సాక్షి, కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా అటు నల్లరేగడి, ఎర్రనేలలు, ఇటు తువ్వనేలల భూముల్లో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ తక్కువగా ఉన్నట్లు భూసార పరీక్షల్లో వ్యవసాయాధికారులు తేల్చారు. ప్రధాన పోషక లోపాల వల్లనే దిగుబడులు తగ్గుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రధాన పో షకాలు తక్కువగా ఉండడంతో, వాటికి అదనపు శక్తినిచ్చే సూక్ష్మపోషకాల శాతం కూడా ఆయా భూముల్లో తక్కువగానే ఉంటున్నాయి. పంటలు సాగు చేసినప్పుడు ఈ పోషక లోపాల వల్ల పంట ఏపుగా పెరగకపోవడం, ఒక్కోసారి ఏపుగా పెరిగినా అందులో దిగుబడి రాకపోవడం, కేవలం పంట పశుగ్రాసంగానే ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వేయకపోవడం, ఇష్టారాజ్యంగా ఎరువులను బస్తాల కొద్దీ అవసరం లేకున్నా పంటలకు వేస్తుండడంతో పోషకాలు క్షీణించాయని అంటున్నారు. దీని వల్ల పోషకాల సమతుల్యత లోపించి పంటలు దెబ్బతినే అవకాశాలు అధికంగా ఉన్నాయని అందువల్ల పోషకాలను ఉత్తేజపరిచేలా సూక్ష్మపోషకాల ఎరువులను వేయడంతోపాటు సేంద్రీయ కర్బన శాతం పెరగడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలైన జీలుగలు, జనుములు, పిల్లి పెసర, అలసంద వంటివి పొలాల్లో చల్లుకుని అవి కనీసం ఒక మీటరు ఎత్తు పెరగ్గానే భూమిలో కలియదున్నితే మంచి సత్తువ వస్తుందని జిల్లా భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్ కొమ్మా సోమశేఖరరెడ్డి రైతులకు సూచిస్తున్నారు.
ప్రధాన పోషకాల శాతం పెరగాలి...
గత ఏడాది, ఈ ఏడాది నిర్వహించిన దాదాపు 75 వేల భూసార పరీక్షలు, వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే దాదాపు 67.06 శాతం మట్టి పరీక్షల ఫలితాల్లో నత్రజని తక్కువగా ఉన్నట్లు తేలింది. అటు నల్లరేగడి, ఇ టు ఎర్రనేలలు, తువ్వనేలలు ఇవే రకమైన ఫలితాలు వచ్చాయి. ఒక ఎకరంలోని మట్టిని పరీక్షించగా ఎకరాకు 102 కేజీల నత్రజని ఉన్నట్లు ఫలితాలు వచ్చా యి. 102 నుంచి 112 కేజీల వరకు వచ్చిన నత్రజని మాత్రం తక్కువగానే ఉన్నట్లు పరిగణిస్తారు. 112 కే జీలు వచ్చినా నత్రజని శాతం తక్కువనే ఉన్నట్లు చెబుతారు. 112 నుంచి 124 కేజీలు వస్తే మధ్యస్తంగా ఉన్నట్లు గుర్తిస్తారు. భాస్వరం ఎరువులు ఎకరాకు 10 కేజీల లోపు ఉంటే తక్కువగాను, 10 నుంచి 24 కేజీలు ఉంటే మధ్యస్థంగాను, అంతకన్నా అధికంగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలోకి తీసుకుంటా రు. అలాగే పొటాష్ ఎరువులు ఎకరాలో 58 కేజీలు గా ఉండడంతో లోపం ఉన్నట్లు బయటపడింది. జిల్లాలోని పంట పొలాల్లో ఈ ప్రధాన పోషకాలు తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలాయి.
సూక్ష్మపోషకాల పరిస్థితి అంతే...
జిల్లాలోని అధిక శాతం భూముల్లో సూక్ష్మపోషకా లు కూడా తక్కువగానే ఉన్నాయి. రైతులు సరైన ఎరువు ల యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం వల్ల సూక్ష్మపోషకాలు భూముల్లో తగ్గిపోయాయి. జింక్‌సల్ఫేట్, బోరాన్, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఐ రన్ మొదలైన సూక్ష్మపోషకాలు లోపంగా ఉంటున్నా యి. ఈ లోపాలు లేకుండా రైతులు సరైన యజమా న్య పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా వాటిని సవరించుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచించాలి.
సేంద్రీయ కర్భనం పెరగాలి.
జిల్లాలో గత 10–15 సంవత్సరాల కిందట రైతులు పొలాలకు ఏటా పైపాటుగా చెరువు, వంక, వాగుల్లోని మట్టిని ఎద్దుల బండ్లతో సేకరించుకుని పొలాల సమీనంలో మట్టి ఒక వరుస, మరో వరుస జిల్లేడు, తంగేడు చెట్లు, వావిలాకు, దున్నింగాకు ఇలా ఏది అందుబాటులో ఉంటే అవి వేసి మదిరలు కడట్టేవారు. ఆ మదిరలు నెలానెలన్నర రోజులు మగ్గనిచ్చిన తరువాత పొలాల్లో కుప్పలుగా పోసి చల్లేవారు. దీంతో సేంద్రియ కర్భనం అమాంతంగా పెరిగి ఆశించిన దానికంటే అధికంగా పంట దిగుబడులు వచ్చేవి. కానీ నేడు ఆ విధంగా రైతులు చేయడంలేదు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, వాటికి తోడుగా పురుగు మందులు పిచికారి చేయడం వల్ల భూసారం తగ్గిపోవడం జరిగింది.
ఈ కారణంగా దిగుబడులు తగ్గి పెట్టుబడులు భారమై అప్పులు పెరిగిపోయి అల్లాడుతున్నారు. పశువుల పేడ, గొర్రె, మేక పెంటికలు, కోళ్ల పెంటతోపాటు వర్మీకంపోస్టు ఎరువును వాడితే భూసారం పెరుగుతుంది. రైతులు తప్పని సరిగా పాత రోజుల్లో మాదిరిగా ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలి. భూసార పరీక్షల ప్రకారం రసాయనిక ఎరువులు, సేంద్రీయ ఎరువులను సమపాళ్లలో వాడతారో ఆ రైతులే వ్యవసాయంలో రానిస్తారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన విధంగా ఎరువుల వాడకంలో సమతుల్యతను పాటించాలి. భూసారం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే అనుకోని విధంగా దిగుబడులు పెరుగుతాయి, నాలుగు రూపాయలు కళ్లజూస్తారు.
సేంద్రియ, రసాయన ఎరువులతో సమతుల్యత పాటించవచ్చు...
సేంద్రీయ ఎరువులైన వర్మీకంపోస్టు, పశువుల, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువులు, ఇతర కంపోస్టు, వేప, కానుగ, ఆముదం వంటి వృక్ష సంబంద సేంద్రియ ఎరువులు వాడాలి. జింక్‌సల్ఫేట్, జిప్సం లాంటి ఎరువులను వాడటం వల్ల సూక్ష్మపోషకాలను పెంచవచ్చు. నత్రజని శాతం ఎక్కువగా ఉండే ఎరువులు వాడాలి. రసాయనిక, సేంద్రీయ పోషకాల వాడకంలో సమతుల్యత పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఏ పంటకైనా స్థూల పోషకాలు, సేంద్రియ పోషకాలు చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment