సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్రలో మంచు దుప్పటి పరచుకోనుంది. ఇప్పటికే కొద్దిరోజుల నుంచి ఇది కొనసాగుతోంది. రానున్న కొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఆకాశం నిర్మలంగా ఉండి, గాలులు వేగంగా వీయకపోవడం వల్ల ఉపరితలంలో నిశ్చల పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ధూళి కణాలు అడ్డుకోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రజలు ఈ పొగమంచు బారిన పడకుండా దూరంగా ఉండడం మంచిదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ సాక్షికి చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు మంచు ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. తెల్లారాక కూడా మంచు తెరలు తొలగకపోవడం వల్ల రోడ్డుపై ముందు వెళ్లే వాహనాల కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో క్రమేపీ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
సాధారణంకంటే పగటి ఉష్ణోగ్రతలు 3-4, రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి ప్రభావం తగ్గుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అనంతపురంలో 35 (+4), కడప 35 (+3), జంగమహేశ్వరపురంలో 34 (+3) డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆరోగ్యవరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment