జీతాలు రాక.. అధికారులు పట్టించుకోక
వేలేరుపాడు : పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందక మూడు నెలలుగా నానా అవస్థలు పడుతున్నారు. ఈ రెండు మండలాలకు సంబంధించి కొత్త సబ్‌ట్రెజరీ (ఎస్టీవో) కార్యాలయాన్ని ప్రభుత్వం ఏప్రిల్ 21న కుక్కునూరులో ప్రారంభించింది. జూన్ ఒకటో తేదీ నుంచి కార్యాలయ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. గతంలో ఈ రెండు మండలాల ఉద్యోగులకు జంగారెడ్డిగుడెం సబ్‌ట్రెజరీ నుంచి జీతాలు, టీఏ బిల్లులు చెల్లించేవారు. అప్పుడు సమయానికి జీతాలు అందేవి.
కానీ కుక్కునూరులో ట్రెజరీ కార్యాలయం ఏర్పాటయ్యాక ఉద్యోగుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ ట్రెజరీలో సిబ్బందిని అరకొరగా నియమించారు. మొత్తం ఐదుగురు ఉండాల్సి ఉండగా ముగ్గురే ఉన్నారు. సీనియర్ ఎకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కొత్త ట్రెజరీకి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ నంబర్ (డీడీఓ రిజిస్ట్రేషన్ నంబర్) డైరెక్టర్ ట్రెజరీ ఎకౌంట్స్ కార్యాలయం హైదరాబాద్ నుంచి కేటాయింపు కాలేదు. ఈ కారణంగా మూడు నెలలుగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని, అప్పుడు కూడా ఎవరూ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
జూన్ నుంచి జీతాల్లేవ్
మాది బుట్టాయిగుడెం. జూన్ నెలలో వేలేరుపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలిగా చేరాను. మూడు నెలలుగా కోడ్ నంబర్ లేదంటూ జీతాలు చెల్లించడంలేదు. మాకు ఈ ప్రాంతం కొత్త కావడంతో నానా అవస్థలు పడుతున్నాం. మా గోడు ఎవరికీ పట్టడంలేదు. – పూనెం గౌతమి, ఉపాధ్యాయురాలు, వేలేరుపాడు
జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి
కోడ్ సాకుతో జీతాలు చెల్లించకుంటే ఎలా పొట్ట నింపుకోవాలి? కొత్తగా ట్రెజరీ పెట్టినప్పుడు అన్నీ సమకూర్చాలి. కానీ విలీన మండలం కావడంతో ప్రభుత్వం గాలికి వదిలేసింది. – బొడ్డు రాజు, ఉపాధ్యాయుడు, వసంతవాడ