బైక్ కొంటే పెట్రోలు ఫ్రీ అన్న ప్రకటనలు మీరెప్పుడైనా చూశారా? ఐదు, పది లీటర్ల పెట్రోలు ఇవ్వడం గొప్ప కాకపోవచ్చుగానీ.. స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీ ఐదేళ్లపాటు కారుకు ఇంధనం ఉచితంగా ఇచ్చేస్తామని ప్రకటించింది. అవునండి.. ఇది నిజం. ఫొటోలో కనిపిస్తోందే.. ఆ కారు పేరు యూనిటి. పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది. మోడల్‌ను బట్టి ఇద్దరు లేదంటే నలుగురు వెళ్లగలిగే ఈ కారు బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో విద్యుత్తు కారును తయారు చేయడం వరకూ బాగానే ఉందిగానీ.. కరెంటు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? అంటే ‘‘కారు కొన్న తరువాత చాలామంది తమ ఇళ్లల్లోనే ఛార్జింగ్ చేసుకుంటారు. ఈ విద్యుత్తు తయారీ వెనుక మళ్లీ కాలుష్యకారక శిలాజ ఇంధనాలు ఉంటాయి.
అందుకే మేము వినూత్న రీతిలో కేవలం సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును యూనిటీ కార్ల కోసం ఐదేళ్లపాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం’’ అంటారు టోబియాస్ ఎక్‌మాన్. సౌరశక్తి సరఫరాకు యూనిటి ఇప్పటికే ఈ–ఆన్ అనే కంపెనీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కారు తయారీ, ఇంధనం విషయంలో కొత్త పోకడలకు తెరతీసిన యూనిటి అమ్మకాల విషయంలోనూ అంతే వినూత్నంగా ఆలోచన చేస్తోంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో మొబైల్ ఫోన్లు కొనుక్కున్నట్లుగానే తమ కార్లను కూడా కొనుక్కోవచ్చునని.. ఆర్డర్ వచ్చిన తరువాత నేరుగా వినియోగదారుడి ఇంటికే కారు డెలివరీ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇంకో విషయం.. ఇప్పటికే దాదాపు వెయ్యి కార్లకు అర్డర్లు అందుకున్న యూనిటి కారు... స్వీడన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి వచ్చేది నేడే!
Comments
Please login to add a commentAdd a comment