ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు విచక్షణ మరిచి దేవుడి పేరు చెప్పుకుని తిరిగేవారితో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్‌లోని మథుర ఉదంతం నిరూపించింది. ఆ నగరంలో అక్రమ కట్టడాల్ని కూలుస్తుండగా గురువారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక ఎస్‌పీ, ఎస్‌ఐ సహా 24మంది మరణించారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. కబ్జాదారులు చెట్లెక్కి గురిచూసి పోలీసులను కాల్చారు.
ఎస్‌పీ, ఎస్‌ఐల తలలోనుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. నచ్చిన మతాన్ని ఎంచుకోవడానికి, ఆ మతంలో విశ్వాసం కలిగి ఉండటానికి, ఆ విశ్వాసాన్ని ప్రచారం చేసుకోవడానికి మన రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. అయితే ఎవరు చిత్తశుద్ధితో, నిజాయితీతో ఆథ్యాత్మికతను ప్రబోధిస్తున్నారో... జ్ఞాన మార్గాన్ని, భక్తిమార్గాన్ని చాటి చెబుతున్నారో గ్రహించగలగడం అన్నది వ్యక్తుల వివేకం, వివేచన నిర్ణయిస్తాయి. ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు విచక్షణ మరిచి స్వాములతో, బాబాలతో ప్రమేయం పెట్టుకోవడం మొదలుపెడితే అలాంటి వివేకమూ, వివేచనా వ్యక్తుల్లో అదృశ్య మవుతాయి. వాటి స్థానంలో మూఢ విశ్వాసాలు వచ్చి చేరతాయి. ఫలానా స్వామి చెబుతున్నదేమిటి... చేస్తున్నదేమిటన్న స్పృహ లోపిస్తుంది. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. ఏడాదిన్నర క్రితం హర్యానాలో హైకోర్టు ఆదేశంతో ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్‌ను పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు వారిపై భక్తుల ముసుగులో ఉన్నవారు యాసిడ్ సీసాలతో, రాళ్లతో దాడి చేయడం... చివరకు కాల్పులకు తెగబడటం అందరికీ తెలుసు. ఈ గొడవలో వందలాదిమంది గాయపడ్డారు.
మథురలో బాబా జై గుర్‌దేవ్ అనుచరులుగా చెప్పుకుంటున్నవారు ఆశ్రమంలో ఏకే47లు, బాంబులు, పిస్టల్స్ పోగేశారంటే, వాటిని పోలీసులపై ప్రయోగించారంటే స్థానికులెవరూ ఆశ్చర్యపోవడం లేదు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు వారికి ఎరుకే. తెలియనట్టు నటిస్తున్నది ప్రభుత్వ యంత్రాంగమే. వందలాది ఎకరాలు కబ్జా చేయడం, వేలాది కోట్ల రూపాయలు పోగేయడం కళ్లముందు కనిపిస్తున్నా అధికారులు ఏనాడూ నోరెత్తలేదు. బాబా జై గురుదేవ్ 2012లో మరణించాక ఈ స్థిరచరాస్తులన్నీ దాదాపుగా పంకజ్‌యాదవ్ అనే వ్యక్తి చేతికొచ్చాయి. తానే నిజమైన వారసుడినంటూ రాంవృక్ష యాదవ్ అనే మరో వ్యక్తి పనిచేస్తున్నాడు.
ఇలా పరస్పరం కలహించుకుంటున్న రెండు వర్గాలకూ సమాజ్ వాదీ పార్టీలోని వేర్వేరు వర్గాల అండదండలున్నాయి. ఒక వర్గానికి అదనంగా బీజేపీ ఆశీస్సులూ ఉన్నాయి. అందువల్లే మారణాయుధాలు తెస్తున్నా, బాంబులు పోగేసుకుంటున్నా, భూములు కబ్జా పెడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం కళ్లుమూసుకుంది. మథుర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమి ఆశ్రమం చెరలో ఉన్నదని యూపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ భూమిలో అక్రమ తవ్వకాలు సాగిస్తూ విలువైన పురాతన విగ్రహాలను దొంగిలిస్తున్నారని పురావస్తు శాఖ ఆరోపించింది. ఇవేవీ ప్రభుత్వ యంత్రాంగానికి పట్టలేదు. కబ్జాలో ఉన్న భూమిలో కట్టడాలను కూల్చి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఏడాదిన్నరక్రితం తీర్పునిచ్చినా నోటీసు లతో సరిపెట్టడం తప్ప దాన్ని అమలు పరిచే దిక్కులేదు. కోర్టు ధిక్కార నేరం మీద పడక తప్పదన్న భయంతో ఎట్టకేలకు కదిలితే చివరకు ఇద్దరు అధికారులను పోలీసు యంత్రాంగం కోల్పోవాల్సివచ్చింది.
