విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది.
ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
అర్హతలు ఇవే..
కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి.
కాలాబ్రియా గురించి..
కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది.
రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం
ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్‌లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్‌లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్‌లూకా గాల్లో పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపు
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment