costal area
-
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్‌లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆంధ్రా తీరమే అత్యంత సురక్షితం..
సాక్షి, అమరావతి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం స్పష్టం చేసింది. అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల అండమాన్–నికోబార్ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో తీర రేఖ అధికంగా కోతకు గురవుతోందని వెల్లడించింది. దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఎక్కువగా కోతకు గురవుతోందని తెలిపింది. ఆ తీర ప్రాంతంలో 3,679.91 హెక్టార్ల భూమి తీవ్రంగా కోతకు గురై ందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 973.7 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉండగా.. కేవలం 15 కి.మీ.ల పొడవునా మాత్రమే సముద్రపు అలల ప్ర భావం అధికంగా ఉందని వెల్లడించింది. ఈ నేప థ్యంలో సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికను విశ్లేషించిన పారిశ్రామికవేత్తలు.. పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి, వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రాంతమని చెబుతున్నారు. దేశంలో రెండో అతి పొడవైన తీర ప్రాంతం మనదే.. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశి్చమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డయ్యూ డామన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ప శి్చమ బెంగాల్, లక్షదీ్వప్, అండమాన్–నికోబార్ దీవుల పొడవున 7,516.6 కి.మీ.ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉంది. దేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రంగా గుజరాత్ (1,214.7 కి.మీ.లు) మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ (973.7 కి.మీ.లు) రెండో స్థానంలో నిలిచింది. వాయుగుండాలు, తుపానుల వల్లే.. అతి పొడవైన తీర రేఖ, భారీ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అడ్వైజరీ కమిటీ (సీపీడీఏసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. తీర రేఖపై సముద్రపు అలల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సీడబ్ల్యూసీ అధ్యయనం చేస్తోంది. కోతకు గురైన ప్రాంతాన్ని పరిరక్షించి, అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ వస్తోంది. తాజాగా దేశంలో తీర రేఖపై అలల ప్రభావం గురించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. - బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే వాయుగుండాలు, తుపాన్ల ప్రభావం వల్ల తీరం వైపు వీచే గాలుల వేగానికి రెట్టింపు ఉధృతిలో అలలు ఎగిసిపడటం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. - అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలోనే అధికంగా వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల పశి్చమ తీర రేఖతో పోల్చితే తూర్పు తీర రేఖ అధికంగా కోతకు గురవుతోంది. - బంగాళాఖాతంలో ఉండే అండమాన్– నికోబార్ దీవులకు 1,962 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఉంటే.. అలల ఉధృతి, గాలి వేగానికి 360.1 కి.మీ.ల పొడవునా 987.68 హెక్టార్ల భూమి కోతకు గురైంది. అత్యధికంగా తీర ప్రాంతం కోతకు గురైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్–నికోబార్ దీవులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. - అండమాన్ –నికోబార్ దీవుల తర్వాత అలల ఉధృతి ప్రభావం ఒడిశాపై అధికంగా పడుతోంది. ఒడిశాకు 476.4 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉంటే.. 143.6 కి.మీ.ల పొడవునా కోతకు గురవుతోంది. - 569.7 కి.మీ.ల పొడవు తీర రేఖ ఉన్న కేరళలో 137.33 కి.మీ.ల తీర ప్రాంతానికి కోత తప్పడం లేదు. ఆ తర్వాత తమిళనాడులో 128.88 కి.మీ., గుజరాత్లో 109.76 కి.మీ., మహారాష్ట్రలో 75.16 కి.మీ., పశి్చమ బెంగాల్లో 56.3 కి.మీ., కర్ణాటక 40.19 కి.మీ. పొడవునా తీర రేఖ కోతకు గురవుతోంది. - మడ అడవులను పెంచడం, తీర రేఖను పటిష్టంగా అభివృద్ధి చేయడం ద్వారా అలల ఉధృతి ప్రభావాన్ని తగ్గించవచ్చు. -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు.. 20 శాతానికి పైనే తీరప్రాంతం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీరప్రాంతం 20 శాతానికి పైనే ఉన్నట్లు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) అధ్యయనంలో తేలినట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్రాయ్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఒక మోస్తరుగాను, 0.55 శాతం తీరానికి కోత ముప్పు అతి తీవ్రంగాను ఉందని ఇన్కాయిస్ అధ్యయనం పేర్కొందని వివరించారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వల్ల నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయనిధి నుంచి మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి, దీనికి 2021–22 నుంచి 2025–26 కాలానికి రూ.68,463 కోట్లు కేటాయించామని చెప్పారు. సముద్రకోతల వల్ల తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్ సైన్సెస్ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తూ సాంకేతికపరమైన పరిష్కారమార్గాలను సూచిస్తున్నాయని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించే జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్రాయ్.. