నీళ్లల్లో నిప్పు! | Editorial on water projects | Sakshi
Sakshi News home page

నీళ్లల్లో నిప్పు!

Published Sat, Sep 10 2016 12:23 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

నీళ్లతోపాటు నిత్యం విద్వేషాలు కూడా ప్రవహించే కావేరి నది మరోసారి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్య నిప్పు రాజేసింది. ఎప్పటిలా ఈ వివాదంలో సుప్రీం కోర్టు జోక్యం తప్పలేదు.

నీళ్లతోపాటు నిత్యం విద్వేషాలు కూడా ప్రవహించే కావేరి నది మరోసారి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్య నిప్పు రాజేసింది. ఎప్పటిలా ఈ వివాదంలో సుప్రీం కోర్టు జోక్యం తప్పలేదు. పదిరోజులపాటు రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని అది ఆదేశాలిచ్చింది. వాటిని నిరసిస్తూ కావేరి పరీవాహ ప్రాంతమైన మాండ్యా జిల్లాలో వెనువెంటనే జనం రోడ్లపై కొచ్చారు. బంద్ పాటించారు. శుక్రవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బంద్ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు తమకనుకూలంగా లేకపోతే తమిళనాడులో ఈ స్థితి చోటుచేసుకునేది. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలుగానీ... మధ్య వర్తిత్వం వహించి సరిదిద్దాల్సిన కేంద్రంగానీ... నీటి పంపకం బాధ్యతలు చూడా ల్సిన కావేరి ట్రిబ్యునల్‌గానీ... దాని నేతృత్వంలో, అది ఇచ్చే ఆదేశాలతో పనిచేయా ల్సిన కావేరి యాజమాన్య బోర్డు, కావేరి జల క్రమబద్ధీకరణ కమిటీలుగానీ ఎవరి పని వారు సక్రమంగా చేయకపోవడంతో ఈ సమస్య జటిలమవుతున్నది.

ప్రధాని అధ్యక్షతన ఉండే కావేరి రివర్ అథారిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అది ఒకటి రెండుసార్లు మినహా సమావేశం కాలేదు. వివాదాలు తలె త్తినప్పుడు చురుగ్గా కదలకుండా సాచివేత ధోరణి అవలంబిస్తే అవి ఏ స్థాయికి చేరగలవో కావేరి వివాదం రుజువు చేస్తున్నది. ఈ గొడవకు శాశ్వత ముగింపు పలకాలని భావించిన సుప్రీంకోర్టు కావేరి నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 1990లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాతే అప్పటి వి.పి. సింగ్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏడాది గడిచాక ఆ ట్రిబ్యునల్ మధ్యంతర ఆదేశాలిస్తే వాటిపై కర్ణాటక రాష్ట్రం నెలరోజులు అట్టుడికిపోయింది. బెంగళూరు సహా అనేకచోట్ల తమిళులపై దాడులు జరిగాయి. అనేకులు ప్రాణభయంతో స్వరాష్ట్రానికి పరుగులు తీశారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా తమిళనాట కూడా ఆందోళనలు చెలరేగాయి. 2007లో కావేరి ట్రిబ్యునల్ తుది అవార్డు ప్రకటించింది. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలో చెప్పింది. కేరళ, పుదుచ్చేరిలకు దీంతో పెద్ద పేచీ ఏమీ లేదు. వివాదమంతా ఎప్పుడూ కర్ణాటక, తమిళనాడుల మధ్యే నడుస్తుంది. వర్షాలు సక్రమంగా పడినంత కాలమూ సమస్య ఉండదు.

పుష్కలంగా నీరున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని క్యూసెక్కుల నీరు తీసుకోవాలన్న విషయంలో లెక్కలు స్పష్టంగానే ఉంటాయి. ఎవరూ నిరసన గళం వినిపించరు. కానీ వానలు లేనప్పుడు ఎంత పంచుకోవాలో ఇంతవరకూ చెప్పింది లేదు. రైతుల్ని మానసికంగా సిద్ధం చేసింది లేదు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలూ రైతుల ప్రయోజనాలను పరిరక్షణ కోసం తాము ఎంతగా పాటు పడుతున్నదీ, పాలకపక్షాలు ఎలా ద్రోహం చేస్తున్నదీ ఏకరువు పెడతాయి. సమ స్యంతా అక్కడే వస్తుంది. ఈసారి కూడా అనుకున్నట్టుగా వర్షాలు లేకపోవడంవల్ల రిజర్వాయర్లన్నీ అడుగంటాయి. తమిళనాడులో సాంబ మసూరి కాపాడుకోవాలని రైతులు ఆత్రుత ప్రదర్శించినట్టే కర్ణాటక రైతులు తమ పంటలెక్కడ దెబ్బతింటా యోనని ఆందోళన పడుతున్నారు. అందువల్లే మరోసారి ఉద్రిక్తతలు మొదల య్యాయి.

