టీసీఎస్‌ఎస్ అధ్వర్యంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు
డోవర్: తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి సింగపూర్ పాలిటెక్నిక్ కన్వెన్షన్ సెంటర్, డోవర్లో జూన్ 11న ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొననున్నారని టీసీఎస్‌ఎస్ కార్యవర్గ సభ్యులు వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 విదేశీ గడ్డ పై జరిగిన మొట్టమొదటి వేడుకలు టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్ లోనే కావడం, ఆ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పాల్గొనడం గర్వకారణం అని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ద్వితీయ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సంవత్సరపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొనడానికి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ముదం అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్, ఇతర కార్యవర్గ సభ్యులు తెలియ జేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్ విదేశాల్లో పాల్గొన్న ఏకైక వేడుకలు టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలే అని ఈ సందర్భంగా గుర్తు చేసున్నారు.
సింగపూర్ లో ఉంటున్న తెలంగాణ వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్‌ఎస్ సభ్యులు కోరారు. సింగపూర్ లో తెలంగాణ వాసుల భాష, యాస, సంస్కృతిని ని బావితరాలకు అందజేయడానికి స్థాపించిన టీసీఎస్‌ఎస్‌కు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి ఈ సందర్భంగా అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.