శకలం.. కలకలం!
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని నాతవరం అటవీ ప్రాంతంలో విమాన శకలం దొరికిందన్న ప్రచారం పెద్ద కలకలం రేపుతోంది. ఈ అడవుల్లో వారం రోజుల క్రితం పెద్ద శబ్దం విన్నామని, అది విమానమై ఉండవచ్చంటూ నాతవరం మండలం దద్దుగుల గ్రామస్తులిచ్చిన సమాచారంతో వైమానిక దళం, అటవీశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శనివారం పొద్దుపోయే హెలికాప్టర్లతో వరకు గాలింపు చర్యలు చేపట్టినా అలాంటి ఆనవాళ్లేమీ వారికి దొరకలేదు. ఈ నెల 22న వాయుసేన విమానం ఏఎన్–32 ఎయిర్క్రాఫ్ట్ చెన్నైలోని తాంబరం బేస్ నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ అదశ్యమైన నేపథ్యంలో ఈ తాజా ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. అదశ్యమైన ఎయిర్క్రాఫ్ట్ కోసం బంగాళాఖాతం జలాల్లో పలు యుద్ధనౌకలు, వైమానికదళ విమానాలు గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ తరుణంలో మన జిల్లాలోని నాతవరం పరిసరాల్లోని అడవుల్లో విమాన శకలాన్ని పోలిన వస్తువు దొరికిందన్న ప్రచారం ఆదివారం సాయంత్రం తీవ్రతరమైంది. ఎన్ఏడీ ప్రాంతంలో ఏ నలుగురు కూర్చున్నా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఆ శకలాన్ని దొరికిన ప్రాంతం నుంచి ఎన్ఏడీకి తెచ్చినట్టు చెబుతున్నారు. ఆ శకలం ఏమిటన్నది నిగ్గు తేల్చేందుకు హుటాహుటీన ఢిల్లీ పంపించినట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నాతవరం అటవీప్రాంతంలో శకలం దొరికిందన్న ప్రచారాన్ని ఎన్ఏడీ అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఇప్పటికే అదశ్యమైన విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు దాదాపు పది రోజులుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. తమ వారు సజీవంగా ఇంటికొస్తారన్న గంపెడాశతో ఉన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు కూడా బాధితుల ఇళ్లకు వచ్చి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నారు.