలవు. ఈ పైర్లలో రసాయనిక ఎరువులతో పెరిగిన మొక్కల కున్న మృదుత్వం ఉండదు. కొన్ని రకాల కీటకాలు (పిండి పురుగు) తెగుళ్లు (ఆకుమచ్చ) ఆశించవు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా కొంత దిగుబడులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి నేలలోని పైరును కీటకాలు తెగుళ్ల బారి నుంచి రక్షించడం తేలిక. జీవామృతం పిచికారీతో కూడా వాటిని నివారించవచ్చు. అన్ని ప్రాంతాల్లో దొరికే ఆకులతో (కీటక నివారిణి) తయారు చేసిన ద్రావణంతో చీడపీడలను నివారించవచ్చు. అంటే పంటల దిగుబడికయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలరు. ఇలాంటి నేలల్లో వ్యవసాయం తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ఆస్కారమే ఉండదు. సేంద్రియ కర్బనం 2.0% గానీ లేదా అంతకు మించి గానీ పెంచగలిగిన నేలలో పంటలను సాగుచేస్తే.. ఆ ఆనందం ఏమిటో మీకే స్వయంగా అనుభవంలోకి వస్తుంది. మన నేలల్లో 0.5%కు మించి పెంచలేమా? ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఐరోపా దేశాల భూముల్లో సేంద్రియ కర్బనం 2.0 నుంచి 8.0% వరకు ఉంటుంది. మన దేశం వేడి ప్రాంతంలో ఉంది. అధికంగా ఉష్ణోగ్రతలుండే మన భూముల్లో సేంద్రియ పదార్థం త్వరగా అంతరించిపోతుంది. కాబట్టి సేంద్రియ కర్బనం పెరుగుదల చాలా కష్టమైన ప్రక్రియగా మారింది. మన నేలల్లో 0.5%కు మించి పెంచడం కష్టసాధ్యమని శాస్త్రజ్ఞులంటారు. అయితే, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులు కొందరు సేంద్రియ కర్బనాన్ని ఈ అంచనాలకు మించి పెంచుకోగలుగుతున్నారు. తక్కువ ఖర్చుతో.. తక్కువ కాలంలోనే.. నేలల్లో సేంద్రియ కర్బనాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలోనే పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ కింది పద్ధతులలో ఒకటిని గానీ, కొన్నిటిని గానీ.. రైతులు తమకున్న వనరులు, ఖర్చును మనసులో ఉంచుకొని ఆచరించవచ్చు. 1. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం వాడకం వల్ల ఒక పంట కాలంలో 0.5% వరకు సేంద్రియ కర్బనం పెంచవచ్చు. 2. పచ్చిరొట్ట పంటలు సాగు చేసి 40 రోజులు పంట ఎదిగిన తర్వాత భూమిలో దున్నాలి. దీనివల్ల కూడా కర్బనం 0.5% వరకు పెరుగుతుంది. 3. దబోల్కర్ పద్ధతిలో 25 రకాల ధాన్యాలను ఒక్కొక్కటి ఒక కిలో చొప్పున ఒక ఎకరంలో విత్తి 40 రోజుల తరువాత భూమిలో దున్నితే సేంద్రియ కర్బనం 0.5% కు పైగా పెరుగుతుంది. 4. పత్తిపాటి రామయ్య గారి ‘రామబాణం’ పద్ధతిలో కూడా ఒకే పంటకాలంలో 0.5% కు పైగానే పెంచవచ్చు. 5. పై పద్ధతులలో ఏవైనా రెంటిని ఒక దాని తరువాత మరొకటి అనుసరిస్తే.. సేంద్రియ కర్బనం 1.0%కు పైగా పెంపొందించుకునే అవకాశాలున్నాయి. 6. ఇలా చేస్తే రెండు సంవత్సరాలలో 2.0%కు ఆపైన కూడా పెంచవచ్చు. 7. 2.0%కు చేరిన తరువాత ప్రతి సంవత్సరం మొదట చెప్పిన పద్ధతులలో ఏ ఒక్కదాన్ని కొనసాగించినా 2.0%కు తగ్గకుండా ఉంచుకోవచ్చు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ ఇద్దరు రైతుల గురించి ప్రస్తావించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరలో ఉండే గద్దె సతీష్ (99125 11244) గారి పొలంలో సేంద్రియ కర్బనం 2.0%కు తగ్గకుండా ఉంటుంది. పంటకు పంటకు మధ్య కాలంలో పశువులను పొలంలో మందకడుతున్నారు. వారు దశాబ్దాలకు పైగా ఇలాగే చేస్తున్నారు. కర్నూలు జిల్లా వాసి కృష్ణ (81848 46488) గారు ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట పంటలు వేసి నేలలో కలియదున్నుతుంటారు. జీవామృతం వాడుతూ తమ భూముల్లో సేంద్రియ కర్బనం 2.0కు దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో గత పది సంవత్సరాలకన్నా ముందే రసాయనిక ఎరువుల వాడకం మానేశారు. ప్రతి సంవత్సరం పశువుల ఎరువు వేస్తారు. పశువులను పొలంలో మందకడుతున్నారు. అక్కడి నేల నమూనాలు సేకరించి పరీక్షలు జరిపితే.. సేంద్రియ కర్బనం 1.2 నుంచి 2.6% వరకు ఉందని తేలింది. వ్యవసాయం కుటుంబ వ్యాపకంగా ఉన్న రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 1.5 నుంచి 2.0%కు తప్పకుండా పెంచడం చాలా అవసరం. పైన పేర్కొన్న పద్ధతులలో ఒక దానిని క్రమం తప్పకుండా ఆచరణలో పెడితే మీ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. (డా. ఎ. నాగేశ్వరరావును 0877–2249288, 70957 00479, 94412 54555 నంబర్లలో సంప్రదించవచ్చు)