Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan extends Ramzan greetings1
ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్‌ పండుగ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌ఠిన‌మైన ఉప‌వాస దీక్ష‌లు ముగించుకుని ప్రేమ‌, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్ర‌తీక అయిన రంజాన్ పండుగ‌ను జ‌రుపుకుంటున్న ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

Donald Trump Says third Presidential Term IN USA2
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్‌ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఓ న్యూస్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

CM Chandrababu makes inappropriate comments on poor people once again3
బీసీల ఆలోచన ఆ పూటకే!

సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్‌ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్‌ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణు­లను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్‌మెయిల్‌ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్య­లు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆది­నారాయణ­రెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్‌కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్‌ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్‌ వల్ల అబ్దుల్‌ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్‌ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్‌ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్‌ టెన్‌లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్‌ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తు­న్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్‌ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్‌కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్‌­కుమార్‌ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మా­న్యు­యేల్‌ తన కూతుర్ని ఎంబీబీఎస్‌ చదివించాలని కోరగా మెయిల్‌ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్‌ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్‌లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్‌ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్‌, మాజీ మంత్రి

IPL 2025: CSK Captain Ruturaj Gaikwad Comments After Losing To Rajasthan Royals4
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్‌ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇది తొలి విజయం.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్‌ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్‌ (16 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), రియాన్‌ పరాగ్‌ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్‌ (16 బంతుల్లో 19; ఫోర్‌, సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్‌ను ఔట్‌ చేశాక సీఎస్‌కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్‌ అహ్మద్‌ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్‌ వేశారు. ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. ఓవర్టన్‌ (2-0-30-0), అశ్విన్‌ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కేకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్రను ఈ సీజన్‌లో చెత్త ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్‌ డకౌట్‌ చేశాడు. అనంతరం రుతురాజ్‌ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్‌) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్‌ ప్రతి ఓవర్‌లో వికెట్‌ తీసి సీఎస్‌కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్‌కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్‌కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్‌ చేశాడు. 18వ ఓవర్‌లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్‌కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌లో తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో సీఎస్‌కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆర్చర్‌కు (3-1-13-1) చివరి ఓవర్‌ ఇవ్వకుండా రాయల్స్‌ కెప్టెన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్‌కు బదులుగా సందీప్‌ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్‌ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్‌ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్‌కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్‌ నాలుగో బంతికి సిక్సర్‌ బాది సీఎస్‌కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్‌ను సందీప్‌ శర్మకు ఇవ్వడంతో టెన్షన్‌ పడ్డ రాయల్స్‌ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్‌ల తర్వాత) రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్‌.మ్యాచ్‌ అనంతరం లూజింగ్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్‌ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్‌కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ‌ఫీల్డ్‌ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్‌పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్‌ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్‌ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్‌ కాలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్‌లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్‌లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు.

Myanmar Thailand Earthquake updates Death toll reaches 1,7005
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!

నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్‌(Myanmar, Thailand)లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. సుమారు 3,400 మంది గాయపడ్డారని, 300 మంది గల్లంతయ్యారని తెలిపింది.బ్యాంకాక్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే..బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ(Bangkok Metropolitan Authority) తెలిపిన వివరాల ప్రకారం 32 మంది గాయపడ్డారు. 82 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వీరు నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్‌లో గల్లంతయ్యారని సమాచారం. ఈ భూకంపం మధ్య మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా సంభవించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.సాయం కోసం రెడ్ క్రాస్ విజ్ఞప్తిభూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ(International Red Cross and Red Crescent Society)ల సమాఖ్య (ఐఎఫ్‌ఆర్‌సీ)100 మిలియన్‌ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకూ పెగుతున్నాయని పేర్కొంది. రాబోయే 24 నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధులు అవసరం కానున్నాయని పేర్కొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. ఇది విపత్తు మాత్రమే కాదని, సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్‌ఆర్‌సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ పేర్కొన్నారు.‘ఈ సమయంలో వైమానిక దాడులా?’1,700 మందిని బలిగొన్న భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్నసమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్ నేషనల్ యూనియన్ జంటా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ పరిస్థితులలో సైన్యం సహాయ చర్యలకు ముందుకు వస్తుందని, అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని పేర్కొంది. #OperationBrahma continues. @indiannavy ships INS Karmuk and LCU 52 are headed for Yangon with 30 tonnes of disaster relief and medical supplies.🇮🇳 🇲🇲 pic.twitter.com/mLTXPrwn5h— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 30, 2025భారత్‌ నుంచి 30 టన్నుల సహాయక సామగ్రిభారత నావికాదళ నౌకలు మయన్మార్‌కు 30 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కార్ముక్, ఎల్‌సీయూలు 52 భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకువెళ్లాయని అయన పేర్కొన్నారు. ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని తెలిపారు. ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ‘ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోంది. భారత నావికాదళ నౌకలు 30 టన్నుల సహాయక, వైద్య సామాగ్రితో యాంగోన్‌కు వెళ్లాయని తెలిపారు."మయన్మార్‌కు భారత రెస్క్యూ బృందంభారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం 10 మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక బృందం మయన్మార్‌లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mandalay International Airport) చేరుకుంది. ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ‍ప్రయత్నాలు ప్రారంభించింది. భారీ పరికరాలు, సహాయక సామగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించనుంది. కాగా భారత నేవీ నౌకలు సహాయ సామగ్రిని మయన్మార్‌కు తీసుకువెళుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.‘సహాయం అందినా ప్రాణం పోయింది’మయన్మార్‌లోని మండలేలో కూలిపోయిన అపార్ట్‌మెంట్‌ శిథిల్లాల్లో ఒక గర్భిణి 55 గంటల పాటు చిక్కకుపోయింది. రెస్క్యూ సిబ్బంది బాధితురాలు, 35 ఏళ్ల మాథు తుల్విన్ ప్రాణాలను కాపాడారు. అయితే స్కై విల్లా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుండి ఆమెను బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది.‘హూ’నుంచి మూడు టన్నుల వైద్య సామగ్రిమయన్మార్‌ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)దాదాపు మూడు టన్నుల వైద్య సామగ్రిని పంపింది. ట్రామా కిట్లు,టెంట్లతో సహా వైద్య సామగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆసుపత్రికి చేరుకున్నాయని ‘హూ’ ఒక ప్రకటనలో తెలిపింది. భూకంప సంభవించిన 24 గంటల వ్యవధిలోపునే యాంగోన్‌లోని అత్యవసర వైద్య సామగ్రి నిల్వ నుంచి ఈ సామగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ధ్వంసమైన 50 మసీదులుమయన్మార్‌లో శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు ముస్లింలు చేరుకుంటున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రమాదం బారినపడి వందలాది మంది ముస్లింలు మృతిచెంది ఉంటారనే అంచనాలున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, మండలేలో ఉంటున్న ఒక ముస్లిం తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మసీదు పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోయిందని, తన అమ్మమ్మ, ఇద్దరు మామలు శిథిలాల కింద చిక్కకున్నారని తెలిపారు. నగరంలో శిథిలాల భవనాలు అలానే ఉన్నాయని, రెస్క్యూ బృందాలు అందించే సాయం సరిపోవడం లేదని ఆయన కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 50కి పైగా మసీదులు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం

Students Protests In HCU Over Land Issue6
HCU వద్ద హైటెన్షన్‌.. భారీగా పోలీసుల మోహరింపు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్‌ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025

Health problems To online food order7
మామా.. ఆర్డర్‌ చేస్తున్నా..!

ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్‌ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్‌ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్‌ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్‌ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడు­తు­న్నారు. బాగా చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ప్రభు­త్వం ఉద్యోగం, డాక్టర్‌ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాల­కు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పు­డు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్‌ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్‌ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్‌ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్‌ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్‌ డేంజర్‌..? అధికంగా బయట ఫుడ్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్‌ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయ­ట ఫుడ్‌ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూ­ట్యూ­బ్‌ చూసి వండిన ఆ టేస్ట్‌ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్‌ ఫుడ్‌పై పడిపోతున్నా­రు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నా­రు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్‌ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్‌లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లా­లో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొ­చ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నా­యి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్‌ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు

Harish Shankar Comments On Children Refused With Her Wife8
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్

టాలీవుడ్‌ డైరెక్టర్‌ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్‌ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్‌ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్‌, గబ్బర్‌ సింగ్‌, దువ్వాడ జగన్నాథం వంటి హిట్‌ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్‌ శంకర్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్‌ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్‌ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్‌ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్‌ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. ​పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్‌ శంకర్‌ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కేవీఎన్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

COMPOUNDING Relief against income tax offences9
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..

ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్‌ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్‌ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్‌ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్‌ ప్రాసిక్యూషన్‌ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్‌మెంట్‌ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్‌ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్‌ కేసుల్లో ముందుగా స్పెషల్‌ పర్మిషన్‌ తీసుకుని గానీ రిలీఫ్‌ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ పర్మిషన్‌ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్‌ వ్యక్తులు 👉 టీడీఎస్‌ విషయంలో ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్‌ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్‌ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్‌ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగుతుంది. ఫైన్‌ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Iran Counter To USA Donald Trump10
ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్‌

దుబాయ్‌: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఇరాన్‌ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్‌ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మసూద్‌..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్‌ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్‌ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్‌ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.మరోవైపు.. ఇరాన్‌ను అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.ఇక, ట్రంప్‌ మొదటి హయాంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement