విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి జాతరలో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జాతరను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు.
తొలిఏరుగా రైతులు జరుపుకునే పండగలో భాగంగా వేకువజామునుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజాధికాలను నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సంప్రదాయం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పుల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.