వాహనదారులకు నిత్యం నరకాన్ని చూపే బెంగళూరు రోడ్లు శుక్రవారం బంద్ వల్ల జన సంచారం కరువై చిన్నబోయాయి. తమ రాష్ట్రానికే సాగునీరు, తాగునీరు లేని స్థితిలో తమిళనాడుకు నీళ్లెలా ఇస్తామని రైతు సంఘాలు ప్రశ్నిస్తు న్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై ఏం చేద్దామో చెప్పండంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశం పెట్టారు. మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించాక చివరకు ఆ ఆదేశాలను శిరసావహించాలని నిర్ణయించారు. వాటిని సవరించమంటూ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్టు ప్రకటిం చారు. బంద్‌ను వ్యతిరేకించడం లేదని ప్రకటించడం ద్వారా సిద్ధరామయ్య దానికి మద్దతునిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.

 
ఇది కావేరికి పరిమితమైన సమస్యో... తమిళనాడు, కర్ణాటకల మధ్య మాత్రమే తలెత్తిన వివాదమో అని సరిపెట్టుకోవడానికి లేదు. ఇలాంటివి దేశంలో చాలా ఉన్నాయి. గోదావరి, కృష్ణా, నర్మద, రావి-బియాస్, వంశధార, మహాదాయి నదీ జలాల విషయంలో కూడా వివాదాలు పుష్కలంగా ఉన్నాయి.  ముల్లపెరియార్, బాబ్లీ డ్యాంల వివాదాలు వీటికి అదనం. ముఖాముఖి చర్చలతో, పరస్పర ఒప్పం దాలతో, సంయుక్తంగా ఆనకట్టల నిర్మించడంద్వారా కొన్ని రాష్ట్రాలు జల వివా దాలు రాకుండా జాగ్రత్త పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నదీ జలాలపై దేశంలో ఇంతవరకూ 144 అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదిరాయని గణాంకాలు చెబు తున్నాయి. రాష్ట్రాలమధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో నిర్దేశించేందుకు 1956లో వచ్చిన అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం ఉంది. అయితే దిగువనున్న రాష్ట్రా లెదుర్కొనే ఇబ్బందుల ప్రాతిపదికగానే జల వివాదాల సమస్యను చూడాలన్న వైఖరి, ఆలోచన కరువవుతున్నది.

భారీ వర్షాలొచ్చి నదులకు వరదలొచ్చినప్పుడు ఎనలేని నష్టాన్ని చవిచూడక తప్పని స్థితిలో ఉండే దిగువ రాష్ట్రాలకు... వానల్లేక దిగులు పడే సందర్భాల్లో బాసటగా నిలవాలన్న ఆలోచన ఎగువ రాష్ట్రాలకు ఉండటం లేదు.  కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రాజకీయ కోణంలో ఆలోచి స్తుండటం, తమ పార్టీ ఏ రాష్ట్రంలో బలంగా ఉంటే ఆ రాష్ట్రానికి అనుగుణంగా వ్యవహరించడం లేదా మౌనంగా ఉండిపోవడం రివాజుగా మారింది. రానున్న కాలంలో దేశాలమధ్య ప్రధానంగా నదీ జలాల కోసమే యుద్ధాలు జరుగుతాయని ఒక నిపుణుడు చెప్పాడు. అది రాష్ట్రాల విషయంలో కూడా నూటికి నూరుపాళ్లూ నిజం. పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదు. ఒక నిర్దిష్టమైన విధాన రూపకల్పనకు పూనుకోవడం లేదు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తదితరాలమధ్య సమన్వయం సాధించే దిశగా కదలడం లేదు. ఎన్నో సమస్యలతో ముడిపడి ఉండే నదుల అనుసంధానం చుట్టూ మాత్రమే ఆలోచిస్తున్నారు. నీటి కోసం శివాలెత్తే మంది చేతుల్లో ప్రభుత్వాలు బందీలైతే మిగిలేది అరాచకమే. అందుకే పాలకులు మేల్కొనాలి. శాశ్వత పరిష్కారానికి నడుం బిగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement