Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt One Year Rule By Vardhelli Murali1
ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!

చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్‌’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒక వ్యూ పాయింట్‌.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్‌ వియ్యంకుడు ప్లస్‌ మాస్‌ మసాలా హీరో – బాక్సాఫీస్‌ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్‌ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్‌లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్‌ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్‌ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్‌లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్‌ వలసల్లో డైలీ షటిల్‌ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్‌ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్‌’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్‌ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్‌ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్‌’ నివేదికలోని అంశాన్ని జగన్‌ జనం ముందు పెట్టారు. జగన్‌ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్‌’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్‌మోహన్‌రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్‌ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్‌ రూమ్‌ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్‌ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్‌ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్‌ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్‌ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్‌ ది క్లాక్‌ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్‌ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్‌ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్‌ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్‌ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్‌మోహన్‌రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Chandrababu Govt Amaravati Capital construction works scam2
ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు

సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్‌) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్‌ స్టార్‌ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్‌ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్‌ బిల్డింగ్‌కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–­రూ.4,500కు మించ­దని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చ­ర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మా­ణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివా­లయం (ఐదు ఐకానిక్‌ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల నివాసాల (క్వార్టర్స్‌) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్‌ కేపిటల్‌ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్‌లో పేర్కొన్నారు. కానీ.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్‌ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపు­లతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థ­లకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తి­గత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాల­యం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్‌ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐదు ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ృజెనిసిస్‌ ప్లానర్స్‌ృడిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్‌లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తు­లతో.. ఐదో టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్‌ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్‌ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Shah Rukh Khan As Brand Ambassador of Candere3
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Centre, and states work together like Team India says PM Narendra Modi4
మనమంతా టీమిండియా

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్‌–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్‌ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్‌ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్‌ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్‌ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్‌ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్‌ తమాంగ్‌ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్‌ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్‌ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ జోస్యం చెప్పారు.నవ్వుల్‌ పువ్వుల్‌ ఆయోగ్‌ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్‌ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌), కొన్రాడ్‌ సంగ్మా (నాగాలాండ్‌) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు.

