నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కార్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టాన్ని నీరుగార్చే విధంగా నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయటాన్ని సవాలు చేస్తూ మేధా పాట్కార్ పిటిషన్ వేశారు. పిటిషన్లో.. నిర్వాసితుల ఉపాధికి భద్రత కల్పించకుండా, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సామాజిక ప్రభావ మదింపు అంచనా వేయకుండా భూసేకరణ జరపడం కేంద్ర చట్టానికి విరుద్ధమన్నారు. కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆర్డినెన్సు తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రైతులు, భూ యాజమానుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా భూసేకరణ చట్టాన్ని సవరణలు చేశారని మండిపడ్డారు. జీవనోపాధి అనే ప్రాథమిక హక్కును హరిస్తున్నారని, భూసేకరణ కింద తీసుకున్న భూమిని ఉపయోగించకుండా తిరిగి వెనక్కి తీసుకునే అవకాశాన్ని కూడా చేశారని మేధా పాట్కర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరుపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.