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. సైనిక దళాల్లో ఉద్యోగాల భర్తీ కుల ప్రాతిపదికన జరగదని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్ ప్రాతిపదికపైనే ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్ కులాల కోటాలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నిర్వహించే నియామకంలో భర్తీచేస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనాలు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల సామర్థ్యం పెంచడానికి, ప్రయోజనాలు కల్పించడానికి పలు పథకాలు తీసుకొచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి నిరంజన్‌జ్యోతి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం, ఆజీవిక గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్ యోజనలతో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. పలు పథకాల ద్వారా రుణాలు సులభంగా ఇవ్వడంతోపాటు నైపుణ్యాన్ని పెంచి విభిన్న జీవనోపాధి కార్యకలాపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజ్యసభలో యాంటీ డోపింగ్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు రాజ్యసభలో యాంటీ డోపింగ్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బుధవారం బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, ఇది ఔత్సాహిక అథ్లెట్లను నీరుగారుస్తుందని చెప్పారు. భారతదేశంలో డోపింగ్ ఘటనలు అనుకోకుండా జరుగుతున్నవేనన్నారు. సాధారణ నొప్పి, అనారోగ్యం సమయంలో వినియోగించిన ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉండడంపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. స్థానిక అవగాహన కార్యక్రమాలతోపాటు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని సూచించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అవగాహన కార్యక్రమాలు ప్రాంతీయ భాషల్లోను ఉండాలన్నారు. దేశంలో టెస్టింగ్ సెంటర్లు పెంచాలని, డోపింగ్ నిరోధక నిబంధనల అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కొరతపై దృష్టి సారించాలని కోరారు. క్రీడాకారుల్ని మనమే రక్షించుకోవాలన్నారు. వారిలో నిజమైన స్ఫూర్తిని తీసుకురావాలని సూచించారు. -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
తుపాను ప్రభావం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షం నగర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మరొకొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై తుపాను ప్రసరణ ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావం రాబోయే 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని.. ఇది క్రమంగా బలహీనపడి ఉత్తరం వైపు కదులుతూ ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది. (చదవండి: కోస్తాంధ్రకు మరో తుపాను!) గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతం, తమిళనాడు, పాండిచరి రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాల్లో అక్టోబర్10-12 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. చదవండి: మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా...! -
దక్షిణాదికి ఉగ్రముప్పు
పుణే/తిరువనంతపురం/అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని సదరన్ కమాండ్ జీవోసీ(జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్) లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ వెల్లడించారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్ క్రీక్ లేన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ మాకు సమాచారం అందింది. దీతో సర్ క్రీక్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాం’అని తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెన్నైలో మాట్లాడుతూ.. ఆర్మీ సదరన్ కమాండ్ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. అందుకే, జనరల్ సైనీ తెలిపిన ప్రకారం ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి’అని వివరణ ఇచ్చారు. దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు. ‘కీలక సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్ స్టేషన్లతోపాటు ఎస్పీఎఫ్ విభాగాన్ని మా కంట్రోల్ రూం అప్రమత్తం చేస్తోంది. ముఖ్యం గా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటే శ్వరాలయం, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం’అని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జన సమ్మ ర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసు లను కేరళ డీజీపీ లోకనాథ్ బెహరా కోరారు. -