Kohlis branding is worth Rs 1900 crores5
బ్రాండ్‌ బాజా విరాట్‌

పుష్కర కాలం కిందటి మాట. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన చివరి సిరీస్‌ ఆడుతున్నాడు. ఆ సిరీస్‌ తొలి టెస్టులో ఒక యువ ఆటగాడు.. ‘ఎంఆర్‌ఎఫ్‌’స్టిక్కర్‌ అంటించి ఉన్న బ్యాట్‌తో తొలిసారి క్రీజ్‌లో వచ్చాడు. అప్పటివరకు భారత అభిమానుల దృష్టిలో ‘ఎంఆర్‌ఎఫ్‌’బ్యాట్‌ అంటే సచిన్‌దే. ఇప్పుడు మరో యువ ప్లేయర్‌ బ్యాట్‌పై ఫ్యాన్స్‌ ఆ బ్రాండ్‌ను చూశారు. ఆ కుర్రాడు సచిన్‌ స్థాయి ఆటను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. అంతే కాదు.. ఆ తరవాత జరిగిన ‘ఎంఆర్‌ఎఫ్‌’ఒప్పందం భవిష్యత్తులో వాణిజ్యపరంగా కూడా బ్రాండింగ్‌ ప్రపంచంలో ఒక సంచలనమైంది. ఆ యువ ఆటగాడే విరాట్‌ కోహ్లి. నాటితో మొదలుపెట్టి అసంఖ్యాక ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు ఫార్మాట్‌లనుంచి తప్పుకున్నా.. బ్రాండింగ్‌ విలువ ఏమాత్రం తగ్గకపోవడం కోహ్లీ కింగేనని రుజువుచేస్తోంది. స్పోర్ట్స్‌ వేర్, ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, సాంప్రదాయ దుస్తులు, ఎడ్యుకేషన్‌ యాప్, స్నాక్స్, టూరిజం, బెవరేజెస్, న్యూట్రిషన్, ఆటోమొబైల్, భవన నిర్మాణ రంగం... ఇలా విభిన్నమైన రంగాల ఉత్పత్తులకు విరాట్‌ కోహ్లి ప్రచారం చేస్తూ కనిపిస్తాడు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సహజంగానే ఉండే నిబంధనల ప్రకారం ఈ అన్ని ఉత్పత్తులకూ అతను పూర్తి స్థాయిలో ప్రకటనల్లో కనిపించడు. కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సంవత్సరానికి కనీసం 2–3 చోట్ల వ్యక్తిగతంగా పాల్గొనాల్సి ఉంటుంది. మరికొన్నింటిలో సదరు ఉత్పత్తికి సంబంధించి ఒక సంక్షిప్త వ్యాఖ్య మాత్రమే జోడించే స్వల్ప ప్రకటనలో అతను కనిపిస్తాడు. మరికొన్నింటికి సదరు బ్రాండింగ్‌ మాత్రమే కనిపించే జెర్సీ ధరించి లేదా బ్యాట్‌ చేతపట్టి ఒక ఫొటో ఇస్తాడు. దాన్నే వారు వాడుకోవాలి. ఇలా స్థాయిని బట్టి కోహ్లి బ్రాండింగ్‌ రేటు ఉంటుంది. మార్కెట్‌ అంచనా ప్రకారం అతను ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. 8 ఏళ్లకు రూ.100 కోట్లు! విరాట్‌ కోహ్లి కెరీర్‌లో 2014 నుంచి 2019ని అత్యుత్తమ దశగా చెప్పొచ్చు. వరుస రికార్డుల ప్రదర్శనతో అతని స్థాయి ఎంతో పెరగడంతో పాటు వాణిజ్యపరంగా కూడా అతని విలువ శిఖరాగ్ర స్థాయికి చేరింది. అందుకే మొదటిసారి ఎంఆర్‌ఎఫ్‌ చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే తర్వాత చాలా పెద్ద మొత్తం ఆఫర్‌ చేసింది. 2017లో ఎనిమిదేళ్ల కాలానికి రూ.100 కోట్లతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవడం అప్పట్లో సంచలనం. మరోవైపు అదే సమయంలో ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘ప్యూమా’తో బ్రాండింగ్‌ ఒప్పందం అతని కెరీర్‌లో మరో పెద్ద రికార్డు. ‘ప్యూమా’కూడా ఎనిమిదేళ్లకు రూ.100 కోట్లతో జత కట్టడం విశేషం. ‘ప్యూమా’తో కలిసి భాగస్వామ్యంతో కోహ్లి తన సొంత బ్రాండ్‌ను కూడా సృష్టించుకున్నాడు. తన జెర్సీ నంబర్‌ 18ని గుర్తుచేసేలా ‘వన్‌ 8’పేరుతో మార్కెట్లోకి వచ్చిన దుస్తులకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కోహ్లి దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని భాగస్వామ్యం లేదా అతని పేరు ఉన్నాయి. స్టార్టప్‌లలో పెట్టుబడులుముఖ్యంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో కోహ్లీ మొదటి నుంచి ఆసక్తి కనబరిచేవాడు. స్పోర్ట్స్‌ కాన్వో, డిజిట్‌ ఇన్సూరెన్స్, రేజ్‌ కాఫీ, వన్‌8 వంటి స్పోర్ట్స్, ఫ్యాషన్, ఆహారం, పానీయాల