రాయచోటి టౌన్ : యువత వివిధ కారణాల రీత్యా పెడదోవ పడుతోంది. సంపాదన కోసం పెడదారి పట్టడానికి కూడా వెనకాడటం లేదనడానికి ఎర్రచందనం కూలీలే (యువకులే) నిదర్శనం. బుధవారం ఎర్రచందనం అక్ర మ రవాణాలో పట్టుబడిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమిళ మణి (22) యువకుడు బీటెక్ చదివాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడంతో జీవనోపాధి కోసం ఒక యజమాని వద్ద ఒక చిరుద్యోగంలో చేరాడు. ఆయన వద్ద వచ్చే సంపాదనతో ఇల్లు గడవడమే కష్టమైంది.
ఇంతలో చెల్లి పెళ్లి కుదిరింది. ఏమి చేయాలో దిక్కుతోచక తాను పని చేస్తున్న యజమాని వద్దకు వెళ్లి తన సోదరి వివాహం కుదిరిందని.. కొంత డబ్బులు ఇస్తే ఉద్యోగం చేసే సమయంలో నెలనెలా కొంత మొత్తం కడతానని చెప్పారు. ఆ యువకుడి అవసరాన్ని తన ఆయుధంగా మార్చుకున్న యజమాని తాను ఇచ్చే డబ్బులు నెల నెలా తీర్చాల్సిన అవసరం లేకుండా మంచి అవకాశం ఇస్తానని, ఒక సారి తాను చెప్పిన పని చేస్తే లక్షాధికారి అవుతావని నమ్మించాడు. ఆ యువకుడు ఇదేదో చాలా బాగుందనుకొని అందుకు సరేనన్నాడు. ఏమి చేయాలని అడిగాడు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి వైఎస్సార్ జిల్లాలోని అడవులలో ఎర్రచందనం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటలు నమ్మి వెంటనే రంగంలోకి దూకాడు. వచ్చిన మొదటి రోజే పోలీసులకు దొరికిపోయాడు. ఇది తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమళి మణి నిజ జీవిత చరిత్ర.
Comments
Please login to add a commentAdd a comment