భారత్‌లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
ఓ మనిషీ! తెలుసుకో ఇందులో పరమార్థం
సాక్షి, తూర్పుగోదావరి : సముద్రం తన గర్భంలో ఏదీ ఉంచుకోదు ... ఆలస్యమవొచ్చేమోగానీ అంతా బయటకు తన బలమైన కెరటాలతో విసిరికొట్టేస్తోంది. సముద్రమే కాదు నది, సరస్సు, చిన్న చెరువైనా అంతే చేస్తుంది. ‘ఛీ...ఫో’ అని అంటున్నా అన్ని జలాలూ ఒక్కటై ఛీత్కరిస్తున్నా ... అర్థం చేసుకోకుండా నిస్సిగ్గుగా అన్ని నీటి వనరులనూ తమ శక్తికొలదీ కలుషితం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనుషులు తయారయ్యారు. ఇందుకు ఉదాహరణే అల్లవరం మండలంలోని ఓడలరేడు సముద్ర తీరప్రాంతం. ఇటీవల గోదావరి నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వివిధ రకాల వేల టన్నుల వ్యర్థాలు సముద్రంలో కలిశాయి. వీటిని భీకర అలలతో సముద్రుడు తీరంవైపు బలంగా విసిరేయడంతో ఓడలరేవు నదీ సంగమ ప్రాంతం నుంచి కొమరగిరిపట్నం వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున రాకాసి కొండల్లా పేరుకుపోయాయి. చెత్త, ప్లాస్టిక్ సీసాలు, మద్యం సీసాలు, చెట్లు, చేమలతోపాటు మృత కళేబరాలు నాలుగు అడుగుల ఎత్తులో పేరుకుపోయాయి. ఈ కాలు ష్యం కారణంగా మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ మనిషీ ఇదిగో వ్యర్థం ... తెలుసుకో ఇందులో పరమార్థం’ అని ప్రకృతి పరోక్షంగా హెచ్చరిస్తున్నా మార్పు కనిపించడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా... ఈ పరిస్థితి పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చి మానవ మనుగడకు ముప్పు తెస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. – అల్లవరం (అమలాపురం) ఫొటో: కట్టా మురళీ కృష్ణ -
తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడ రేవుల్లోనూ ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరానికి అనుకుని కొనసాగుతోంది. బాలాసోర్ కు ఆగ్నేయం గా 70 కి.మి, పశ్చిమ బెంగాల్ లోని డిఘా కు దక్షిణ ఆగ్నేయంగా 70 కి.మి దూరంలో కేంద్రీ కృతమైంది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య బాలసోర్ కు సమీపంలో బుధవారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కి.మి వేగం తో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
ముందుకొస్తున్న ముప్పు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న ఉద్దానం ప్రజలకు కష్టాలు వీడటంలేదు. తిత్లీ తుఫాన్‌తో సర్వస్వం కోల్పోయిన ఉద్దానం రైతాంగాన్ని సముద్రం రూపంలో ప్రకృతి ఇంకా భయపెడుతునే ఉంది. మండలంలోని దున్నవూరు పంచాయతీ, గెడ్డవూరు ప్రాంతం, భేతాళపురంలలో సుమారు 100 మీటర్లను దాటించి సముద్రం ముందుకు వచ్చేస్తోంది. నాలుగైదు రోజులుగా తీరంలోని కొబ్బరి, జీడిమామిడి తోటల వరకు అలలు తాకుతున్నాయి. భేతాళపురం తీరంలో సముద్రం మరింత ముందుకు వచ్చి చెట్లను పెకలిస్తోంది. ఇదే గ్రామంలోని గుంటు గున్నయ్య అనే రైతుకు చెందిన కొబ్బరి, టేకు, తాటి చెట్లు కూలిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. అలల తాకిడికి తీరం కోతకుగురవుతోంది. ఆలయాలకు ముప్పు.. మత్స్యకారులు తీరంలో దేవతలు, గ్రామదేవత, అమ్మవార్లకు చిన్న, చిన్న ఆలయాలు నిర్మించుకుని వేటకు వెళ్లే ముందు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. సముద్రం ముందుకు రావడంతో ఈ ఆలయాల వరకు అలలు వస్తున్నాయి. ఇసుకలో నిర్మితమైన ఈ ఆలయాలు సముద్రుడు ఆగ్రహిస్తే కూలిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి తీరంలో విహారానికి ఉపయోగపడే ఇసుక దిబ్బలు సముద్రంలో కలిసిపోగా, అదే పరిస్థితి మందస మండలంలో కూడా నెలకొంది. భేతాళపురం, రట్టి, లక్ష్మీపురం, గంగువాడ తదితర ప్రాంతాల్లో అలల ప్రవాహానికి నీటి తాకిడి పెరుగుతుండడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర ప్రాంతవాసులు భయపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా చెట్లు కూలిపోతుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆందోళనగా ఉంది.. ఎన్నడూలేని విధంగా సముద్రం ముందుకు వస్తోంది. నీటి ప్రవాహానికి చెట్లు కూలిపోతున్నాయి. నా తోటలోని కొబ్బరి, టేకు చెట్లు సముద్రం ముందుకు రావడంతో పడిపోయాయి. తిత్లీ తుఫాన్ సమయంలో తీవ్ర నష్టం కలిగించింది. ఈ నష్టం నుంచి తేరుకోక ముందే సముద్రం భయపెడుతోంది. సుమారు నెల రోజులుగా అలల తాకిడి పెరుగుతోంది. సాధారణ స్థాయిని దాటింది. తోటలు, ఒడ్డు వరకు సముద్రం ఎప్పుడూ రాలేదు. నేటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. – గుంటు గున్నయ్య, బాధిత రైతు, భేతాళపురం, మందస -
దేవుడి ముసుగులో.. పర్యాటక స్థలం ఆక్రమణ
పూసపాటిరేగ: ఆడ పిల్ల.. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా దీనినే అనుసరిస్తున్నారు. ఆక్రమించేందుకు ఏదైతే ఏం అన్న రీతిలో బరితెగిస్తున్నారు. చింతపల్లి సముద్రతీరంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పర్యాటక స్థలానికి నిర్మించి ఆక్రమించాడు. తొలుత పర్యాటక స్థలానికి ఆనుకొని గుడితో పాటు ప్రహరీ కూడా నిర్మించాడు. ఆ తరువాత పర్యాటకంగా ఆ ప్రదేశం అంతా అభివృద్ధి చెందడంతో గుడి చుట్టూ ఉన్న సుమారు 50 సెంట్లు స్థలంపై ఆయన కన్నుపడింది. వెంటనే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు కూడా ఎత్తేశాడు. చింతపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 115లో వున్న పర్యాటక శాఖ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలోనే ప్రహరీ నిర్మించాడు. ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా పర్యాటక శాఖ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే నిర్మాణాలు జరిగా యా అని చర్చించుకొంటున్నారు. చింతపల్లి బీచ్‌కు వచ్చే పర్యాటకులు వాహనాలు పార్కింగ్‌కు ఉంచే స్థలంలో ని ర్మాణాల జరిగినా పట్టించుకోవడం లేదు. చింతపల్లి పం చాయతీలో అధికార పార్టీకి చెందిన కీలకనేత కావడంతో ప్రజలు అడిగే సాహసం చేయలేపోతున్నారు. పర్యాటకశాఖ అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లం అవడంతో కన్ను పడిందే తడువుగా స్థలాన్ని కబ్జా చేశారు. విచారణ ఆదేశించాలని మత్స్యకార నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకశాఖకు చెందిన స్థలాన్ని అధికారపార్టీ నాయకుడు నుంచి కాపాడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ రామారావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి చింతపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకశాఖ స్థలాన్ని కబ్జాచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎం.శ్రీనువాసురావు, సామాజిక కార్యకర్త పర్యాటక భవనాలు ప్రారంభించాలి సుమారు కోటి రుపాయల నిధులతో నిర్మించిన పర్యాటక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి టూరిజం భవనాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. – మహంతి జనార్దనరావు, పూసపాటిరేగ -
కోస్తాకు మంచు దుప్పటి!
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్రలో మంచు దుప్పటి పరచుకోనుంది. ఇప్పటికే కొద్దిరోజుల నుంచి ఇది కొనసాగుతోంది. రానున్న కొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఆకాశం నిర్మలంగా ఉండి, గాలులు వేగంగా వీయకపోవడం వల్ల ఉపరితలంలో నిశ్చల పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ధూళి కణాలు అడ్డుకోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఈ పొగమంచు బారిన పడకుండా దూరంగా ఉండడం మంచిదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ సాక్షికి చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు మంచు ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. తెల్లారాక కూడా మంచు తెరలు తొలగకపోవడం వల్ల రోడ్డుపై ముందు వెళ్లే వాహనాల కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో క్రమేపీ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంకంటే పగటి ఉష్ణోగ్రతలు 3-4, రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి ప్రభావం తగ్గుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అనంతపురంలో 35 (+4), కడప 35 (+3), జంగమహేశ్వరపురంలో 34 (+3) డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆరోగ్యవరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
'కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడవద్దు'
హైదరాబాద్ : భూ ప్రకంపనలపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిన్న భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6 గా పేర్కొంది. -
కోస్తాంధ్ర,తెలంగాణ మధ్య అల్ప పీడనం
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కర్ణాటక తీరం నుంచి దిశ మార్చుకుని ఉత్తరకోస్తాపై కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర, తెలంగాణ మధ్య అల్పపీడనం కేంద్రీకతృమై ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం వల్ల తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురవగా రానున్న 24 గంటల్లో తెలంగాణతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు తెలిపిన అధికారులు ప్రస్తుతమున్న అల్పపీడనం క్రమంగా తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా కదలి మరో 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని వివరించారు. అల్పపీడనం బలహీనపడితే రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45- 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాలకు సింగరేణిలో సుమారు లక్ష టన్నుల మేరకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. కాకినాడలో 15, నరసాపురంలో 9, గన్నవరంలో 9, విశాఖలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారాయని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లోనూ గతరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.