విభాగాల్లో ఎన్నో స్టార్టప్‌లలో విరాట్‌ పెట్టుబడులు పెట్టాడు. ఐపీఎల్‌ టీమ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. కానీ ఆ టీమ్‌కు ఉండే విలువ మొత్తం ఒక్క కోహ్లి వల్లనే వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. లీగ్‌ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు జట్టు మారని ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచిన కోహ్లిని చూపిస్తూనే టీమ్‌ బ్రాండింగ్‌ సాగుతుంది. ఇందులో తన వ్యక్తిగత ప్రకటనకర్తలను కూడా చేరుస్తూ అతను ఆ టీమ్‌ వాణిజ్య అంశాలను కూడా శాసిస్తున్నాడు. మరి కోహ్లి విలువ పడిపోతుందా? కోహ్లీ టెస్టులనుంచి రిటైర్‌ కావడం అతడి బ్రాండ్‌ మార్కెట్‌ మీద ఏమాత్రం ప్రభావం చూపదని మార్కెటింగ్‌ వ్యూహకర్త దినేశ్‌ అరోరా అంటున్నారు. ‘బ్రాండింగ్‌ ప్రపంచంలో కోహ్లి ఒక సామ్రాజ్యం నెలకొల్పాడు. అది అంత తొందరగా కనుమరుగు కాదు. దానికి పలు కారణాలున్నాయి. కోహ్లి తన అత్యుత్తమ ఫార్మాట్‌ అయిన వన్డేల్లో కనిపిస్తాడు. ఐపీఎల్‌లో ఒప్పందం ప్రకారం ఎలాగూ కనీసం 2027 సీజన్‌ వరకు అవకాశం ఉంది. పైగా అతను మైదానంలో ఎక్కువగా కనపడకున్నా ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్‌ మరిచిపోయే స్థాయి కాదు అతనిది. సచిన్, ధోని రిటైర్మెంట్‌ తర్వాత కూడా పలు ప్రకటనల్లో ఇంకా కనిపిస్తున్నారు. వారితో పోలిస్తే కోహ్లి బ్రాండింగ్‌ విలువ చాలా ఎక్కువ. కార్పొరేట్‌ సంస్థలు అతనిపై మున్ముందూ నమ్మకాన్ని కొనసాగిస్తాయి’అని ఆయన చెప్పారు.బాలీవుడ్‌ స్టార్లను దాటి... ప్రఖ్యాత బ్రాండింగ్‌ వాల్యుయేషన్‌ సంస్థ ‘క్రోల్‌’ప్రకారం విరాట్‌ ప్రస్తుత బ్రాండింగ్‌ విలువ అక్షరాలా రూ.1900 కోట్లు. 2016 నుంచి 2023 వరకు చూస్తే ఎనిమిదేళ్లలో.. రెండు సార్లు మినహా ప్రతీ ఏటా అతను బ్రాండింగ్‌ విలువ పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. గతేడాది కూడా బాలీవుడ్‌ స్టార్లు షారుఖ్‌ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌లకంటే కూడా కోహ్లి విలువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్‌లో టి20లు, టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఇకపై వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. టీవీల్లో అతను కనిపించడం కాస్త తగ్గుతుంది. ఇన్‌స్ట్రగామ్‌లో పోస్టుకు రూ.10 కోట్లు ఇన్‌స్ట్రగామ్‌లో 27 కోట్ల ఫాలోవర్లు ఉన్న కోహ్లి తన ఒక్కో కమర్షియల్‌ పోస్టుకు దాదాపు రూ.10 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అతను ఒక మాట చెబితే చాలు కోట్లాది మందికి చేరుతుంది కాబట్టి ఆ మొత్తం చెల్లించేందుకు ఎవరూ వెనుకాడరు. విరాట్‌ ప్రచారకర్తగా ఉన్న సంస్థలు ప్యూమా, మింత్రా, హెచ్‌ఎస్‌బీసీ, నాయిస్, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, బ్లూ స్టార్, ఆడి ఇండియా, మాన్యవర్, టూత్‌సి, గ్రేట్‌ లెరి్నంగ్, లక్సర్, వొలిని, వెల్‌మాన్, వివో, డ్యూరోఫ్లెక్స్, అమెరికన్‌ టూరిస్టర్, ఆవాస్‌ లివింగ్, ఎంఆర్‌ఎఫ్, ఎసిలార్, లివ్‌స్పేస్, హెర్బలైఫ్, హీరో మోటార్స్‌ కోహ్లి భాగస్వామిగా ఉన్నవీ.. సొంత కంపెనీలు బ్లూ ట్రైబ్, రేజ్‌ కాఫీ, వన్‌8, హైపర్‌ఐస్, చిసెల్‌ ఫిట్‌నెస్, డిజిట్‌ ఇన్సూరెన్స్, రాంగ్‌ క్లాతింగ్, గ్యాలక్టస్‌ ఫన్‌వేర్, ఐఎస్‌ఎల్‌ టీమ్‌ గోవా ఎఫ్‌సీ, నూవా రెస్టారెంట్, స్పోర్ట్స్‌ కాన్వో, టీమ్‌ బ్లూ రైసింగ్, వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్స్‌ చైన్, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌ బిజినెస్‌

