ప్రమాద ఘంటికలు
అమెరికాలోని తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను ఉప్పెన ముంచెత్తి రెండురోజులపాటు గడగడలాడించిన తీరు పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్త ధోరణితో ఉంటున్నవారందరికీ హెచ్చరికలాంటిది. అభివృద్ధి చెందిన దేశం కావడం వల్ల, మౌలిక సదుపాయాల కొరత లేకపోవడం వల్ల, అత్యాధునిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నందువల్ల ప్రాణ నష్టం కనిష్ట స్థాయిలో ఉంది. కానీ దాని ధాటికి జరిగిన ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. ఆ రాష్ట్రంలోని వివిధ నగరాలు దాదాపు 37 గంటలు కకావికలమయ్యాయి. వందల ఇళ్లు, చెట్లు నేలకూలాయి. భారీ భవంతులు సైతం దెబ్బతిన్నాయి. ఆదివారమంతా అల్లాడించిన ఇర్మా సోమ వారం తీవ్రత తగ్గించుకుని పెను తుఫానుగా మారింది. ఇర్మా దెబ్బకు ఫ్లోరిడా మాత్రమే కాదు... అరుబా, క్యూరేసొ, క్యూబా వంటి కరీబియన్ దీవులు సైతం తీవ్రంగా నష్టపోయాయి. రెండు వారాల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని హార్వీ ఉప్పెన కాటేసింది. ఈ స్థాయి ఉప్పెన ఫ్లోరిడాలో 12 ఏళ్ల క్రితం, టెక్సాస్ రాష్ట్రంలో 13 ఏళ్లక్రితం వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో మరో పెను ఉప్పెన న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లను తాకబోతున్నదని వారంటున్నారు.
ఈ ఏడాది ఇంతవరకూ అమెరికాలో 9 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఒక్కొక్కటి వందకోట్ల డాలర్ల (సుమారు రూ. 6,400 కోట్లు) చొప్పున నష్టాన్ని మిగిల్చింది. గత నెలలో మన దేశంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్‌లను కుంభవృష్టి ముంచెత్తి వరదలొచ్చి కోటీ 70 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. మంచినీరు, ఆహారం, ఆవాసం దొరక్క జనం ఇబ్బందులపాలయ్యారు. వరదల ముప్పు నుంచి బయటపడినవారిలో కొందరు పాము కాట్లతో మరణించారు. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ప్రకృతి ఎందుకిలా కన్నెర్రజేస్తున్నదో... అకాల వర్షాలు, వరదలు, పెను తుఫానులు, వరస కరువు కాటకాలు జనం ప్రాణాలతో, వారి బతులతో ఎందుకు చెలగాటమాడుతున్నాయో తెలియనిదేమీ కాదు. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా ధ్వంసం చేయడం, పారిశ్రామిక ప్రగతి పేరిట అత్యంత ప్రమాదకరమైన కర్బన ఉద్గారాలను ఎడాపెడా విడిచి పెట్టడం భూ వాతావరణాన్ని కాలుష్యం బారిన పడేయడం కారణంగా ఉష్ణోగ్రతలు అధికమై ఈ వైపరీత్యాలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ కర్బన ఉద్గారాలు ఒకసారి వాతావరణంలోకి ప్రవేశిస్తే కనీసం వందేళ్లపాటు నష్టాన్ని కొనసాగిస్తూనే ఉంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జల, వాయు కాలుష్యం కార ణంగా మనుషులు సాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహార సంక్షోభ ప్రమాదం అంతకంతకు పెరుగుతోంది. ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే పెను ఉప్పెనలు పది రెట్లు అధికంగా పెరుగుతాయని నీల్స్ బోర్ ఇనిస్టిట్యూట్ నాలుగేళ్లక్రితం ఒక నివేదికలో హెచ్చరించింది. యేల్ స్కూల్, మసాచూసెట్స్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సంయుక్తంగా చేసిన అధ్యయనం సైతం పర్యా వరణ మార్పులవల్ల సంభవించగల తుఫానులన్నీ ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, కరీబియన్ దీవులు, దక్షిణాసియా దేశాల చుట్టూ కేంద్రీకృతమవుతాయని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటినుంచీ పర్యావరణ ప్రమాదం అనేదే బూటకమని ఎద్దేవా చేస్తున్నారు. పారిస్‌లో రెండేళ్లక్రితం ప్రపంచ దేశాల మధ్య కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి బయటికొస్తున్నట్టు ఈమధ్యే ఆయన ప్రకటించారు. ట్రంప్ వచ్చాక అమెరికాలో మితవాద భావజాలం వెర్రితలలు వేస్తున్న సంగతి కొత్తేమీ కాదు. ఇర్మా విరుచుకుపడుతున్న తరుణంలో కూడా ఈ పోకడ కనబడింది. ఇర్మా వల్ల జరగబోయే నష్టాన్ని పర్యావరణవాదులు భూత ద్దంలో చూపుతున్నారని... ఆ మాటున వాతావరణానికి కీడు ఏర్పడుతుందని నమ్మించి కోట్లాది డాలర్లు దిగమింగడమే వారి ఆంతర్యమని మితవాదం నూరి పోసే ఒక రేడియో చానెల్ యాంకర్ ఆరోపించాడు. తీరా అది తీరాన్ని తాకబోతుం డగా అక్కడినుంచి పలాయనం చిత్తగించాడు. ట్రంప్ అధికారంలోకొచ్చాక జాతీయ వాతావరణ సంస్థ, జాతీయ సముద్ర, వాతావరణ అధ్యయన సంస్థ వంటివాటికి బడ్జెట్ కేటాయింపులను దాదాపు 15 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సంస్థలు సేకరిస్తున్న నమూనాలు, వాటిని విశ్లేషించడానికి ఉపయోగిస్తున్న ఉపకరణాల వల్ల సముద్రాల్లో ఏర్పడే తుఫానులను గుర్తించడం, వాటి తీవ్రతలోని హెచ్చుతగ్గుల్ని, వాటి కదలికల్ని అంచనా వేయడం సాధ్యమవుతోంది. వాతావరణ సంస్థలు వైప రీత్యాల్ని సరిగ్గా అంచనా వేయగలిగితే పౌరుల్లో ఆ సంస్థలపై విశ్వాసం ఏర్పడు తుంది. వాటి హెచ్చరికలకు అనుగుణంగా నడుచుకుంటారు. అప్పుడు సహాయ చర్య అమలు తేలికవుతుంది. ట్రంప్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం దీన్నం తటినీ జటిలం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ సంస్థపై కూడా ట్రంప్ శీతకన్ను పడింది. వాతావరణ మార్పులకూ, వైపరీత్యాలకు మధ్యగల సంబంధంపై అధ్య యనం చేయడంతోపాటు రసాయన పరిశ్రమలవల్ల కలిగే ఉత్పాతాల గురించి సవివరమైన నివేదిక రూపొందించిన ఆ సంస్థ నిధుల్లో ఇకపై మూడోవంతు కోత విధించబోతున్నట్టు ఆయన ఇటీవలే ప్రకటించాడు.
అమెరికా తీర ప్రాంతాల్లో ఉన్న 90 నగరాలు తరచు వరద బీభత్సాన్ని చవిచూస్తున్నాయి. రాగల రెండు దశాబ్దాల్లో వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచ నాలున్నాయి. హార్వీ, ఇర్మా ఉప్పెనల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడాల్లోని సైనిక, నావికాదళ, వైమానిక దళ కార్యాలయాలను మూసేసి, అక్కడి వేలాదిమంది సిబ్బందిని తరలించాల్సివచ్చింది. ఈ ముప్పే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు కూడా పొంచి ఉంది. పర్యావరణంపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించి, అమలు చేయకపోతే అమెరికా సరే... ప్రపంచదేశాలను కూడా ప్రమాదం అంచుకు నెట్టినట్టవుతుందని ట్రంప్ గుర్తించడం తక్షణావసరం. హార్వీ, ఇర్మా మోసుకొచ్చిన హెచ్చరికలివి.