
సాక్షి ప్రతినిధి, ఏలూరు, నిడదవోలు రూరల్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే ఆశావాహులు ప్రస్తుత ఎమ్మెల్యేలపై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాము పోటీలో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలూ గళమెత్తుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు సగం నియోజకవర్గాల్లో ఇదే దుస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆశావాహులు తమ పట్టు నిరూపించుకునే యత్నాలు చేస్తున్నారు.
ఏలూరులో ఇలా..
ఏలూరులో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వెంకటాపురం ఉపసర్పంచ్ ఎన్నికను పార్టీ నుంచి బహిష్కరించిన రెడ్డి అప్పలనాయుడు వర్గం చేజిక్కించుకుంది. గతంలో ఈ ఎన్నికను పార్టీ నాయకులతో రభస సృష్టించి వాయిదా వేయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాట వినని రెడ్డి అప్పలనాయుడిపై రౌడీషీటు తెరిపించారు. దీనికి ఏలూరు ఎమ్మెల్యేనే కారణం అంటూ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. అతనిపై రౌడీషీట్ ఎత్తివేయాలని కోరుతూ రెండురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెడ్డి అప్పలనాయుడు వర్గాన్ని భయపెట్టి తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ నేతలు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆ వర్గంలో ఉన్న 11 మందిలో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీవైపు వెళ్లలేదు. శనివారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో 11 మందితో ఉన్న రెడ్డి అప్పలనాయుడు వర్గానికి చెందిన వీరంగి నాగస్వప్న ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిడదవోలులో ఫ్లెక్సీల రాజకీయం
నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ నాయకుడు కుందుల సత్యనారాయణ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఆ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫొటోలు మాత్రమే వేసి స్థానిక ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఫొటోలు వేయకపోవడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని ఫ్లెక్సీలు పెట్టిన నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ అధినేత తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చారని అందుకే ప్లెక్సీలు ఏర్పాటుచేశానని పార్టీ శ్రేణులకు చెబుతున్నట్లు సమాచారం.
రాత్రికిరాత్రే ప్రధాన సెంటర్లలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం శేషారావు వర్గీయులకు మింగుడుపడటం లేదు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే శేషారావుకూ వచ్చేసారి టిక్కెట్టు ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ నేతలే చర్చించుకున్నారు. ఎమ్మెల్యే సైతం ఆర్వోబీ నిర్మాణానికి అనుమతులు రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పలుమార్లు ప్రకటించారు. కానీ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.201 కోట్లు ఆర్వోబీ నిర్మాణానికి మంజూరయ్యాయని ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు రావాల్సి ఉండటంతో సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తికావాలంటే మరో ఏడాదిపైనే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని, ఆర్వోబీ నిర్మాణమైతే ఆ క్రెడిట్ చంద్రబాబు, ఎంపీకి దక్కుతుంది తప్ప ఎమ్మెల్యేకు ఎందుకు దక్కుతుందని కొంతమంది ఆ పార్టీ నేతలే పెదవివిరుస్తున్నారు. గత ఎన్నికల్లో పెరవలి మండలంలో తాను సహకరించకపోతే శేషారావు ఓడిపోయేవాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై తానే పోటీచేస్తానని ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన నాయకుడు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉన్నా, ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తిగా ఉన్న నేతలు మాత్రం రహస్యంగా వెళ్లి ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన నాయకుడిని కలుసుకుని తమ మద్దతు తెలుపుతున్నారు.