సాక్షి, నిడదవోలు: సంక్రాంతి సీజన్‌లో భోజన ప్రియులకు నోరూరించే పందెం కోడికి (కోజా)కు ప్రతీ ఏటా యమ డిమాండ్ ఉంటుంది. రేటు ఎంతైనా దీన్ని కొనడానికి ఆశక్తి చూపుతారు. సాధారణ రోజుల్లో నాటు కోడి పుంజుకు ఉన్న ధరక 4 రెట్లు అధనంగా కోజా సైజును బట్టి 3 వేల రూపాయల నుంచి 6 వేలకు ధర పలుకుంది. అమ్మడానికి ఎవరైనా ముందుకు వస్తే కొనడానికి జనాలు ఎగబడుతున్నారు.
పందెంలో ఓడిపోయిన కోడి పుంజును కోజా అంటారు. దీని రుచికి భోజన ప్రియులు దాసోహమవుతారు. ఎంతైనా వెచ్చించి కోజాను కొనుగోలు చేస్తారు. కొందరైతే కోజాను తినకపోతే అసలు సంక్రాంతి పండుగ చేసుకున్నట్లుగా భావించరు. దూర ప్రాంతాల నుండి సంక్రాంతికి గ్రామాలకు ఇంటికి వచ్చే ముందు ముఖ్యంగా కోజా గురించి ఆరా తీస్తారు. బంధువులు ముందు పరువు దక్కించుకోవడం కోసం ఎంతకైనా కోజాను కొనడానికి వెనకాడరు. పందెం రాయుళ్ళు రకరకాల పదార్ధాలతో పందెం కోళ్ళను పెంచుతారు. నాటు కోళ్ళను సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటారు. ఇలాంటి పుంజులు కోసి కూర వండుకుని తింటే అహా..ఏమి రుచి అనకమానరు. ఎంతటి వారయినా కోజా రుచికి దాసోహం కాక తప్పదు.