Donald Trump Expands Tariff Threat to Samsung, Other Phone Makers6
సామ్‌సంగ్‌కు ట్రంప్‌ హెచ్చరికలు 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్‌ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్‌ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్‌లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్‌ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్‌ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్‌ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్‌ 2019లో మూతపడింది. సామ్‌సంగ్‌ ఫోన్లు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్‌ కంపెనీకి ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.

427 Rohingya refugees feared drowned in shipwrecks off Myanmar coast7
427 మంది రోహింగ్యాల జల సమాధి

బ్యాంకాక్‌: మయన్మార్‌ ముస్లిం మైనారిటీ వర్గం రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి 427 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం (యూఎన్‌హెచ్‌సీఆర్‌) తెలిపింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మయన్మార్‌ తీరానికి సమీపంలో ఈ దారుణ విషాదం చోటుచేసుకుందని పేర్కొంది. పడవల మునకకు కారణాలు, కచ్చితంగా ఎందరు జల సమాధి అయ్యారనే వివరాలను తెలుసుకునేందుకు కృషి కొనసాగుతోందని వివరించింది. ఈ నెల 9వ తేదీన పడవ మునిగి 267 మంది ప్రాణాలు కోల్పోగా అందులోని కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, 10వతేదీన మరో పడవ మునగ్గా 247 మంది రోహింగ్యాలు చనిపోగా, 21 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ వివరించింది. సజీవులైన వారు బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి, మయన్మార్‌లోని రఖైన్‌ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది.

Weekly Horoscope In Telugu From 25-05-2025 To 31-05-20258
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృషభం...చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...మధ్యలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. పట్టుదల మరింత పెరుగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. పసుపు, నేరేడురంగులు. గణేశాష్టకం పఠించండి.కర్కాటకం....నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీమహావిష్ణుధ్యానం పఠించండి.సింహం....మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కన్య...కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తుల....మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. ఆప్తుల నుంచి పిలుపు రావడంతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్టడిస్తారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికం...ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశాలు మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. శ్రీసూర్యప్రార్ధన మంచిది.ధనుస్సు...మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్‌లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో విభేదాలు. ఎరుపు, నీలం రంగులు. హయగ్రీవ ధ్యానం చేయండి.మకరం....నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. తెలుపు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.కుంభం...అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత వరకూ సానుకూలం. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీకృష్ణస్తుతి మంచిది.మీనం....ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువుల వైఖరితో మనస్తాపం చెందుతారు. వ్యాపారాలు స్వల్ప లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో కొంత జాప్యం. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు ఆచితూచి అడుగువేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఆస్తిలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Sakshi Guest Column On Maoists eradication just for sake of corporates9
కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?

‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్‌ ప్లాస్క్‌ను రాయ్‌పూర్‌లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్‌ ప్లాస్క్‌ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌’ (ఐఆర్‌ఆర్‌ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్‌–36, ఐఆర్‌–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్‌ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్‌ బ్రెనన్‌ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్‌ కగార్‌’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్‌ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్‌ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్‌ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్‌ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్‌ సెన్స్‌లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్‌ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్‌ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు

Pakistan Army commander abandoned battlefield10
పారిపోండ్రోయ్‌..!! 

ఇస్లామాబాద్‌: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్‌ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌ సైనిక స్థావరంపై భారత్‌ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్‌ బ్రిగేడ్‌ కమాండర్‌ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్‌ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్‌ కమాండర్‌ వివరాలు అక్కడి ఒక జూనియర్‌ ఆఫీసర్‌ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్‌ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్‌ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్‌ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్‌ ఆక్రమిత కశీ్మర్‌లోని ముజఫరాబాద్‌ వద్ద పాక్‌ ఆర్మీలోని 75వ ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్‌ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్‌ స్థావరం మీదా భారత్‌ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్‌ గురించి అక్కడి జూనియర్‌ అధికారి ఆరాతీశాడు. కమాండర్‌ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్‌ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్‌కు రావాలని జూనియర్‌ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్‌ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్‌ ఆఫీసర్‌ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్‌ వివరాలను భారత సైన్యం డీకోడ్‌ చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement