ఓ బాలికకు ఇంటి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఓ చర్చి ఫాదర్, సమతా సొసైటీ సభ్యుల చొరవతో ఆమె పాచిపని భారం నుంచి బయటపడింది. తనకు పనిచేయాలని లేదని, చదువుకోవాలని ఉందని చెప్పడంతో రావికమతం ఎస్‌ఐ ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించారు.
రావికమతం(చోడవరం): చాకిరీ నుంచి విముక్తి కల్పించండి, చదువుకుంటానని ఓ గిరిజన బాలిక వినతి మేరకు ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించినట్టు రావికమతం ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జీకే వీధి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొర్రా అనిత(14) తల్లి కొన్నాళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి వెంకటరావు మరో వివాహం చేసుకున్నాడు. ఆపై అనితను సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో నర్సీపట్నంలో ఏఎన్‌ంగా పనిచేస్తున్న అనిత మేనత్త సుబ్బలక్ష్మి ఆమెను నర్సీపట్నం తీసుకువచ్చి గాంధీ అనే ఒక లారీ డ్రైవర్ ఇంట్లో పాచి పనికి నియమించింది.
అయితే కొన్నాళ్లు బాగానే ఉన్న ఆ ఇంటి యజమానులు అనితను కొట్టడం, తిట్టడమే కాక మానసికంగా వేధించడంతో రెండు సార్లు అనిత ఇంటి నుంచి పరారైంది. మేనత్త మళ్లీ వెతికించి అక్కడే పనికి నియమించింది. అనిత మేనత్త సుబ్బలక్ష్మికి ఇటీవల డుంబ్రిగుడకు బదిలీ కాగా, అనితను అక్కడే వదిలి ఆమె వెళ్లిపోయింది. అయితే ఇంటి యజమాని పెట్టే బాధలు భరించలేని అనిత బుధవారం పారిపోయి రావికమతం వచ్చి ఒక చర్చి ఫాదర్‌ను ఆశ్రయించింది. ఆయన స్థానికంగా ఉన్న ఏపీ మహిళ సమత సొసైటీ సభ్యులైన పుష్ప, నాగమణిలకు అప్పగించారు. వారు వివరాలు తెలుసుకుని రావికమతం ఎస్‌ఐ రామకృష్ణకు అప్పగించారు.
ఆయన నర్సీపట్నంలోని ఇంటి యజమాని గాంధీ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే తాము పనులు చేయించలేదని, మా ఇంట్లో వారు అద్దెకు ఉండేవారని వివరించారు. అదంతా అబద్ధమని, తాను ఆ ఇంటికి వెళ్లబోనని, చదువుకోవాలని ఉందని ఎక్కడికైనా పంపించేయండంటూ అనిత కోరడంతో విశాఖలోని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ రామకృష్ణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment