సాక్షి, అమరావతి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం స్పష్టం చేసింది. అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల అండమాన్–నికోబార్ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో తీర రేఖ అధికంగా కోతకు గురవుతోందని వెల్లడించింది.
దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఎక్కువగా కోతకు గురవుతోందని తెలిపింది. ఆ తీర ప్రాంతంలో 3,679.91 హెక్టార్ల భూమి తీవ్రంగా కోతకు గురై ందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 973.7 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉండగా.. కేవలం 15 కి.మీ.ల పొడవునా మాత్రమే సముద్రపు అలల ప్ర భావం అధికంగా ఉందని వెల్లడించింది. ఈ నేప థ్యంలో సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికను విశ్లేషించిన పారిశ్రామికవేత్తలు.. పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి, వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రాంతమని చెబుతున్నారు.
దేశంలో రెండో అతి పొడవైన తీర ప్రాంతం మనదే..
మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశి్చమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డయ్యూ డామన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ప శి్చమ బెంగాల్, లక్షదీ్వప్, అండమాన్–నికోబార్ దీవుల పొడవున 7,516.6 కి.మీ.ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉంది. దేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రంగా గుజరాత్ (1,214.7 కి.మీ.లు) మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ (973.7 కి.మీ.లు) రెండో స్థానంలో నిలిచింది.
వాయుగుండాలు, తుపానుల వల్లే..
అతి పొడవైన తీర రేఖ, భారీ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అడ్వైజరీ కమిటీ (సీపీడీఏసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. తీర రేఖపై సముద్రపు అలల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సీడబ్ల్యూసీ అధ్యయనం చేస్తోంది. కోతకు గురైన ప్రాంతాన్ని పరిరక్షించి, అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ వస్తోంది. తాజాగా దేశంలో తీర రేఖపై అలల ప్రభావం గురించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది.
కేంద్ర జల సంఘం అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ..
- బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే వాయుగుండాలు, తుపాన్ల ప్రభావం వల్ల తీరం వైపు వీచే గాలుల వేగానికి రెట్టింపు ఉధృతిలో అలలు ఎగిసిపడటం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది.
- అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలోనే అధికంగా వాయుగుండాలు, తుపాన్‌లు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల పశి్చమ తీర రేఖతో పోల్చితే తూర్పు తీర రేఖ అధికంగా కోతకు గురవుతోంది.
- బంగాళాఖాతంలో ఉండే అండమాన్– నికోబార్ దీవులకు 1,962 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఉంటే.. అలల ఉధృతి, గాలి వేగానికి 360.1 కి.మీ.ల పొడవునా 987.68 హెక్టార్ల భూమి కోతకు గురైంది. అత్యధికంగా తీర ప్రాంతం కోతకు గురైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్–నికోబార్ దీవులు ప్రథమ స్థానంలో ఉన్నాయి.
- అండమాన్ –నికోబార్ దీవుల తర్వాత అలల ఉధృతి ప్రభావం ఒడిశాపై అధికంగా పడుతోంది. ఒడిశాకు 476.4 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉంటే.. 143.6 కి.మీ.ల పొడవునా కోతకు గురవుతోంది.
- 569.7 కి.మీ.ల పొడవు తీర రేఖ ఉన్న కేరళలో 137.33 కి.మీ.ల తీర ప్రాంతానికి కోత తప్పడం లేదు. ఆ తర్వాత తమిళనాడులో 128.88 కి.మీ., గుజరాత్‌లో 109.76 కి.మీ., మహారాష్ట్రలో 75.16 కి.మీ., పశి్చమ బెంగాల్‌లో 56.3 కి.మీ., కర్ణాటక 40.19 కి.మీ. పొడవునా తీర రేఖ కోతకు గురవుతోంది.
- మడ అడవులను పెంచడం, తీర రేఖను పటిష్టంగా అభివృద్ధి చేయడం ద్వారా అలల ఉధృతి ప్రభావాన్ని తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment