కోదండ రామాలయ విగ్రహాలు ,శిథిలమైన కోదండరామాలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడికే నిలువ నీడ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన భూములున్నా.. అవి అన్యాక్రాంతమై.. ఆలయం శిథిలమైంది. వీటిని భూసేకరణలో అమ్ముకోవడానికి ఆక్రమణదారులు యత్నిస్తున్నారు. సుమారు పది కోట్ల విలువైన ఈ ఆస్తులను కాపాడుకునేందుకు గ్రామస్తులు, దేవాదాయ శాఖ నడుం బిగించింది.
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లావారిగూడెంలో శ్రీకోదండ రామాలయం దీనస్థితిలో ఉంది. ఇక్కడ ఆక్రమణదారులకు టీడీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను కాజేశారు.
భూసేకరణలో కట్టబెట్టేందుకు యత్నం!
అంతేకాక పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ భూములను కట్టబెట్టి పరిహారం హరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ భూముల వ్యవహారంపై దేవాదాయ శాఖ స్పందించి కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం కోర్టులో ఉన్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ భూములను సేకరిస్తున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అవార్డు విచారణలో గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాస్ కాలేదు.
1942లో ప్రతిష్ఠ
చల్లావారిగూడెంలో 1942లో గ్రామపెద్ద, భూస్వామి పెండ్యాల వెంకట రామారావు ఒక పెంకిటింట్లో పంచలోహ విగ్రహాలతో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠించారు. ఆలయ నిర్వహణ కోసం గ్రామంలో ఉన్న తన భూమిలో 42.71 ఎకరాలను ఆలయానికి రాశారు. చాలాకాలం అయనే ఆ భూమిని సేద్యం చేసి వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఖర్చు చేశారు. అయితే 1977లో ఆ భూమిని సేద్యం చేసేందుకు తాడువాయికి చెందిన ఒకరికి కౌలుకు ఇచ్చారు. ఇది అవకాశంగా తీసుకుని ఆ భూమిని తమ కుటుంబంలోని వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి భూమి వారి స్వాధీనంలోకి వెళ్లింది. పెండ్యాల వెంకట రామారావుకు వారసులు లేకపోవడంతో పురుషోత్తంను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం పురుషోత్తం ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. అయితే 2010లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ గుర్తించి సింగిల్ ట్రస్టీగా, కార్యనిర్వహణాధికారిగా పెన్మెత్స విశ్వనాథరాజును నియమించింది.
దీంతో ఆలయ ఆస్తులు గుర్తించి భూముల కోసం కోర్టులో కేసు వేశారు. తాజాగా చల్లావారిగూడెంలో ఉన్న 42.71 ఎకరాల భూమిని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సుమారు 10 ఎకరాలు, పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 32 ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రకటన రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చింతలపూడి పథకంలో సేకరించిన భూమికి నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని ట్రస్టీ విశ్వనాథరాజు భూసేకరణ అధికారులను కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సేకరించిన భూమికి కూడా చెల్లించే నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని కోరారు. ఇదిలా ఉంటే అవార్డు విచారణలో కూడా గ్రామస్తులు 42.71 ఎకరాల భూమి శ్రీకోదండ రామాలయానికి చెందినదని, నష్టపరిహారం ఆలయానికే చెల్లించాలంటూ తమ వాదన వినిపించారు.
ఆలయానికి వందల ఎకరాలు
చల్లావారిగూడెం శ్రీకోదండ రామాలయానికి వందల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. చల్లావారిగూడెం, జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం, టి.నరసాపురం మండంలం బొర్రంపాలెంలో ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ సుమారు 500 ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూములన్నీ వెలికితీస్తే శ్రీకోదండరాముడు అపర కోటీశ్వరుడే..!
Comments
Please login to add a commentAdd a comment