మథురలోని ఆశ్రమం మాఫియాలకు నిలయమైందని, అక్కడ సాయుధ బెటాలియన్లు ఏర్పాటు చేసుకున్నారని సోదాల్లో బయటపడిందని పోలీసు యంత్రాంగం చెబుతోంది. తమకు ప్రతిచోటా చెక్‌పోస్టులుండగా, నిఘా వ్యవస్థ నిరంతరం పనిచేస్తుండగా ఇదంతా ఎలా సాధ్యమైందన్న ఆలోచన ఇప్పటికైనా పోలీసులకు వచ్చిందో, లేదో తెలియదు. యూపీ అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి గనుక వివిధ రాజకీయ పక్షాలు ఈ పరిస్థితికి కారకులు మీరంటే మీరని నిందించుకుంటున్నాయి. తమ పాపాల్ని కప్పెట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ ఆశ్రమానికి ఆద్యుడైన జై గురుదేవ్‌ను 1975లో ఎమర్జెన్సీ విధించాక అరెస్టు చేశారు. అయితే అధికారం కోల్పోయాక ఇందిరాగాంధీ ఆ ఆశ్రమానికి వెళ్లి తనను క్షమించాలని వేడుకున్నారంటే జై గురుదేవ్ ఎంతటి శక్తిమంతుడో అర్ధమవుతుంది.
అనంతరకాలంలో దూరదర్శి పార్టీ నెలకొల్పి శాకాహారులనే అభ్యర్థులుగా నిలబెడతానని ఆయన ప్రకటించాడు. అదే గీటు రాయిగా టిక్కెట్లు పంపిణీ చేశాడు. వరస ఓటములతో దెబ్బతిన్నాక రాజకీయం తన ఒంటికి పడదని బాబా జై గురుదేవ్ గ్రహించాడు. ఆ తర్వాత ఆథ్యాత్మిక ప్రవచనాలకే పరిమితమయ్యాడు. ఆయన ఉండగా గానీ, మరణించాక గానీ ఆ ఆశ్రమంలో జరుగుతున్నదేమిటో ఆరా తీయాలన్న జ్ఞానం ప్రభుత్వాలకు లేక పోయింది. అక్కడ చేరిన మాఫియాను అదుపు చేయాలన్న కనీస స్పృహ కరువైంది. హర్యానాలో రాంపాల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఒక హత్య కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన రాంపాల్ కేసు విచారణకు గైర్హాజరవుతున్నా, న్యాయస్థానం అరెస్టు వారెంట్లు జారీ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఆరేళ్ల తర్వాత ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకగానీ అతని అరెస్టు సాధ్యం కాలేదు. రాంపాల్ జాట్ కులస్తుడు కాబట్టే ఆయనపై చర్య తీసుకోలేదని అప్పట్లో ఆర్య సమాజ్ కార్యకర్తలు ఆరోపించారు.
ఇప్పుడు జై గురుదేవ్ అనుచరులు సీఎం అఖిలేశ్ యాదవ్‌కు చెందిన కులానికి చెందినవారు కావడం వల్లనే వారిని చూసీచూడనట్టు వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాజంలో ఆథ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో నిష్కామ కర్మగా భావించి ప్రజలకు ఉపయోగపడుతున్నవారున్నట్టే నకిలీ స్వాములు, బాబాలు కూడా అక్కడక్కడ పుట్టుకొస్తున్నారు. సంపదను పోగేసుకుని భక్తగణాన్ని పెంచుకుని తిరుగులేని శక్తిగా తయారవుతున్నారు. ఈ బాపతు వ్యక్తులను అదుపు చేయకపోతే ఏమవుతుందో మథుర ఉదంతం నిరూపించింది. దీన్ని గుణపాఠంగా తీసుకుని బాధ్యతాయుతంగా మెలగడం, తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం అవసరమని పాలకులు గుర్తించాలి.
కబ్జా స్వాములు!
Published Sat, Jun 4 2016 12:14 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement